ప్రపంచ దేశాల ముందు భారత క్రికెట్ కు తలవంపు  తీసుకొచ్చే సంఘటన మరొకటి బయటపడింది. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక ప్రీమియర్ లీగుల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే భారీ బెట్టింగ్ కూడా సాగినట్లు తాజాగా బయటపడింది. ఏకంగా ఓ జట్టు యాజమాన్యమే బుకీల అవతారమెత్తి బెట్టింగ్ పాల్పడినట్లు బెంగళూరు పోలీసులు  గుర్తించారు. దీంతో ఈ ఉదంతం భారత క్రికెట్లో మరింత కలకలాన్ని సృష్టింస్తోంది. 

ఇటీవల జరిగిన కర్ణాటక ప్రీమియర్ లీగ్ విజయవంతంగా ముగిసింది. అయితే ఈ లీగ్ బెళగావి పాంథర్స్ జట్టు యాజమాన్యం భారీ అవకతవకలకు పాల్పడినట్లు బెంగళూరు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ఈ జట్టు యజమాని అలీ అష్వాక్ బుకీగా మారి బెట్టింగ్ లకు పాల్పడ్డాడని గుర్తించి అరెస్ట్ చేయడంతో కలకలం రేగింది. 

ప్రస్తుతం అలీ తమ అదుపులోనే వున్నట్లు బెంగళూరు జాయింట్ పోలీస్ కమీషనర్ సందీప్ పాటిల్ తెలిపారు. విచారణలో అతడు దుబాయ్ బుకీలతో కలిసి బెట్టింగ్ కు పాల్పడినట్లు అంగీకరించినట్లు కమీషనర్ బయటపెట్టాడు. దీంతో ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరికి సంబంధాలున్నాయన్న దానిపై విచారణ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.
  
ఇప్పటికే కేపీఎల్ 2019 లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ బెట్టింగ్ వ్యవహారం బయటపడింది. ఒకవేళ అలీకి ఈ మ్యాచ్ పిక్సింగ్ తో సంబంధాలేమైనా వున్నాయా అన్న కోణంలో విచారణ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ లీగ్ లో పాల్గొన్న ఆటగాళ్లతో పాటు  ఇంకా ఏవైనా ప్రాంఛైజీలకు ఈ బెట్టింగ్ వ్యవహారంతో సంబంధాలున్నాయా అన్న దానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ బెట్టింగ్ వ్యవహారం కేవలం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పరువునే కాదు భారత క్రికెట్ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చింది.