TATA IPL 2022- MI vs LSG: ఈ సీజన్ లో వరుసగా ఐదు ఓటములు చవిచూసిన ముంబై ఇండియన్స్ జట్టు ఓటమికి ప్రదాన కారణాలు ఏంటి..? ఐపీఎల్ చూస్తున్న ప్రతి క్రికెట్ అభిమానిని తొలుస్తున్న ప్రశ్న ఇది. దీనికి ఆ జట్టు ఫ్యాన్స్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో మాత్రం ఒక్క విజయం కోసం కండ్లు కాయలు కాసేలా వేచి చూస్తున్నది. ఇప్పటివరకు ఐదు మ్యాచులు ఆడిన ముంబై.. అన్నింట్లో ఓడింది. అయితే ముంబై ఓటములకు ప్రధాన కారణాలేంటి...? రోహిత్ శర్మ కెప్టెన్సీయా..? కీలక ఆటగాళ్లను వేలంలో వదిలేయడమా..? పొలార్డ్ ఫామ్ లో లేకపోవడమా..? ఒకప్పుడు పటిష్టమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్.. ఇప్పుడు అత్యంత చెత్త ఆటతీరకు గల కారణాలు ఏంటి..?
ఇదే విషయమై ప్రముఖ జాతీయ దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక పోల్ నిర్వహించింది. ఇందులో రోహిత్ కెప్టెన్సీ, ఆటగాళ్ల ఫామ్, వేలం తదితర ప్రశ్నలు వేసింది. దీనికి ఆ జట్టు అభిమనులతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ కూడా సమాధానాలిచ్చారు. అవేంటో ఇక్కడ చూద్దాం.
- ముంబై కి గతంలో ఆడిన ఆటగాళ్లలో ఎవర్ని ఆ జట్టు భాగా మిస్ అవుతుంది..?
ఈ ప్రశ్నకు సుమారు పదివేల మంది తమ అభిప్రాయం తెలిపారు. వీరిలో 4,500 మందికి పైగా.. ముంబై ట్రెంట్ బౌల్ట్ ను బాగా మిస్ అవుతుందని చెప్పారు. ఆ తర్వాత జాబితాలో హార్ధిక్ పాండ్యా (2,324), క్వింటన్ డికాక్ (1,536) ఉన్నారు.
- గత ఐదు మ్యాచులలో బుమ్రా 4 వికెట్లు తీశాడు. అతడు ఫామ్ లో లేకపోవడం వల్లే ముంబై ఓడుతుందా..?
దీనికి 9వేల మంది సమాధానమిచ్చారు. వారిలో 5,362 మంది అదే నిజమని చెప్పడం గమనార్హం. ఈ సీజన్ లో బుమ్రా అనుకున్నంత స్థాయిలో రాణించడం లేదు. అతడు కాస్త కట్టడిగా బౌలింగ్ చేసినా బుమ్రాకు సహకరించే వారు లేరు.
- ఇషాన్ కిషన్ ను రూ. 15.25 కోట్లకు కొనడం ముంబై వ్యూహాత్మక తప్పిదమా..?
ఈ ప్రశ్నకు చాలా మంది అవును అని సమాధానం చెప్పడం విశేషం. ఇషాన్ కు అంత సీన్ లేదని, ముంబై అతడి మీద అనవసరంగా ఖర్చు చేసిందని చెప్పుకొచ్చారు. మొత్తంగా ఈ ప్రశ్నకు పదివేల మంది స్పందించగా.. వారిలో 7,193 మంది ఇషాన్ కిషన్ ను ముంబై అన్ని కోట్లు పెట్టి దక్కించుకోవడం శుద్ధ దండుగ అని తేల్చేశారు. 1,500 మంది మాత్రమే దానిని సమర్థించారు.
- రోహిత్ శర్మ చేతిలో బలమైన ఆటగాళ్లు లేనందున కెప్టెన్ గా అతడు సరిగా రాణించడం లేదా..?
దీనిపై సుమారు 9వేల మంది దాకా స్పందించారు. వారిలో 6,757 మంది అవుననే సమాధానమివ్వడం గమనార్హం. లేదు అని 1,976 మంది చెప్పారు.
- టీమిండియా కెప్టెన్సీ, ముంబై సారథ్యం, ప్రధాన బ్యాటర్ అనే భారం రోహిత్ బ్యాటింగ్ పై ప్రభావం చూపుతుందా..?
దీనికి చాలా మంది అవుననే సమాధానం చెప్పారు. ఓటింగ్ లో 9వేల మందికి పైగా పాల్గొన్నారు. వీరిలో 4,800 మందికి పైగా.. టీమిండియా, ముంబై సారథ్యం రోహిత్ బ్యాటింగ్ పై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు.
- బ్యాటింగ్ లో పొలార్డ్ ఫామ్ లేమి ఆ జట్టును వేధిస్తున్నదా..?
ఈ ప్రశ్నకు 9వేల మంది దాకా ఓటింగ్ లో పాల్గొంటే ఏకంగా 7,775 మంది అవుననే సమాధానమివ్వడం గమనార్హం. ముంబై అతడిని రిటైన్ చేసుకోకుండా ఉంటే బావుండనేదే అభిమానుల అభిప్రాయంగా ఉంది.
- ఈ సీజన్ లో ముంబై తిరిగి పుంజుకుంటుందా..? వాళ్లు ప్లేఆఫ్ కు చేరతారా..?
అనూహ్యంగా ఈ ప్రశ్నకు ఎక్కువ మంది అవుననే సమాధానం చెప్పడం విశేషం.వరుసగా ఐదు మ్యాచులు ఓడినా ముంబై మాత్రం మళ్లీ పుంజుకుంటుందని, విజయాల బాట పట్టి ప్లే ఆఫ్ కు చేరుతుందని చెప్పారు. ఓటింగ్ లో సుమారు 9 వేల మంది పాల్గొంటే వారిలో ఏకంగా 6,500 మందికి పైగా ముంబై మళ్లీ విజయాల బాట పడుతుందని చెప్పడం కొసమెరుపు.
