ఇది కోహ్లీ ప్రపంచం.. ఆ ప్రపంచంలో మనం బతుకుతున్నామంతే.. విరాట్ ఫామ్‌పై హోరెత్తుతున్న ట్విటర్
Virat Kohli: మూడేండ్లుగా సెంచరీ లేక ఇబ్బందిపడిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఆసియా కప్ తర్వాత మునపటి కోహ్లీని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ తో పోరులో అయితే అతడి ఇన్నింగ్స్ నభూతో నభవిష్యత్.
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్‌లో తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ పై వీరోచిత పోరాటం చేసి టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించిన ఈ రన్ మెషీన్ తాజాగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్ లో కూడా 44 బంతుల్లోనే 62 పరుగులు చేసి భారత్ కు భారీ స్కోరును అందించాడు. ఆసియా కప్ కంటే ముందు ఫామ్ లేమితో సతమతమైన కోహ్లీ.. ఆ తర్వాత మునపటి లయను అందుకున్నాడు. తాజాగా కోహ్లీ ప్రదర్శనలపై సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి.
పాకిస్తాన్ తో 53 బంతులలోనే 82 నాటౌట్, నెదర్లాండ్స్ తో 44 బంతుల్లో 62 నాటౌట్ తో ఉన్న కోహ్లీ భారత్ విజయాలలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా పలువురు కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇది విరాట్ కోహ్లీ ప్రపంచమని.. అందులో మనమంతా బతుకుతున్నామని పోస్టులు పెడుతున్నారు.
నెదర్లాండ్స్ తో మ్యాచ్ తర్వాత పలువురు స్పందిస్తూ.. ‘కొన్నాళ్ల క్రితం జట్టులో కోహ్లీ స్థానం గురించి మీడియా, మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు పలు రకాల వాదనలు చేశారు. వాళ్లందరికీ కోహ్లీ తన బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో సమాధానం చెబుతున్నాడు..’, ‘ఒకసారి కోహ్లీ మాట్లాడుతూ.. నేను ఈ దశ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేనెంత నిలకడగా ఆడతానో చూడండి అని చెప్పాడు. ప్రస్తుతం దానికి ప్రాక్టికల్ మనకు చూపిస్తున్నాడు..’ అని కామెంట్స్ చేస్తున్నారు.
‘విరాట్ కోహ్లీ తన స్వంత లీగ్ లో పరుగుల వరద పారిస్తున్నాడు..’, ‘టీ20 ప్రపంచకప్ లో కింగ్ కోహ్లీ మరో హాఫ్ సెంచరీ. ఆస్ట్రేలియాను ఏలుతున్నాడు..’, ‘ఈట్, స్లీప్, 50.. రిపీట్’ అని కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
ఆసియా కప్ లో ఫామ్ ను తిరిగి దక్కించుకున్న కోహ్లీ.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్సులోనూ పైకి ఎగబాకుతున్నాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ తర్వాత కోహ్లీ.. 6 స్థానాలు ఎగబాకి టాప్ -10లోకి దూసుకొచ్చాడు. ప్రస్తుతం కోహ్లీ.. 9వ స్థానానికి చేరాడు.