ఆన్లైన్ కోచ్కే మొగ్గు చూపుతున్న పాకిస్తాన్.. ఇది తమకు చెంపపెట్టు అంటున్న మాజీ సారథి
ఆన్లైన్ కోచింగ్ పాక్ క్రికెట్ లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా కోచింగ్ ఇవ్వనున్నాడని వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న మికీ ఆర్థర్.. పాకిస్తాన్ క్రిెకెట్ జట్టుకు 2016 నుంచి 2019 వరకూ హెడ్ కోచ్ గా వ్యవహరించాడు. ఆర్థర్ వెళ్లాక మిస్బా ఉల్ హక్.. పాక్ టీమ్ కు హెడ్ కోచ్ గా పనిచేశాడు.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీసుకుంటున్న చర్యలు ఆ దేశ క్రికెట్ ప్రేమికులను కుదిపేస్తున్నాయి. నాలుగేండ్ల తర్వాత ఆ జట్టుకు మళ్లీ ఆస్ట్రేలియాకు చెందిన మికీ ఆర్థర్.. హెడ్ కోచ్ గా రానున్నాడని, అది కూడా భౌతికంగా కాక ఆన్లైన్ ద్వారా కోచింగ్ ఇవ్వనున్నాడన్న వార్తలు బయటకు వచ్చినప్పట్నుంచీ మాజీ క్రికెటర్లు పీసీబీ తీరుపై విమర్శలు సంధిస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ సారథి మిస్బా ఉల్ హక్ కూడా ఇదే విషయమై పీసీబీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మిస్బా మాట్లాడుతూ.. ‘ఇది మా (పాకిస్తాన్) క్రికెట్ కు చెంపపెట్టు. పాకిస్తాన్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో గొప్పగా రాణించిన క్రికెటర్లు ఎందరో ఉన్నా మనకు మాత్రం జాతీయ జట్టుకు పనిచేయడానికి హెడ్‌కోచ్ దొరకడం లేదా..? ఇది నిజంగా సిగ్గుచేటు.
విదేశీ కోచ్ లకు ప్రాధాన్యమిస్తున్న మనం పాకిస్తాన్ కోచ్ లను జాతీయ జట్టుకు ఎంపిక చేయడానికి కనీసం సెకండ్ ఆప్షన్ గా కూడా పెట్టుకోవడం లేదు...’అని తెలిపాడు. మికీ ఆర్థర్.. 2016 నుంచి 2019 వరకూ పాక్ టీమ్ కు హెడ్ కోచ్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆర్థర్ వెళ్లాక మిస్బా ఉల్ హక్.. పాక్ టీమ్ కు హెడ్ కోచ్ గా ఉన్నాడు. కానీ పీసీబీలోకి రమీజ్ రాజా వచ్చిన తర్వాత ఆయనతో ఉన్న విభేదాల కారణంగా తన పదవి నుంచి తప్పుకున్నాడు.
ఇక ఆర్థర్ ఆన్లైన్ కోచింగ్ విధానంపై ఇటీవలే షాహిద్ అఫ్రిది కూడా పీసీబీపై విమర్శలు సంధించిన విషయం తెలిసిందే. అఫ్రిది మాట్లాడుతూ.. ‘‘అసలు ఇది ఏ రకమైన కోచింగో నాకైతే అర్థం కావడం లేదు. పీసీబీ ఏం ఆలోచిస్తుంది..? పాకిస్తాన్ క్రికెట్ ను అది ఏం చేయాలనుకుంటుందో కూడా తెలియడం లేదు. ఈ ఫారెన్ కోచ్ లు, ఆన్‌లైన్ కోచింగ్ ఎందుకు..? పాకిస్తాన్ లో కోచ్ లు లేరా..? ఒక జాతీయ జట్టుకు హెడ్‌కోచ్ గా వ్యవహరించే వ్యక్తి ప్రస్తుతం ఎక్కడఉన్నాడు..? అతడు నిజంగా కోచింగ్ చేయగలడా..? లేదా..? అన్నది కూడా పీసీబీ పరిగణనలోకి తీసుకోవాలి. ఈ విషయంలో రాజకీయాలు చేయడం తగదు. వాటిని పక్కనబెట్టి మంచి జట్టును తయారుచేసేందుకు కృషి చేయాలి..’ అని అన్నాడు.