ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... డేవిడ్ వార్నర్ ఒంటరి పోరాటం వృథా...
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ మరోసారి ఓ పరాజయం తర్వాత సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న ఆర్‌సీబీ, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.
190 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీకి శుభారంభం అందించారు ఓపెనర్లు. మొదటి వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత 13 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసిన పృథ్వీ షా, సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
38 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, ఐపీఎల్ కెరీర్‌లో 52వ 50+ స్కోరు నమోదు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన మిచెల్ మార్ష్ 24 బంతుల్లో 14 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు...
రోవ్‌మన్ పావెల్‌ను జోష్ హజల్‌వుడ్ గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరగా అదే ఓవర్ ఆఖరి బంతికి లలిత్ యాదవ్ అవుట్ అయ్యాడు. 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేసిన రిషబ్ పంత్, సిరాజ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో ఒడిసి పట్టుకున్న క్యాచ్‌కి అవుట్ అయ్యాడు...
అప్పటికే 21 బంతుల్లో 47 పరుగుల కావాల్సిన క్లిష్ట పరిస్థితికి చేరుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. 9 బంతుల్లో 2 సిక్సర్లతో 17 పరుగులు చేసిన శార్దూల్ ఠాకూర్ కూడా హజల్‌వుడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ 10, కుల్దీప్ యాదవ్ 10 పరుగులు చేసినా ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి తేడాని తగ్గించగలిగారంతే.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఆర్‌సీబీకి మరోసారి టాపార్డర్ వైఫల్యం వెంటాడింది. ఓపెనర్ అనుజ్ రావత్‌ని గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు శార్దూల్ ఠాకూర్. 11 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, ఆ తర్వాతి ఓవర్లోనే ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..
13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 14 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, లలిత్ యాదవ్ సూపర్ డైరెక్ట్ త్రోకి రనౌట్ అయ్యాడు. యంగ్ బ్యాటర్ సుయాశ్ ప్రభుదేశాయ్ 5 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
స్పిన్నర్ అక్షర్ పటేల్‌కి ఐపీఎల్ 2022 సీజన్‌లో దక్కిన మొట్టమొదటి వికెట్ ఇదే. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో బౌండరీల మోత మోగించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్... 34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో లలిత్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు మ్యాక్స్‌వెల్. మొదట్లో నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన దినేశ్ కార్తీక్... ముస్తాఫిజుర్ రహ్మెన్ వేసిన 18వ ఓవర్‌లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 28 పరుగులు రాబట్టాడు.
ఆ ఓవర్‌కి ముందు 20 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేసిన దినేశ్ కార్తీక్, 26 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు.ఐపీఎల్ కెరీర్‌లో దినేశ్ కార్తీక్‌కి ఇది 19వ హాఫ్ సెంచరీ. శార్దూల్ ఠాకూర్ వేసిన 19వ ఓవర్‌లో దినేశ్ కార్తీక్‌ని ఎల్బీడబ్ల్యూ అవుట్‌గా ప్రకటించినా, డీఆర్‌ఎస్ తీసుకున్న ఆర్‌సీబీకి అనుకూలంగా ఫలితం వచ్చింది...
16 ఓవర్లు ముగిసే సమయానికి కేవలం 120 పరుగులు మాత్రమే చేసిన ఆర్‌సీబీ, ఆఖరి 4 ఓవర్లలో 69 పరుగులు రాబట్టింది. దినేశ్ కార్తీక్ 34 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 పరుగులు చేయగా షాబాజ్ అహ్మద్ 21 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
