IPL2022 PBKS vs SRH: టాస్ గెలిచిన సన్‌రైజర్స్... ఆ విషయంలో కేన్ మామ డబుల్ హ్యాట్రిక్...
IPL 2022: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... వరుసగా ఆరు మ్యాచుల్లోనూ టాస్ నెగ్గిన కేన్ విలియంసన్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ కింగ్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటిదాకా జరిగిన ఆరు మ్యాచుల్లోనూ టాస్ గెలిచాడు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియంసన్.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ బొటన వేలికి గాయం కావడంతో నేటి మ్యాచ్‌లో అతను బరిలో దిగడం లేదు. మయాంక్ అగర్వాల్ స్థానంలో సీనియర్ బ్యాటర్ శిఖర్ ధావన్ నేటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు.
ఐపీఎల్ 2022 సీజన్‌ని వరుసగా రెండు పరాజయాలతో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. గత మూడు మ్యాచుల్లోనూ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి, హ్యాట్రిక్ విజయాలను అందుకుంది ఆరెంజ్ ఆర్మీ...
మరోవైపు పంజాబ్ కింగ్స్ ఐదు మ్యాచుల్లో 3 విజయాలు అందుకుని, మంచి పర్పామెన్స్‌తో ఆకట్టుకుంటోంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 199 పరుగుల భారీ స్కోరు చేసి, దాన్ని కాపాడుకుని 12 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది పంజాబ్ కింగ్స్..
మయాంక్ అగర్వాల్‌తో పాటు యంగ్ బ్యాటర్ జితేశ్ శర్మ, శిఖర్ ధావన్, జానీ బెయిర్ స్టో, లియామ్ లివింగ్‌స్టోన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండడం పంజాబ్ కింగ్స్‌కి కలిసి వచ్చే అంశం. మయాంక్ అగర్వాల్ స్థానంలో ప్రభుసిమ్రాన్ సింగ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్ కగిసో రబాడా కూడా ఇప్పటిదాకా తన రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు.
మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో రాహుల్ త్రిపాఠి, అయిడిన్ మార్క్‌రమ్ గత మ్యాచ్‌లో అదరగొట్టారు. నికోలస్ పూరన్ నుంచి ఇప్పటిదాకా మంచి చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ అయితే రాలేదు...
పంజాబ్ కింగ్స్ జట్టు: శిఖర్ ధావన్, జానీ బెయిర్ స్టో, ప్రభుసిమ్రాన్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, జితీశ్ శర్మ, షారుక్ ఖాన్, ఓడియన్ స్మిత్, కగిసో రబాడా, రాహుల్ చాహార్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: అభిషేక్ శర్మ, కేన్ విలియంసన్, రాహుల్ త్రిపాఠి, అయిడిన్ మార్క్‌రమ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, జగదీశ సుచిత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్