Asianet News TeluguAsianet News Telugu

ఐపిఎల్ నిర్వహణ ఓ సవాల్: కష్టనష్టాలు ఇవీ....

ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌ పర్యటన నుంచి తిరగొచ్చిన తర్వాత టీమ్‌ ఇండియా క్రికెటర్లను మళ్లీ మైదానంలో చూడలేదు. ఇప్పుడు ఐపీఎల్‌తో క్రికెటర్లు మళ్లీ బరిలోకి దిగబోతున్నారు. ఐపీఎల్‌తో భారత క్రికెట్‌పునః ప్రారంభం కాబోతుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా, ఈ ఐపీఎల్‌ సీజన్‌తో భారత దేశవాళీ క్రికెట్‌కు పెద్దగా ప్రయోజనం లేదు. కరోనా కారణంగా ఐపీఎల్‌ 2020 యుఏఈలో జరుగుతుండటమే అందుకు ప్రధాన కారణం. 

IPL2020 : Will It Help The Domestic Cricket In India
Author
Mumbai, First Published Aug 12, 2020, 3:10 PM IST

యుఏఈలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 నిర్వహణకు సర్వం సిద్ధమయింది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సుమారు రూ.4 వేల కోట్ల ఆదాయం నిలుపుకునేందుకు ఏ చిన్న అవకాశం వదల్లేదు. కరోనా సమయంలోనూ బయో సెక్యూర్‌ బబుల్‌ వాతావరణంలో ఐపీఎల్‌ నిర్వహించేందుకు సిద్ధం చేసింది. 

టాటా మెడికల్‌ విభాగం బయో సెక్యూర్‌ బబుల్‌ సృష్టించనుండగా.. ఇతర సమగ్ర ముందుజాగ్రత్తలు తీసుకుంటోంది. మరో పది రోజుల్లో ఇక్కడ క్వారంటైన్‌ ముగించుకుని ప్రాంఛైజీలు యుఏఈకి చేరుకోనున్నాయి. 

ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌ పర్యటన నుంచి తిరగొచ్చిన తర్వాత టీమ్‌ ఇండియా క్రికెటర్లను మళ్లీ మైదానంలో చూడలేదు. ఇప్పుడు ఐపీఎల్‌తో క్రికెటర్లు మళ్లీ బరిలోకి దిగబోతున్నారు. ఐపీఎల్‌తో భారత క్రికెట్‌పునః ప్రారంభం కాబోతుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా, ఈ ఐపీఎల్‌ సీజన్‌తో భారత దేశవాళీ క్రికెట్‌కు పెద్దగా ప్రయోజనం లేదు. కరోనా కారణంగా ఐపీఎల్‌ 2020 యుఏఈలో జరుగుతుండటమే అందుకు ప్రధాన కారణం. 

ఆదాయం కోల్పోనున్న క్రికెట్ సంఘాలు....  

 ఐపీఎల్‌లో ఎనిమిది ప్రాంఛైజీలు ఉన్నాయి. అందులో కొన్ని ప్రాంఛైజీలకు 2-3 ఆతిథ్య మైదానాలు ఉన్నాయి. ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం ఆతిథ్య మైదానానికి ప్రాంఛైజీ రూ. 50 లక్షలు, బీసీసీఐ రూ.50 లక్షలు చెల్లిస్తాయి. 

దీంతో ముంబయి క్రికెట్‌ సంఘం (ఎంసీఏ), తమిళనాడు క్రికెట్‌ సంఘం (టిఎన్‌సీఏ), హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ), బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌), ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్స్‌ క్రికెట్‌ సంఘం (డీడీసీఏ), కర్ణాటక క్రికెట్‌ సంఘం (కెసీఏ), సౌరాష్ట్ర క్రికెట్‌ సంఘం (ఎస్‌సీఏ), రాజస్థాన్‌ క్రికెట్‌ సంఘం (ఆర్‌సీఏ)లు ప్రతి ఏటా రూ.7-8 కోట్లు ఆర్జిస్తున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్‌ విదేశాల్లో జరుగుతుంది. దీంతో ఐపీఎల్‌ ప్రాంఛైజీల ఆతిథ్య రాష్ట్ర క్రికెట్‌ సంఘాలు ఏకంగా రూ. 7 కోట్ల ఆదాయం కోల్పోనున్నాయి.

దేశవాళీ క్రికెట్ కు నిధులిస్తారా..?

భారత దేశవాళీ క్రికెట్‌ అభివృద్ధికి ఆర్థిక వనరుగా నిలువటం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) లక్ష్యాల్లో ఒకటి. దేశవాళీ ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను ప్రాంఛైజీలు తీసుకోవటంతో వారికి అంతర్జాతీయ క్రికెటర్లతో డ్రెస్సింగ్‌రూమ్‌ పంచుకున్న విలువైన అనుభవం వస్తుంది. 

ఐపీఎల్‌, ప్రాంఛైజీల లాభాల్లో 20 శాతం నిధులను దేశవాళీ క్రికెట్‌ అభివృద్ధికి కేటాయిస్తున్నారు. గత 12 సీజన్లుగా ఐపీఎల్‌ నుంచి దేశవాళీ క్రికెట్‌కు 20 శాతం నిధులు వస్తున్నాయి. ఈ నిధులను బీసీసీఐ అన్ని రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు సమంగా పంచుతుంది. 

రాష్ట్ర క్రికెట్‌ సంఘాలు క్షేత్ర స్థాయిలో క్రికెట్‌ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ నిధులు దోహదం చేస్తున్నాయి. ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్‌తో ప్రాంఛైజీలు ఇప్పటికే టికెట్ల అమ్మకాల సొమ్ము కోల్పోతున్నాయి. టికెట్ల అమ్మకాలకు నష్ట పరిహారం ఇవ్వాలని ఓ ప్రాంఛైజీ బలంగా వాదిస్తోంది. ఈ ఏడాది 20 శాతం నిధులను ఇవ్వకూడదనే చర్చ సైతం ప్రాంఛైజీ వర్గాల్లో నడుస్తోంది.

వివో తప్పుకున్నా, ఆదాయానికి లేని ఢోకా..!

ఐపీఎల్‌ 2020 టైటిల్‌ స్పాన్సర్‌గా వివో తప్పుకుంది. ఒప్పందం ప్రకారం వివో ఈ సీజన్‌కు రూ.440 కోట్లు చెల్లించాల్సింది. కానీ ప్రజల భావోద్వేగాల నేపథ్యంలో బీసీసీఐ, వివో ఓ అంగీకారానికి వచ్చాయి. తొలుత ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా డీఎల్‌ఎఫ్‌ వ్యవహరించింది. 

సీజన్‌కు రూ. 40 కోట్లు చెల్లించింది. అనంతరం, పెప్సికో సీజన్‌కు రూ.80 కోట్లతో ఐదేండ్ల ఒప్పందం చేసుకుంది. ఐదో ఏడాదికి ముందే వివోకు టైటిల్‌ స్పాన్సర్‌ హక్కులు బదిలీ చేసింది. డీఎల్‌ఎఫ్‌ నుంచి పెప్సికో రెట్టింపు ధరకు హక్కులు సాధించగా.. వివో ఏకంగా ఐదున్నర రెట్ల (450 శాతం) ధరతో టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ హక్కులు పొందింది. 

ఇప్పుడున్న మార్కెట్‌ పరిస్థితుల్లో టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌కు రూ.440 కోట్లు వెచ్చించేందు ఏ కంపెనీ సిద్ధంగా లేదు. కనీసం రూ.200 కోట్లతో ముందుకొచ్చినా అది మంచి ఆఫరే కానుంది. 

ఇక ప్రసార హక్కుల ప్రకారం స్టార్‌ ఇండియా సీజన్‌కు రూ.3269 కోట్లు చెల్లిస్తుంది. ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం ప్రసార హక్కుల మొత్తంలో 50 శాతం ప్రాంఛైజీలకు పంచుతారు. దీని ప్రకారం ఎనిమిది ప్రాంఛైజీలు రూ.200 కోట్ల వరకు దక్కించుకుంటాయి. 

వివో (వివో టైటిల్‌ స్పాన్సర్‌గా ఉన్న సీజన్లలో ప్రతి ప్రాంఛైజీ రూ.20 కోట్లు అందుకుంది) మినహా ఇతర ఐపీఎల్‌ స్పాన్సర్లు ఇచ్చే సొమ్ములో సైతం ప్రాంఛైజీలకు వాటా లభిస్తుంది. అది ఒక్కో ప్రాంఛైజీకి రూ.12-15 కోట్లు వస్తాయి. 

వీటికి తోడు ప్రాంఛైజీల స్పాన్సర్లు యథావిధిగా కొనసాగుతున్నాయి. చెన్నై సూపర్‌ కింగ్స్‌ వంటి ప్రాంఛైజీకి కొత్త స్పాన్సర్లు వస్తున్నాయి. టికెట్ల అమ్మకాలు మినహా ఇతర ఆదాయాలకు ఎటువంటి ఢోకా లేదు. అయినా, రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు ఇవ్వాల్సిన వాటాను నిరాకరించేందుకు ప్రాంఛైజీలు ప్రయత్నం చేస్తున్నాయి. కరోనా కష్టకాలంలోనూ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్‌ ముస్తాబవటం సంతోషమే కానీ భారత దేశవాళీ క్రికెట్‌ ప్రయోజనాలకు తిలోదకాలు ఇవ్వటం ఏమాత్రం ఆహ్వానించదగిన పరిణామం కాదు.

Follow Us:
Download App:
  • android
  • ios