IPL 2023: ఐపీఎల్ లో తన స్పిన్ మ్యాజిక్ తో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టే టీమిండియా స్పిన్నర్  యుజ్వేంద్ర చహల్.. తాజాగా  మరో రికార్డు సాధించాడు. 

‘రికార్డులు నెలకొల్పేవి బద్దలవడానికే..’ అన్నాడు ప్రముఖ రేసర్ మైఖెల్ షుమాకర్. ఏ రికార్డైనా ఎప్పుడో ఒకప్పుడు బద్దలవ్వాల్సిందే. చరిత్ర చెబుతున్న సత్యం కూడా ఇదే. కాస్త అటూ ఇటూగా అయినా ఏ రికార్డు అయినా ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్ కావాల్సిందే. ఐపీఎల్ లో కూడా తాజాగా ఓ అరుదైన రికార్డును రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ బ్రేక్ చేశాడు. యాధృశ్చికంగా తన టీమ్ కు బౌలింగ్ కోచ్ గా ఉన్న వ్యక్తి రికార్డే కావడం గమనార్హం. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రెండో స్థానంలో ఉన్న లసిత్ మలింగ రికార్డును చహల్ చెరిపేశాడు.

బుధవారం గువహతి వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో జితేశ్ శర్మ వికెట్ తీయగానే చహల్.. ఐపీఎల్ లో 171 వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా గతంలో ముంబై ఇండియన్స్ బౌలర్ గా ప్రస్తుతం రాజస్తాన్ కు బౌలింగ్ కోచ్ గా ఉన్న లసిత్ మలింగ 170 వికెట్ల రికార్డును అధిగమించాడు. 

ఐపీఎల్ లో మలింగ.. 122 మ్యాచ్ లలో 170 వికెట్లు పడగొట్టాడు. మలింగ కంటే ముందు ఈ జాబితాలో నెంబర్ వన్ ప్లేస్ లో డ్వేన్ బ్రావో ఉన్నాడు. బ్రావో.. 161 మ్యాచ్ లలో 183 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. గత సీజన్ లో బ్రావో.. మలింగ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక ఇప్పుడు మలింగ రికార్డును అధిగమించిన చహల్.. బ్రావో రికార్డుపై కన్నేశాడు. ఇందుకోసం చహల్ కు కావాల్సినవి 12 వికెట్లు మాత్రమే. గత ఐపీఎల్ సీజన్ లో 27 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ దక్కించుకున్న చహల్ కు ఈ సీజన్ లో మరో 12 వికెట్లు తీయడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రస్తుత సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన తొలి మ్యాచ్ లో నాలుగు వికెట్లు పడగొట్టిన చహల్.. నిన్నటి మ్యాచ్ లో ఒక వికెట్ తీశాడు.

Scroll to load tweet…

ఇటీవలే భారత్ తరఫున టీ20లలో 300 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా రికార్డులకెక్కిన చహల్.. ఈ సీజన్ లో బ్రావో రికార్డును బ్రేక్ చేస్తే ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్ గా నిలుస్తాడు. 

ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ -5 వీరులు: 

1. డ్వేన్ బ్రావో : 161 మ్యాచ్ లలో 183 వికెట్లు 
2. యుజ్వేంద్ర చహల్ : 133 మ్యాచ్ లలో 171 వికెట్లు 
3. లసిత్ మలింగ : 122 మ్యాచ్ లలో 170 వికెట్లు 
4. అమిత్ మిశ్రా : 154 మ్యాచ్ లలో 166 వికెట్లు 
5. అశ్విన్ : 186 మ్యచ్ లలో 158 వికెట్లు 

టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ - 5 వీళ్లే.. 

1. బ్రావో - 615 
2. రషీద్ ఖాన్ - 530 
3. సునీల్ నరైన్ - 479 
4. ఇమ్రాన్ తాహిర్ - 469 
5. షకిబ్ అల్ హసన్ - 415 
ఈ జాబితాలో చహల్ (304) 15 వ స్థానంలో ఉన్నాడు.