IPL 2023: మళ్లీ పాత కథే వినిపించిన ఆర్‌సీబీ.. కోల్‌కత్తా నైట్‌రైడర్స్ చేతుల్లో చిత్తుగా ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. 2023 సీజన్‌లో తొలి విజయం అందుకున్న కేకేఆర్..
కెప్టెన్లు మారినా, సీజన్లు మారినా ఆర్‌సీబీ ఆటతీరు మాత్రం మారలేదు. మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై తిరుగులేని ఆధిపత్యం చూపించిందీ ఈ టీమ్‌యేనా... అనిపించేలా కేకేఆర్‌తో మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది బెంగళూరు.. 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కేకేఆర్‌కి 204 పరుగుల భారీ స్కోరు ఇచ్చిన ఆర్‌సీబీ, ఆ లక్ష్య ఛేదనలో 123 పరుగులకే ఆలౌట్ అయ్యి, 81 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది..
మొదటి వికెట్‌కి 44 పరుగులు జోడించిన విరాట్ కోహ్లీ, 18 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసి సునీల్ నరైన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 23 పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు..
7 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని బౌల్డ్ చేసిన వరుణ్ చక్రవర్తి, ఆ తర్వాత రెండో బంతికి హర్షల్ పటేల్‌ని కూడా బోల్తా కొట్టించాడు. షాబజ్ అహ్మద్ కూడా 1 పరుగుకే సునీల్ నరైన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 17 పరుగుల తేడాతో 5 వికెట్లు కోల్పోయింది ఆర్‌సీబీ...
18 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసిన మైఖేల్ బ్రాస్‌వెల్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 9 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్‌ని అవుట్ చేసి ఐపీఎల్‌లో మొట్టమొదటి తీసిన సుయాశ్ శర్మ, అదే ఓవర్‌లో అనుజ్ రావత్‌ని కూడా అవుట్ చేశాడు..
86 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది ఆర్‌సీబీ. ఆ తర్వాతి ఓవర్‌లో కర్ణ్ శర్మను అవుట్ చేసిన సుయాశ్ శర్మ, 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. డేవిడ్ విల్లే, ఆకాశ్ దీప్ కలిసి ఆర్‌సీబీ స్కోరును 120 మార్కు దాటించారు. 17 పరుగులు చేసిన ఆకాశ్ దీప్‌ని వరుణ్ చక్రవర్తి అవుట్ చేయడంతో ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌కి తెరపడింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి శుభారంభం దక్కలేదు. 7 బంతుల్లో 3 పరుగులే చేసిన వెంకటేశ్ అయ్యర్, డేవిడ్ విల్లే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే మన్‌దీప్ సింగ్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు డేవిడ్ విల్లే. వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది కోల్‌కత్తా..
5 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసిన కెప్టెన్ నితీశ్ రాణా, మైకేల్ బ్రాస్‌వెల్ బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసిన రహ్మనుల్లా గుర్భాజ్, కర్ణ్ శర్మ బౌలింగ్‌లో ఆకాశ్ దీప్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే డేంజరస్ మ్యాన్ ఆండ్రే రస్సెల్‌ని అవుట్ చేశాడు కర్ణ్ శర్మ. మొదటి బంతికి భారీ షాట్‌కి యత్నించి, విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు ఆండ్రే రస్సెల్..
89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది కోల్‌కత్తా. 20 బంతుల్లో ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటి హాఫ్ సెంచరీ అందుకున్న శార్దూల్ ఠాకూర్, బౌండరీల మోత మోగించడంతో ఓ దశలో 120-150 దాటడం కూడా కష్టమే అనుకున్న కేకేఆర్ స్కోరు, అంతకంతకూ పెరుగుతూ పోయింది...
శార్దూల్ ఠాకూర్ హాఫ్ సెంచరీ తర్వాత అప్పటి దాకా నెమ్మదిగా ఆడిన రింకూ సింగ్ కూడా వేగం పెంచాడు. హర్షల్ పటేల్ వేసిన 17వ ఓవర్‌లో 2 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 17 పరుగులు రాబట్టిన రింకూ సింగ్, ఆఖరి బంతికి దినేశ్ కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
33 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేసి అవుటైన రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్‌తో కలిసి 47 బంతుల్లో 103 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. 29 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 68 పరుగులు చేసిన శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వస్తూనే ఫోర్ బాదిన ఉమేశ్ యాదవ్, 2 బంతుల్లో 6 పరుగులు చేసి కేకేఆర్ స్కోరుకి 200 మార్కు దాటించాడు.
