IPL 2023: జిడ్డు బ్యాటింగ్‌తో విసిగించిన రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్.. ఆఖర్లో అబ్దుల్ సమద్ మెరుపులు! స్పిన్ ఉచ్చులో హైదరాబాద్ బ్యాటర్లు..
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులు మాత్రమే చేసింది. బౌలింగ్‌కి చక్కగా అనుకూలిస్తున్న పిచ్‌పైన టాస్ గెలిచి మరీ బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, పరుగులు చేయడానికి ఆపసోపాలు పడింది..
7 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో మార్కస్ స్టోయినిస్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 21 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఆ తర్వాత అన్‌మోల్‌ప్రీత్ సింగ్, రాహుల్ త్రిపాఠి కలిపి రెండో వికెట్‌కి 29 పరుగుల భాగస్వామ్యం జోడించారు.
యష్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో అన్‌మోల్‌ప్రీత్ సింగ్ ఎల్బీడబ్ల్యూ అవుట్ అయినట్టు అంపైర్ ప్రకటించాడు. అయితే డీఆర్‌ఎస్ తీసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి అనకూలంగా ఫలితం దక్కింది. అయితే ఆ అవకాశాన్ని సరిగ్గా వాడుకోలేకపోయాడు అన్‌మోల్‌ప్రీత్ సింగ్...
26 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 31 పరుగులు చేసిన అన్‌మోల్‌ప్రీత్ సింగ్, కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికి కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు కృనాల్ పాండ్యా. మార్క్‌రమ్ వస్తాడు, సన్‌రైజర్స్ కష్టాలు తీరుస్తాడని ఆశపడిన అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది..
ఆ తర్వాత 4 బంతుల్లో 3 పరుగులు చేసిన హారీ బ్రూక్, రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి స్టంపౌట్ అయ్యాడు. 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్..
మొదటి రెండు మ్యాచుల్లో కృనాల్ పాండ్యా వేసింది రెండు ఓవర్లే. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ అవ్వగానే కృనాల్ పాండ్యాని ఇంపాక్ట్ ప్లేయర్ కోసం తప్పించిన కెఎల్ రాహుల్, ఆ తర్వాతి మ్యాచ్‌లో 2 ఓవర్లు బౌలింగ్ చేయించాడు. అయితే నేటి మ్యాచ్‌లో ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే బౌలింగ్‌కి వచ్చిన కృనాల్ పాండ్యా, ఏకంగా 3 వికెట్లు తీసిన ఆరెంజ్ ఆర్మీని దెబ్బ తీశాడు...
8 బంతుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని ఆదుకునే బాధ్యత భుజాలకు ఎత్తుకున్న రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్ జిడ్డు బ్యాటింగ్‌తో క్రీజులో కుదురుకుపోయారు. ఈ ఇద్దరూ కలిసి 50 బంతులు ఆడి 39 పరుగుల భాగస్వామ్యమే జోడించారు..
41 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి, యష్ ఠాకూర్ బౌలింగ్‌లో అమిత్ మిశ్రా పట్టిన కళ్లు చెదిరే షాట్‌కి పెవిలియన్ చేరాడు. 28 బంతులు ఆడినా ఒక్క బౌండరీ కొట్టలేకపోయిన వాషింగ్టన్ సుందర్, అమిత్ మిశ్రా బౌలింగ్‌లో బౌండరీ లైన్ దగ్గర దీపక్ హుడాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
వస్తూనే బౌండరీ బాదిన అదిల్ రషీద్, అమిత్ మిశ్రా బౌలింగ్‌లో దీపక్ హుడాకే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 4 ఓవర్లలో 23 పరుగులే ఇచ్చిన అమిత్ మిశ్రా 2 వికెట్లు తీయగా కృనాల్ పాండ్యా 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. 20వ ఓవర్ తొలి బంతికి లేని పరుగు కోసం ప్రయత్నించిన ఉమ్రాన్ మాలిక్ రనౌట్ అయ్యాడు. జయ్‌దేవ్ ఉనద్కట్ వేసిన ఆఖరి ఓవర్‌లో 2 సిక్సర్లు బాదిన అబ్దుల్ సమద్, 10 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి హైదరాబాద్ స్కోరు 120 మార్కు దాటించాడు...
