IPL 2023: 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కోల్‌కత్తా నైట్ రైడర్స్.. సెన్సేషనల్ హాఫ్ సెంచరీతో దంచికొట్టిన శార్దూల్ ఠాకూర్! రింకూ సింగ్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యం..
ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.10.75 కోట్లకు ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ని కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. గత సీజన్‌లో 15 వికెట్లు తీసినా, ఐపీఎల్ 2023 సీజన్‌కి ముందు అతన్ని కేకేఆర్‌తో ట్రేడ్ చేసింది. ఎట్టకేలకు రూ.10 కోట్ల ప్రైజ్ ట్యాగ్‌కి న్యాయం చేస్తూ బ్యాటుతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు శార్దూల్ ఠాకూర్. 90 పరుగుల లోపే సగం వికెట్లు కోల్పోయి కేకేఆర్, శార్దూల్ ఠాకూర్ సంచలన ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగుల భారీ స్కోరు చేసింది...
టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి శుభారంభం దక్కలేదు. 7 బంతుల్లో 3 పరుగులే చేసిన వెంకటేశ్ అయ్యర్, డేవిడ్ విల్లే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే మన్‌దీప్ సింగ్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు డేవిడ్ విల్లే. వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది కోల్‌కత్తా..
5 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసిన కెప్టెన్ నితీశ్ రాణా, మైకేల్ బ్రాస్‌వెల్ బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్‌ఎస్ తీసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అనుకూలంగా ఫలితం దక్కింది..
44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసిన రహ్మనుల్లా గుర్భాజ్, కర్ణ్ శర్మ బౌలింగ్‌లో ఆకాశ్ దీప్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే డేంజరస్ మ్యాన్ ఆండ్రే రస్సెల్‌ని అవుట్ చేశాడు కర్ణ్ శర్మ. మొదటి బంతికి భారీ షాట్‌కి యత్నించి, విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు ఆండ్రే రస్సెల్..
89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది కోల్‌కత్తా. 20 బంతుల్లో ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటి హాఫ్ సెంచరీ అందుకున్న శార్దూల్ ఠాకూర్, కేకేఆర్‌కి ఏడు అంతకంటే కింద బ్యాటింగ్‌కి వస్తూ హాఫ్ సెంచరీ చేసిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు.
ఇంతకుముందు ఆండ్రే రస్సెల్ 7వ స్థానంలో బ్యాటింగ్‌కి వస్తూ 5 హాఫ్ సెంచరీలు చేయగా ప్యాట్ కమ్మిన్స్ 3 హాఫ్ సెంచరీలు చేశాడు. వృద్ధిమాన్ సాహా ఓ హాఫ్ సెంచరీ బాదాడు. ఈ సీజన్‌లో జోస్ బట్లర్‌తో కలిసి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన శార్దూల్ ఠాకూర్, బౌండరీల మోత మోగించడంతో ఓ దశలో 120-150 దాటడం కూడా కష్టమే అనుకున్న కేకేఆర్ స్కోరు, అంతకంతకూ పెరుగుతూ పోయింది...
శార్దూల్ ఠాకూర్ హాఫ్ సెంచరీ తర్వాత అప్పటి దాకా నెమ్మదిగా ఆడిన రింకూ సింగ్ కూడా వేగం పెంచాడు. హర్షల్ పటేల్ వేసిన 17వ ఓవర్‌లో 2 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 17 పరుగులు రాబట్టిన రింకూ సింగ్, ఆఖరి బంతికి దినేశ్ కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

33 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేసి అవుటైన రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్‌తో కలిసి 47 బంతుల్లో 103 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. 29 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 68 పరుగులు చేసిన శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వస్తూనే ఫోర్ బాదిన ఉమేశ్ యాదవ్, 2 బంతుల్లో 6 పరుగులు చేసి కేకేఆర్ స్కోరుకి 200 మార్కు దాటించాడు.
