గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ హాఫ్ సెంచరీలు.. షాబాజ్ అహ్మద్ మెరుపులు... ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 190 పరుగుల లక్ష్యాన్ని పెట్టిన ఆర్‌సీబీ..

విరాట్ కోహ్లీ, డుప్లిసిస్, అనుజ్ రావత్, ప్రభు దేశాయ్ వంటి టాపార్డర్ ఫెయిల్ అయినా, ఒకానొక దశలో 92 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు చేయగలిగింది. ఒకప్పుడు వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోతే 160+ కూడా చేయలేదని విమర్శలు ఎదుర్కొన్న ఆర్‌సీబీ, ఈసారి దినేశ్ కార్తీక్ మెరుపుల కారణంగా ఆ లోటును పూడ్చుకోగలిగింది... 

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ రీలోడెడ్.. వెర్షన్ 3.0 మాదిరిగా వీర లెవెల్‌లో రెచ్చిపోయి, మరోసారి ఆర్‌సీబీకి మంచి స్కోరు అందించగలిగాడు.

ఆర్‌సీబీకి మరోసారి టాపార్డర్ వైఫల్యం వెంటాడింది. ఓపెనర్ అనుజ్ రావత్‌ని గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు శార్దూల్ ఠాకూర్. 11 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, ఆ తర్వాతి ఓవర్లోనే ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 14 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, లలిత్ యాదవ్ సూపర్ డైరెక్ట్ త్రోకి రనౌట్ అయ్యాడు. యంగ్ బ్యాటర్ సుయాశ్ ప్రభుదేశాయ్ 5 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

స్పిన్నర్ అక్షర్ పటేల్‌కి ఐపీఎల్ 2022 సీజన్‌లో దక్కిన మొట్టమొదటి వికెట్ ఇదే. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో బౌండరీల మోత మోగించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్... 34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

కుల్దీప్ యాదవ్‌ బౌలింగ్‌లో లలిత్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు మ్యాక్స్‌వెల్. మొదట్లో నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన దినేశ్ కార్తీక్... ముస్తాఫిజుర్ రహ్మెన్ వేసిన 18వ ఓవర్‌లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 28 పరుగులు రాబట్టాడు.

ఆ ఓవర్‌కి ముందు 20 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేసిన దినేశ్ కార్తీక్, 26 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు.ఐపీఎల్ కెరీర్‌లో దినేశ్ కార్తీక్‌కి ఇది 19వ హాఫ్ సెంచరీ. శార్దూల్ ఠాకూర్ వేసిన 19వ ఓవర్‌లో దినేశ్ కార్తీక్‌ని ఎల్బీడబ్ల్యూ అవుట్‌గా ప్రకటించినా, డీఆర్‌ఎస్ తీసుకున్న ఆర్‌సీబీకి అనుకూలంగా ఫలితం వచ్చింది...

16 ఓవర్లు ముగిసే సమయానికి కేవలం 120 పరుగులు మాత్రమే చేసిన ఆర్‌సీబీ, ఆఖరి 4 ఓవర్లలో 69 పరుగులు రాబట్టింది. దినేశ్ కార్తీక్ 34 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 పరుగులు చేయగా షాబాజ్ అహ్మద్ 21 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. 

ఆరో వికెట్‌కి షాబాజ్ అహ్మద్, విరాట్ కోహ్లీ కలిసి 52 బంతుల్లో 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఐపీఎల్ చరిత్రలో ఆరో వికెట్‌కి ఇది మూడో అత్యధిక భాగస్వామ్యం. ఇంతకుముందు అంబటి రాయుడు- కిరన్ పోలార్డ్ కలిసి ఆర్‌సీబీపై ఆరో వికెట్‌కి 122 పరుగులు జోడించగా, డేవిడ్ హుస్సీ- వృద్ధిమాన్ సాహా కేకేఆర్ తరుపున పంజాబ్ కింగ్స్‌పై 104 పరుగుల భాగస్వామ్యం జోడించారు.