TATA IPL 2022 - MI vs LSG: ముంబై బౌలర్లు తమ వరస మార్చుకోలేదు. ఆడుతున్నది కీలక మ్యాచ్ అని తెలిసి కూడా ప్రత్యర్థిని కట్టడి చేయలేదు. ఇక ముంబై అంటేనే పూనకం వచ్చిన వాడిలా ఆడే కెఎల్ రాహుల్.. మరోసారి అదే ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ గా రెండో సెంచరీ సాధించాడు.
వరుసగా ఐదు ఓటములు. ఈ పరాజయాలకు బౌలింగే కారణమని ఇంటా బయటా విమర్శలు. ఇక ప్రతి మ్యాచ్ ముఖ్యమే అని ప్రమాద ఘంటికలు హెచ్చిరిస్తున్నా ముంబై బౌలర్లు మారలేదు. వారి తీరూ మార్చుకోలేదు. లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు వీరబాదుడు బాదుతుంటే బొమ్మల్లా నిల్చుని చూశారు. ఒకవైపు లక్నో సారథి కెఎల్ రాహుల్ (60 బంతుల్లో 103 నాటౌట్.. 9 ఫోర్లు, 5 సిక్సర్లు).. దొరికిన బంతిని దొరికినట్టుగా స్టాండ్స్ లోకి పంపుతుంటే.. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. ఇక ముంబై అంటేనే వీర విహారం చేసే రాహుల్ ఈ మ్యాచ్ లో కూడా అదే ఆటను కొనసాగించాడు. లక్నో ఇన్నింగ్స్ లో ఆది నుంచి అంతం వరకు అంతా రాహుల్ దే. అతడి దూకుడుకు తోడు డికాక్, పాండే, హుడా మెరుపు ఆట తోడవడంతో నిర్ణీత 20 ఓవర్లలో లక్నో సూపర్ జెయింట్స్.. 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో గెలవాలంటే ముంబై 200 పరుగులు చేయాలి.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నోకు ఆ జట్టు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్నిచ్చారు. క్వింటన్ డికాక్ (13 బంతుల్లో 24.. 4 ఫోర్లు, 1 సిక్సర్) తో కలిసి లక్నో సారథి కెఎల్ రాహుల్ తొలి వికెట్ కు 5 ఓవర్లలోనే 52 పరుగులు జోడించాడు. తొలుత తన మాజీ జట్టుపై క్వింటన్ డికాక్.. కసితీరా బాదాడు.
ఉనద్కత్ వేసిన రెండో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన డికాక్.. ఆ తర్వాత మురుగన్ అశ్విన్ వేసిన మూడో ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. ఇక ఆ తర్వాత ఓవర్ వేసిన మిల్స్ ను శిక్షించడం రాహుల్ వంతైంది. మిల్స్ వేసిన ఐదో ఓవర్లో వరుసగా.. రెండు ఫోర్లు, సిక్సర్ కొట్టాడు లక్నో కెప్టెన్. అయితే ఐదో ఓవర్ వేసిన అలెన్ బౌలింగ్ లో భారీ సిక్సర్ కొట్టిన డికాక్.. తర్వాతి బంతికే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 52 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడంది.
రాహుల్ వన్ మ్యాన్ షో..
డికాక్ నిష్క్రమించినా రాహుల్ ఎక్కడా తగ్గలేదు. మనీష్ పాండే (29 బంతుల్లో 38.. 6 ఫోర్లు) తో జతగా ముంబై బౌలర్లను చితకబాదాడు. ముంబై అంటేనే సూనకం వచ్చినోడిలా ఆడే రాహుల్ (ఈ మ్యాచ్ కు ముందు 14 ఇన్నింగ్స్ లలో 661 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ., 5 హాఫ్ సెంచరీలున్నాయి. సగటు 66.10) ఇవాళ కూడా చెలరేగాడు. బౌలర్ ఎవరన్నదీ సంబంధం లేకుండా బాదుడే మంత్రంగా దూసుకెళ్లాడు. ఉనద్కత్ వేసిన పదో ఓవర్లో సిక్సర్ కొట్టి హాఫ్ సెంచరీకి దగ్గరరైన అతడు.. బుమ్రా బౌలింగ్ లో రెండు పరుగులు తీసి అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. టైమల్ మిల్స్ వేసిన 13 వ ఓవర్ లో రాహుల్, పాండేలు చెరో రెండు ఫోర్లు బాదారు. దీంతో లక్నో స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. అయితే మురుగన్ అశ్విన్ వేసిన 14వ ఓవర్లో రెండో బంతికి మనీష్ పాండే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 62 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
పాండే స్థానంలో క్రీజులోకి వచ్చిన స్టోయినిస్ (10) రావడంతోనే భారీ సిక్సర్ తో ఖాతా తెరిచాడు. ఒకవైపు రాహుల్ దూకుడును కొనసాగించాడు. అలెన్ వేసిన 15వ ఓవర్లో వరుసగా ఫోర్, రెండు సిక్సర్లు బాదిన రాహుల్.. ఎనభైలకు చేరుకున్నాడు. అయితే రెండో స్ట్రాటిజిక్ టైమ్ ఔట్ తర్వాత 17వ ఓవర్లో తొలి బంతికి ఉనద్కత్.. స్టోయినిస్ ను పెవిలియన్ కు పంపాడు.
సారథిగా రెండో సెంచరీ...
ఉనద్కత్ వేసిన 17వ ఓవర్లో వికట్ తీయడమే గాక మెయిడిన్ కూడా చేశాడు. బుమ్రా కూడా 18 ఓవర్లో 9 పరుగులే ఇచ్చాడు. కానీ 19వ ఓవర్ వేసిన మిల్స్.. 4, 1, 6, 4, 2 (వైడ్స్), 4 పరుగులిచ్చాడు. ఇదే ఓవర్లో తొలి బంతికి ఫోర్ కొట్టిన రాహుల్.. ఐదో బంతిని కూడా బౌండరీకి తరలించి సెంచరీ పూర్తి చేశాడు. దీపక్ హుడా (15) కాసేపే ఉన్నా ఫర్వాలేదనిపించాడు.
కెప్టెన్ గా రాహుల్ కు ఇది రెండో సెంచరీ కాగా మొత్తంగా మూడోది. పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ గా ఉన్నప్పుడే సెంచరీ చేసిన అతడు తిరిగి లక్నో తరఫున కూడా సారథిగానే శతకం బాదడం గమనార్హం. ఇక ఈ ఐపీఎల్ లో జోస్ బట్లర్ తర్వాత సెంచరీ చేసిన ఆటగాడు రాహుల్ కాగా.. ఈ సీజన్ లో భారత్ తరఫున సెంచరీ చేసిన తొలి ఆటగాడు రాహులే..
గత ఐదు మ్యాచుల మాదిరిగానే ముంబై బౌలర్లు నేటి ఆటలో కూడా చేతులెత్తేశారు. మిల్స్, అలెన్ లు భారీగా పరగులిచ్చుకున్నారు. బుమ్రా ఒక్కడే కాస్త మెరుగ్గా రాణించాడు. బౌలర్లతో పాటు ఫీల్డింగ్ తప్పిదాలు కూడా ముంబై ని ముంచాయి. బౌండరీ లైన్ వద్ద నాలుగైదు ఫోర్లు ఫీల్డర్ల తప్పిదాల వల్లే కోల్పోయింది ముంబై.
