ఐపీఎల్ 2021 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ జట్టు స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన ఆట తీరుతో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఓ వైపు బౌలింగ్ తో అదరగొడుతూనే.. మరో వైపు ఫీల్డింగ్ లోనూ తన సత్తా చాటుతున్నాడు.

సోమవారం పంజాబ్ జట్టు.. కోల్ కతాపై పోరాడింది. విజయం కోల్ కతాకు దక్కినా.. రవి బిష్ణోయ్ ఆట తీరుకి మాత్రం క్రికెట్ అభిమానులు ఫిదా అయ్యారు. బౌలింగ్, ఫీల్డింగ్ అదరగొట్టాడు. ఇక అతను పట్టిన ఓ స్టన్నింగ్ క్యాచ్.. మ్యాచ్ కే హైలెట్ గా మారిందని చెప్పొచ్చు.

సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చిన రవి బిష్ణోయ్.. ఫీల్డింగ్‌లో సునీల్ నరైన్ క్యాచ్‌ని ఎవరూ ఊహించని రీతిలో ఫుల్ లెంగ్త్ డైవ్ చేస్తూ అందుకున్నాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 9 వికెట్ల నష్టానికి 123 పరుగులే చేయగలిగింది. అనంతరం ఛేదనలో కోల్‌కతా 9 పరుగులకే ఓపెనర్లు నితీశ్ రాణా (0), శుభమన్ గిల్ వికెట్లు చేజార్చుకోగా.. అప్పుడే క్రీజులోకి వచ్చిన సునీల్ నరైన్ (0: 4 బంతుల్లో) బ్యాట్‌ని బలంగా ఊపుతూ కనిపించాడు. అసలే తక్కువ స్కోరు.. ఆపై పవర్‌ప్లే కావడంతో పంజాబ్ బౌలర్లలోనూ కంగారు మొదలైంది.

కానీ.. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే సునీల్ నరైన్‌ని అర్షదీప్ సింగ్ ఔట్ చేసేశాడు. అర్షదీప్ విసిరిన లెంగ్త్ బాల్‌ని మిడ్ వికెట్ దిశగా బలంగా సునీల్ నరైన్ హిట్ చేశాడు. అక్కడ ఫీల్డర్ ఎవరూ లేకపోవడంతో బంతి కచ్చితంగా బౌండరీకి వెళ్తుందని నరైన్ చాలా ధీమాగా కనిపించాడు. కానీ.. డీప్‌స్వ్కేర్‌ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తూ కనిపించిన రవి బిష్ణోయ్ మెరుపు వేగంతో దూసుకొచ్చి డైవ్ చేస్తూ బంతిని క్యాచ్‌గా అందుకున్నాడు. దాంతో.. పంజాబ్ టీమ్ మైదానంలో సంబరాలతో హోరెత్తించింది. రవి బిష్ణోయ్‌ని చేతులపై ఎత్తుకుని మరీ సహచరులు అభినందించారు. మరోవైపు నరైన్ ఆ క్యాచ్‌‌ని నమ్మలేనట్లు చూసి.. నిరాశగా పెవిలియన్‌ వైపు నడిచాడు.