ఐపీఎల్ 2020 సందడి కొనసాగుతోంది. ఈ సీజన్ అందరి ఫేవరెట్ గా అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. చెన్నై వరస పరాజయాలతో వెనపడిపోతోంది. సోమవారం రాజస్థాన్ రాయల్స్ చేతిలో కూడా చెన్నై ఓటమిపాలయ్యింది. ఏమాత్రం ఫామ్ లోని రాజస్థాన్ రాయల్స్ చేతిలో కూడా చెన్నై ఓడిపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఈ ఓటమికి ధోనీ బాధ్యత వహించాలంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం పది మ్యాచ్ లు ఆడగా.. అందులో  చెన్నై ఏడు మ్యాచ్ లు ఓడిపోవడం గమనార్హం.

తాజాగా భారత మాజీ కెప్టెన్ శ్రీకాంత్ కృష్ణమాచారి.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై విరుచుకుపడ్డారు.  నిన్నటి మ్యాచ్ లో చెన్నై ఓటమికి  ధోనీ బాధ్యత వహించాల్సి ఉంటుందనీ చెప్పారు. ప్రత్యేకించి- తమ జట్టులో స్థానం దక్కించుకున్న కొంతమంది యంగ్ క్రికెటర్లు ఆశించిన స్థాయిలో రాణించట్లేదని, వారిలో గెలవాలనే ఆసక్తి లోపించిందంటూ  ధోనీ  కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
 
కాగా.. మ్యాచ్ ఓటమి అనంతరం యంగ్ క్రికెటర్లపై ధోనీ చేసిన కామెంట్స్ ని  శ్రీకాంత్ తప్పు పట్టారు. యంగ్ క్రికెటర్లలో స్పార్క లేదంటూ ధోనీ చెప్పడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డాడు.

యంగ్ క్రికెటర్ కేదార్ జాదవ్‌లో ఆ స్పార్క్ ఉందా? అని శ్రీకాంత్ ప్రశ్నించారు. స్టార్ స్పోర్ట్స్ తమిళ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ధోనీ గొప్ప క్రికెటర్ అనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని, రాజస్థాన్ రాయల్స్‌తో ఓటమి అనంతరం అతను చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించదలచుకోలేదని తేల్చి చెప్పారు. జట్టు ఎంపిక ప్రక్రియ మొత్తం ఏ మాత్రం బాగోలేదని అన్నారు. 

అత్యంత కీలకమైన మ్యాచ్‌లో కేదార్ జాదవ్‌ను ఆడించడం పట్ల శ్రీకాంత్ విమర్శించారు. కేదార్ జాదవ్‌లో ఏం స్పార్క్ ఉందని అతణ్ని తుదిజట్టులోకి తీసుకున్నారని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. కేదార్ జాదవ్ వరసగా మ్యాచ్ ల్లో విఫలమౌతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీ కామెంట్స్ పై శ్రీకాంత్ మరింత తీవ్రంగా మండిపడ్డారు.