క్రైస్ట్ చర్చ్: న్యూజిలాండ్ పై రెండో టెస్టు శనివారం ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. రెండో టెస్టు మ్యాచుకు పేసర్ ఇషాంత్ శర్మ దూరం కానున్నాడు. కివీస్ పై వరుస పరాజయాలతో తీవ్రమైన చిక్కుల్లో పడ్డ టీమిండియాకు ఇది భారీ షాక్.

ఇషాంత్ శర్మ చీలమండ గాయానికి గురైనట్లు వార్తలు వచ్చాయి. విదర్భలో జనవరిలో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచులో అతనికి కుడి చీలమండ గాయమైంది. అది తిరగదోడినట్లు తెలుస్తోంది. దీంతో అతను న్యూజిలాండ్ పై జరిగే రెండో టెస్టులో ఆడే అవకాశాలు లేవని అంటున్నారు. 

Also Read: పృథ్వీషాపై పుకార్లకు తెర దించిన కోచ్ రవిశాస్త్రి, అశ్విన్ పై అసంతృప్తి

ఇషాంత్ శర్మ స్థానంలో ఉమేష్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. రేపు మ్యాచ్ జరగనున్న స్థితిలో జరిగిన శిక్షణకు అతను దూరంగా ఉన్నాడు. గురువారం జరిగిన ప్రాక్టీస్ లో 20 నిమిషాల పాటు బౌలింగ్ చేసిన తర్వాత తన మోకాలి నొప్పి తిరగబెట్టిన విషయాన్ని ఇషాంత్ శర్మ టీమ్ మేనేజ్ మెంట్ కు తెలియజేసినట్లు సమాచారం. శుక్రవారంనాడు అతన్ని పరీక్షల నిమిత్తం పంపించారు. నివేదిక రావాల్సి ఉంది. 

నెట్ ప్రాక్టీస్ జరుగుతున్న సమయంలో పక్కన హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఉమేష్ యాదవ్ తో సుదీర్గంగా మాట్లాడడం కనిపించింది. ఈ సెషన్ కు జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ దూరంగా ఉన్నారు. అంతకు ముందు రోజు వారు సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేశారు. 

Also Read: బౌన్సీ వికెట్లపై గెలువలేదా: కోహ్లీ సేనపై కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

న్యూజిలాండ్ పై జరిగిన తొలి టెస్టు మ్యాచులో ఇషాంత్ శర్మ 68 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్ లో అతనిదే అద్భుతమైన బౌలింగ్. ఈ స్థితిలో రెండో టెస్టు మ్యాచుకు ఇషాంత్ దూరం కావడం భారత్ కు తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. రెండో టెస్టు మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను సమం చేయాలని చూస్తున్న భారత్ కు ఇది తీవ్రమైన ఎదురు దెబ్బ.