India vs Australia 2nd Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా... సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీ... ఛతేశ్వర్ పూజారాకి 100వ టెస్టు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులోనూ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్, ఇన్నింగ్స్ తేడాతో ఓడిన విషయం తెలిసిందే...
అయితే పిచ్ బ్యాటింగ్‌కి చక్కగా అనుకూలిస్తుందనే ఉద్దేశంతో తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్. భారత సారథి రోహిత్ శర్మ కూడా టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకునేవాడినని చెప్పడం విశేషం..
గాయం కారణంగా తొలి టెస్టుకి దూరంగా ఉన్న శ్రేయాస్ అయ్యర్, నేటి మ్యాచ్ ద్వారా జట్టులోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. శ్రేయాస్ అయ్యర్ స్థానంలో టెస్టు ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్, ఒక్క ఇన్నింగ్స్‌కే పరిమితమయ్యాడు...
కెఎల్ రాహుల్ స్థానంలో శుబ్‌మన్ గిల్‌ని ఆడిస్తారని ప్రచారం జరిగినా టెస్టు వైస్ కెప్టెన్‌పై మరోసారి నమ్మకం ఉంచింది టీమిండియా. టీమిండియా సీనియర్ ప్లేయర్ ఛతేశ్వర్ పూజారాకి ఇది 100వ టెస్టు మ్యాచ్. భారత జట్టు తరుపున 100కి పైగా టెస్టులు ఆడిన 13వ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఛతేశ్వర్ పూజారా.
ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ (200 టెస్టు మ్యాచులు), రాహుల్ ద్రావిడ్ (163), వీవీఎస్ లక్ష్మణ్ (134), అనిల్ కుంబ్లే (132), కపిల్ దేవ్ (131), సునీల్ గవాస్కర్ (125), దిలీప్ వెంగ్‌సర్కార్ (116), వీవీఎస్ లక్ష్మణ్ (113), విరాట్ కోహ్లీ (105*), ఇషాంత్ శర్మ (103), వీరేంద్ర సెహ్వాగ్ (103), హర్భజన్ సింగ్ (103) మాత్రమే టీమిండియా తరుపున 100కి పైగా టెస్టులు ఆడిన ప్లేయర్లుగా ఉన్నారు.
వీరిలో విరాట్ కోహ్లీ మాత్రం ప్రస్తుతం టీమిండియాతో కొనసాగుతుండగా ఇషాంత్ శర్మ, టీమ్‌లో చోటు కోల్పోయాడు. మిగిలిన ప్లేయర్లు అందరూ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించారు. 100వ మైలురాయి టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఛతేశ్వర్ పూజారాకి 100th Test క్యాప్ ఇచ్చి ప్రత్యేకంగా సత్కరించింది బీసీసీఐ. ఈ కార్యక్రమానికి టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్‌తో పాటు పూజారా తండ్రి, భార్య, కూతురు హాజరయ్యారు..
నాగ్‌పూర్ టెస్టులో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఓడిన ఆస్ట్రేలియా, రెండు మార్పులతో బరిలో దిగుతోంది...రెంషో స్థానంలో ట్రావిడ్ హెడ్ తుదిజట్టులోకి రాగా మాథ్యూ కుహెన్నేమన్ నేటి మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేస్తున్నాడు.
ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, పీటర్ హ్యాండ్స్‌కోంబ్, ఆలెక్స్ క్యారీ, ప్యాట్ కమ్మిన్స్, టాడ్ ముర్ఫీ, నాథన్ లియాన్, మాథ్యూ కుహెన్నేమన్
భారత జట్టు: రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
