జోహెన్నెస్ బర్గ్: టీమిండియా దక్షిణాప్రికాపై టెస్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. చివరి టెస్టు మ్యాచులో కూడా విజయం సాధించి సఫారీలను చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ డుప్లెసిస్ టీమిండియాపై తన అక్కసు వెళ్లగక్కాడు.

టీ20 సిరీస్ ను టైగా ముగించిన దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ లో పూర్తిగా చేతులెత్తేసింది. ఘోర పరాజయం తర్వాత సఫారీలు స్వదేశంలో అడుగు పెట్టారు. అయితే చివరి రెండు టెస్టుల విషయంలో భారత్ అనుసరించిన వ్యూహంపై డుప్లెసిస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చివరి రెండు టెస్టుల్లో కావాలని వెలుతురు తగ్గిన తర్వాత భారత్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిందని, దాని వల్ల తమ జట్టు త్వరగా వికెట్లు కోల్పోయిందని అన్నాడు. 

ప్రతీ టెస్టు మ్యాచ్ కాపీ పేస్ట్  మాదిరిగా జరిగిందని, ఇండియా తొలుత బ్యాటింగ్ చేయడం... 500 పరుగులు చేయడం.. ఆ తర్వాత వెలుతురు తగ్గాక డిక్లేర్ చేయడం చేశారని, దీంతో మొదటి మూడు వికెట్లు ఇండియాకు లభిస్తూ వచ్చాయని ఆయన అన్నాడు. మూడో రోజు ఆట ప్రారంభించినప్పుడు తాము ఒత్తిడిలో ఉండేవాళ్లమని అన్నాడు.

టెస్టు మ్యాచుల్లో టాస్ ను తొలగిస్తే విదేశాల్లో పర్యటించే జట్లకు లాభం చేకూరే అవకాశం ఉంటుందని ఆయన అన్నాడు. చివరి టెస్టులో తమ ఆటను గమనిస్తే తమకు ఆరంభం బాగా లభించిందని, అయితే ఎక్కువ సేపు ఆడాలనే పరిస్థితి వచ్చే సరికి తాము చెత్తగా ఆడడం ప్రారంభించామని ఆయన అన్నాడు. ఒక వేళ టాస్ తొలగిస్తే తమకు ఇంకా మంచి అవకాశం ఉండేదని, ఇతర దేశాల జట్లు తమ దేశానికి వచ్చినప్పుడు అలా చేసేదుకు తమకు అభ్యంతరం లేదని అనన్ాడు. ఎందుకంటే తాము గ్రీన్ పిచ్ లపై ఆడుతామని చెప్పాడు.