Asianet News TeluguAsianet News Telugu

INDvsNZ 2nd Test: పీకల్లోతు కష్టాల్లో న్యూజిలాండ్... 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి...

ముంబై టెస్టు: మూడు వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్... 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో న్యూజిలాండ్...

India vs New Zealand: Mohammad Siraj, Axar Patel, Ravi Ashwin breaks New Zealand top-order
Author
India, First Published Dec 4, 2021, 2:34 PM IST

ముంబై టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుంది. రెండో రోజు రెండో సెషన్‌లో తొలి ఇన్నింగ్స్‌ బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్, 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది... భారత పేసర్ మహ్మద్ సిరాజ్ ఒకే ఓవర్లో ఓపెనర్లు ఇద్దరినీ పెవిలియన్ చేర్చాడు. 4 పరుగులు చేసిన విల్ యంగ్‌ను, నాలుగో ఓవర్ మొదటి బంతికి పెవిలియన్ చేర్చిన సిరాజ్, అదే ఓవర్‌లో ఆఖరి బంతికి 10 పరుగులు చేసిన టామ్ లాథమ్‌ను అవుట్ చేశాడు...

ఆ తర్వాత సీనియర్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ కూడా సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కావడంతో 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్. ఆ తర్వాత 8 పరుగులు చేసిన డార్ల్ మిచెల్‌ను అక్షర్ పటేల్ అవుట్ చేయగా, 31 బంతుల్లో 7 పరుగులు చేసిన హెన్రీ నికోలస్‌ను మొదటి బంతికే క్లీన్‌బౌల్డ్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్...

దీంతో 13.1 ఓవర్లలో 31 పరుగులకే సగం న్యూజిలాండ్ టీమ్ పెవిలియన్ చేరింది. అంతకుముందు అజాజ్ పటేల్ అద్భుత స్పెల్‌తో 10కి 10 వికెట్లు తీయడంతో భారత జట్టు 325 పరుగులకే ఆలౌట్ అయ్యింది...

ఇదీ చదవండి: ఇదేం చెత్త అంపైరింగ్, బ్యాటుకి తగులుతున్నట్టు కనిపించినా... విరాట్ కోహ్లీ అవుట్‌పై వివాదం...

ఓవర్‌నైట్ స్కోరు 221/4 వద్ద రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు, రెండో రోజు ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే  వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. 62 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 27 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహాను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన అజాజ్ పటేల్, ఆ తర్వాతి బంతికే రవిచంద్రన్ అశ్విన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 

224 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన భారత జట్టును మయాంక్ అగర్వాల్, అక్షర్ పటేల్ కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కి 67 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు...

311 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్సర్లతో 150 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ కూడా అజాజ్ పటేల్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరడం విశేషం... మయాంక్ అగర్వాల్‌కి ఇది మూడో 150+ స్కోరు కాగా, టీమిండియా టెస్టు ఓపెనర్లలో వీరేంద్ర సెహ్వాగ్ (8 సార్లు), సునీల్ గవాస్కర్ (6 సార్లు) మాత్రమే మయాంక్ అగర్వాల్ కంటే ముందున్నారు.

128 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 52 పరుగులు చేసిన అక్షర్ పటేల్ కూడా అజాజ్ పటేల్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.... ఆ తర్వాత జయంత్ యాదవ్ 31 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసి అజాజ్ పటేల్ బౌలింగ్‌లో రచిన్ రవీంద్రకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు... 

ఆ తర్వాత మహ్మద్ సిరాజ్ 3 బంతుల్లో ఓ ఫోర్ బాది, అజాజ్ పటేల్ బౌలింగ్‌లోనే రచిన్ రవీంద్రకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.  జిమ్ లాకర్, అనిల్ కుంబ్లేల తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు అజాజ్ పటేల్. 

న్యూజిలాండ్‌ తరుపున ఆస్ట్రేలియాపై 9 వికెట్లు తీసిన రిచర్డ్ హార్డ్‌లే ప్రదర్శనే ఇప్పటిదాకా అత్యుత్తమ పర్ఫామెన్స్‌గా ఉండగా, అజాజ్ పటేల్ ఆ రికార్డు బ్రేక్ చేశాడు. 1956లో ఆస్ట్రేలియాలపై జిమ్ లాకర్, 1999లో పాకిస్తాన్‌పై అనిల్ కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీయగా, భారత్‌పై ఈ ఘనత సాధించిన మొదటి బౌలర్‌గా అజాజ్ పటేల్ రికార్డు క్రియేట్ చేశాడు.

Read Also: ఆ సమయంలో విరాట్ కోహ్లీతో ఆ అంపైర్‌కి గొడవలు... ఆ పగతోనే అవుట్ ఇచ్చాడా...

Follow Us:
Download App:
  • android
  • ios