తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేసిన ఆస్ట్రేలియా... 4 వికెట్లు తీసిన మహ్మద్ షమీ! రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు మూడేసి వికెట్లు..
నాగ్‌పూర్ టెస్టు ఘోర పరాజయం నుంచి త్వరగానే పాఠం నేర్చుకుంది ఆస్ట్రేలియా. తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగుల స్కోరు చేసి, 78.4 ఓవర్ల పాటు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొగలిగింది.. తొలి టెస్టులో ఒక్క ఆసీస్ బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ నమోదు చేయలేకపోతే, ఢిల్లీ టెస్టులో ఇద్దరు బ్యాటర్లు 50+ స్కోర్లు నమోదు చేశారు..
ఢిల్లీ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకి ఓపెనర్లు ఆచితూచి ఆడి శుభారంభం అందించారు. డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా జాగ్రత్తగా ఆడుతూ తొలి వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అయితే 44 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
అవుట్ అవ్వడానికి ముందు మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఓ బౌన్సర్ బలంగా తగలడంతో డేవిడ్ వార్నర్ చేతికి గాయమైంది. ఫిజియో చికిత్స తర్వాత తిరిగి బ్యాటింగ్ కొనసాగించిన వార్నర్, బౌన్సర్లను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడ్డాడు..
వార్నర్ అవుటైన తర్వాత మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా కలిసి రెండో వికెట్‌కి 41 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 25 బంతుల్లో 4 ఫోర్లతో 18 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్ఎస్ తీసుకున్న టీమిండియాకి అనుకూలంగా ఫలితం వచ్చింది...
టీవీ రిప్లైలో బంతి వికెట్లను తాకుతున్నట్టు స్పష్టంగా కనిపించడంతో లబుషేన్ నిరాశగా వెనుదిరిగాడు. అదే ఓవర్‌లో ఆఖరి బంతికి స్టీవ్ స్మిత్‌ని డకౌట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. 2 బంతులాడిన స్టీవ్ స్మిత్, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
గత రెండేళ్లలో స్టీవ్ స్మిత్‌ని అవుట్ చేయడం నాలుగోసారి... మూడు బంతుల వ్యవధిలో ఐసీసీ నెం. 1 బ్యాటర్‌ని, నెం.2 బ్యాటర్‌ని పెవిలియన్ చేరాడు. 30 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
ఈ దశలో ఉస్మాన్ ఖవాజా, పీటర్ హ్యాండ్స్‌కోంబ్ కలిసి ఐదో వికెట్‌కి 59 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 125 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 81 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజా, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో కెఎల్ రాహుల్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు.. అలెక్స్ క్యారీ 5 బంతులాడి అశ్విన్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు...
ఈ దశలో ప్యాట్ కమ్మిన్స్, పీటర్ హ్యాండ్స్‌కోంబ్ కలిసి ఏడో వికెట్‌కి 59 పరుగులు జోడించారు. 59 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేసిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అదే ఓవర్‌లో ఆఖరి బంతికి టాడ్ ముర్ఫీని క్లీన్ బౌల్డ్ చేశాడు జడ్డూ...
26 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన నాథన్ లియాన్‌ని మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. 68 పరుగుల వద్ద పీటర్ హ్యాండ్స్‌కోంబ్, జడేజా బౌలింగ్‌లో అశ్విన్‌కి క్యాచ్ ఇచ్చాడు. అయితే అది నో బాల్‌గా తేలడంతో పెవిలియన్‌కి వెళ్తున్న ప్లేయర్లు తిరిగి గ్రౌండ్‌లోకి రావాల్సి వచ్చింది...
తొలి టెస్టు ఆడుతున్న కుహ్నెమన్‌ని మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కి తెరపడింది. 142 బంతుల్లో 9 ఫోర్లతో 72 పరుగులు చేసిన పీటర్ హ్యాండ్స్‌కోంబ్, నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో షమీకి 4 వికెట్లు దక్కగా అశ్విన్, జడేజా మూడేసి వికెట్లు తీశారు.
