Asianet News TeluguAsianet News Telugu

మిల్లర్ సెంచరీ బాదినా రెండో టీ20లో టీమిండియాదే విజయం.. చరిత్ర సృష్టించిన భారత్..

IND vs SA T20I: దక్షిణాఫ్రికాపై స్వదేశంలో టీ20 సిరీస్ నెగ్గలేదన్న  రికార్డును  చెరిపేస్తూ టీమిండియా గువహతిలో అదిరిపోయే విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసి బ్యాటింగ్ లో రెచ్చిపోయిన టీమిండియా.. ఆ తర్వాత బౌలింగ్ లో సఫారీలను కట్టడి చేసింది. 
 

India Beat South Africa by 16 Runs in Guwahati and Lead The Series with 2-0
Author
First Published Oct 2, 2022, 11:15 PM IST

ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య  గువహతి  వేదికగా జరిగిన రెండో టీ20 ఉత్కంఠభరితంగా ముగిసింది. తొలి టీ20లో బౌలర్లు పండుగ చేసుకోగా రెండో టీ20లో బ్యాటర్లు అంతకుమించిన పరుగల వరద సృష్టించారు. భారత్ నిర్దేశించిన 238 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డా డేవిడ్ మిల్లర్ (47 బంతుల్లో 106 నాటౌట్, 8 ఫోర్లు, 7 సిక్సర్లు), క్వింటన్ డికాక్ (49 బంతుల్లో 68 నాటౌట్, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) లు అద్భుతమైన  ఆటతో మ్యాచ్ లో దక్షిణాఫ్రికా పోరాడేలా చేశారు. ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు 174 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత శిభిరంలో ఆందోళన లేపారు. 

డేవిడ్ మిల్లర్ సెంచరీతో ఆదుకున్నా సాధించాల్సిన లక్ష్యం మరీ ఎక్కువగా ఉండటంతో వీళ్ల జోరు సరిపోలేదు. దీంతో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 221 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక  టీ20లలో  స్వదేశంలో దక్షిణాఫ్రికాను ఓడించి సిరీస్ దక్కించుకోవడం భారత్ కు ఇదే ప్రథమం. చివరి మ్యాచ్ ఈనెల 4న ఇండోర్ లో జరుగనుంది. 

భారీ లక్ష్యాన్ని కరిగించడానికి బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు  రెండు ఓవర్లకే డబుల్ షాక్ తగిలింది. ఆ జట్టు సారథి టెంబ బవుమా (0) మరోసారి విఫలమయ్యాడు. తొలి ఓవర్ చహార్ మెయిడిన్ వేయగా.. అర్ష్‌దీప్ వేసిన రెండో ఓవర్  రెండో బంతికే బవుమా.. మిడాఫ్ లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అదే ఓవర్లో నాలుగో బంతికి రూసో (9) కూడా  మిడ్ వికెట్ వద్ద ఉన్న దినేశ్ కార్తీక్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్క్రమ్ (19 బంతుల్లో 33, 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు.   అర్ష్‌దీప్ వేసిన ఆరో ఓవర్లో  4, 6 బాదాడు. తొలి పవర్ ప్లే ముగిసేసరికి సౌతాఫ్రికా.. 2 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ వేసిన 7 ఓవర్ రెండో బంతికి మార్క్రమ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత స్పిన్నర్లు పరుగులను నియంత్రించడంతో సఫారీలు అనుకున్న స్థాయిలో భారీ షాట్లు ఆడలేకపోయారు.  పది ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా స్కోరు 3 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. చివరి 10 ఓవర్లలో సఫారీలు.. 168 పరుగులు చేయాల్సి వచ్చింది. 

మిల్లర్ కిల్లర్ షో..

సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోతుండటంతో డేవిడ్ మిల్లర్ గేర్ మార్చాడు. హర్షల్ పటేల్ వేసిన 11వ ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదిన మిల్లర్.. అశ్విన్ వేసిన 12వ ఓవర్లో రెండు సిక్సర్లు, ఫోర్ కొట్టాడు. తర్వాత ఓవర్ వేసిన హర్షల్ పటేల్ బౌలింగ్ లో తొలి బంతికి డికాక్ ఇచ్చిన క్యాచ్ ను రాహుల్ డ్రాప్ చేశాడు.  అర్ష్‌దీప్ వేసిన 13వ ఓవర్లో సిక్సర్ బాదిన  మిల్లర్ 25 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 14 ఓవర్లు ముగిసేసరికి సఫారీ స్కోరు 3 వికెట్లకు 125 పరుగులు చేసింది. 

చివరి ఆరు ఓవర్లలో 113 పరుగులను ఛేదించాల్సి ఉండగా అక్షర్ పటేల్  వేసిన 15వ ఓవర్ లో  డికాక్ రెచ్చిపోయాడు.  వరుస బంతుల్లో రెండు సిక్సర్లు, ఫోర్ బాదాడు.ఆ ఓవర్లో 18 పరుగులొచ్చాయి. హర్షల్ వేసిన 16వ ఓవర్లో మిల్లర్ రెండు ఫోర్లు కొట్టాడు. అదే ఓవర్లో ఇద్దరి మధ్య భాగస్వామ్యం వంద పరుగులు దాటడంతో పాటు ఐదో బంతికి సింగిల్ తీయడం ద్వారా డికాక్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 16వ ఓవర్లో 13 పరుగులొచ్చాయి. దీపక్ చహార్ వేసిన 17వ ఓవర్లో  8 పరుగులే వచ్చాయి. హర్షల్ కూడా 18వ ఓవర్లో 11 పరుగులిచ్చాడు. కానీ అర్ష్‌దీప్19వ ఓవర్లో ఏకంగా 26 పరుగులిచ్చాడు. చివరి ఓవర్ వేసిన అక్షర్ పటేల్ బౌలింగ్ లో మిల్లర్ రెండు సిక్సర్లు బాది కెరీర్ లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 46 బంతుల్లోనే అతడి సెంచరీ పూర్తయింది. 

రికార్డు విజయం.. 

డికాక్, మిల్లర్ లు కలిసి మూడో వికెట్ కు 174 పరుగుల భాగస్వామ్యం జోడించారు. భారత్ పై ఏ వికెట్ కైనా టీ20లలో ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. ఇదిలాఉండగా రెండు జట్ల మధ్య స్వదేశంలో సఫారీలతో జరిగిన టీ20 సిరీస్ లలో  సౌతాఫ్రికాలను ఓడించడం ఇదే ప్రథమం.  2015లో జరిగిన  టీ20 సిరీస్ ను భారత్ 0-2 తో కోల్పోయింది. 2019లో సిరీస్ డ్రా అయింది. 2022 జూన్ లో కూడా సిరీస్ డ్రా అయింది. ఇక తాజాగా భారత్ సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలుండగానే చేజిక్కించుకుంది. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్లు కెఎల్ రాహుల్ (28 బంతుల్లో 57, 5 ఫోర్లు, 4 సిక్సర్లు), రోహిత్ శర్మ (37 బంతుల్లో 43, 7 ఫోర్లు, 1 సిక్స్), విరాట్ కోహ్లీ (28 బంతుల్లో 49 నాటౌట్, 7 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 61, 5 ఫోర్లు, 5 సిక్సర్లు), దినేశ్ కార్తీక్  (7 బంతుల్లో 17 నాటౌట్, 1 ఫోర్, 2 సిక్సర్లు) వీరబాదుడు బాది భారత్ కు భారీ స్కోరునందించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios