Asianet News TeluguAsianet News Telugu

అపజయంతో ఆస్ట్రేలియాకు.. సఫారీలతో ఆఖరి టీ20లో భారత్ దారుణ ఓటమి.. సిరీస్ 2-1తో కైవసం

IND vs SA T20I Live: ఇండోర్ వేదికగా ముగిసిన చివరి టీ20లో  ఆ జట్టు నిర్దేశించిన 228 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్.. 178 పరుగులకే పరిమితమై 49 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.  బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో భారత్ దారుణంగా విఫలమైంది. 

IND vs SA T20I:  South Africa Beats India By 49 Runs, Rohit And Co Win Series with 2-1
Author
First Published Oct 4, 2022, 10:43 PM IST

టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆడిన ఆఖరి టీ20 మ్యాచ్ లో భారత్ దారుణంగా ఓడింది. ఇప్పటికే సిరీస్ గెలిచామన్న నిర్లక్ష్యం, ఆటలో అలసత్వం టీమిండియాను దారుణంగా దెబ్బతీశాయి. సఫారీలతో  ఇండోర్ వేదికగా ముగిసిన చివరి టీ20లో  ఆ జట్టు నిర్దేశించిన 228 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్.. 18.3 ఓవర్లలో 178 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్.. 49 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారత జట్టులో దినేశ్ కార్తీక్ (46) టాప్ స్కోరర్ కాగా   దీపక్ చహార్ (17 బంతుల్లో 31, 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. వీళ్లిద్దరూ తప్ప మిగిలిన భారత బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ సిరీస్ లో  ఇప్పటికే భారత్ తొలి రెండు మ్యాచ్ లలో విజయాలు సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్ ముగిసిన నేపథ్యంలో  ఈనెల 6న రోహిత్ సేన ఆస్ట్రేలియా విమానమెక్కనుంది. శిఖర్  ధావన్ సారథ్యంలోని ద్వితీయ శ్రేణి భారత జట్టు..  అదే తేదీ నుంచి దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు ఆడనుంది. 

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియాకు  ఆది నుంచి కష్టాలే  ఎదురయ్యాయి.  భారత ఇన్నింగ్స్ రెండో బంతికే రోహిత్ శర్మ (0) డకౌట్ అయ్యాడు.  రబాడా వేసిన బంతి రోహిత్ బ్యాట్ కు తాకి  వెనకాల ఉన్న వికెట్లను పడగొట్టింది. వన్ డౌన్ లోకి క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (1) ను పార్నెల్ ఎల్బీడబ్ల్యూగా  ఔట్ చేశాడు.  స్కోరు బోర్డుపై 4 పరుగులు చేరకముందే  భారత్.. 2 వికెట్లను కోల్పోయింది. 

నాలుగో స్థానంలో బ్యాటింగ్ ప్రమోషన్ పొందిన దినేశ్ కార్తీక్ (21 బంతుల్లో 46, 4 ఫోర్లు, 4 సిక్సర్లు)  తో కలిసి రిషభ్ పంత్ (14 బంతుల్లో 27, 3 ఫోర్లు, 2 సిక్సర్లు)  దూకుడుగా ఆడారు. ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు 41 పరుగులు జోడించారు.  జోరుమీదున్న ఈ జోడీని ఎంగిడి విడదీశాడు. అతడు వేసిన ఐదో ఓవర్ ఆఖరి బంతికి పంత్.. కవర్ పాయింట్ వద్ద ఉన్న స్టబ్స్ కు క్యాచ్ ఇచ్చాడు.  ఆరో ఓవర్ వేసిన  పార్నెల్ బౌలింగ్ లో కార్తీక్ రెచ్చిపోయాడు. ఆ ఓవర్లో వరుసగా 6, 4, 6 పరుగులు పిండుకున్నాడు. తొలి పవర్ ప్లే ముగిసేసరికి భారత స్కోరు 3 వికెట్ల నష్టానికి 64 పరుగులు. 

జోరుమీదున్న కార్తీక్.. కేశవ్ మహారాజ్ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. కానీ ఆఖరి బంతికి రివర్స్ స్వీప్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక తన కెరీర్ లోనే అత్యద్భుత ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ (8)  కొండను కరిగిస్తాడని అంతా ఆశించారు. కానీ ప్రిటోరియస్ వేసిన 8వ ఓవర్లో నాలుగో బంతికి సిక్సర్ బాదిన  సూర్య.. చివరి బంతికి  స్టబ్స్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత భారత స్కోరు నెమ్మదించింది. భారత ఇన్నింగ్స్ అర్థభాగం ముగిసేసరికి  టీమిండియా.. 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది.   చివరి  60 బంతుల్లో భారత్ కు 133 పరుగులు కావాలి. 

 

అక్షర్ పటేల్ (9)తో జతకలిసిన   హర్షల్ పటేల్ (11 బంతుల్లో 17, 2 ఫోర్లు, 1 సిక్సర్) రెండు ఫోర్లు కొట్టి జోరుమీదే కనిపించినా  ఎంగిడి వేసిన పదో ఓవర్ ఐదో బంతికి భారీ షాట్ ఆడబోయి లాంగాఫ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న డేవిడ్ మిల్లర్ చేతికి చిక్కాడు.  ఆ తర్వాతి ఓవర్లోనే  అక్షర్ కూడా పార్నెల్ బౌలింగ్ లో వికెట్ కీపర్ డికాక్ చేతికి చిక్కాడు. కేశవ్ మహారాజ్ వేసిన 13 ఓవర్ రెండో బంతికి అశ్విన్ భారీ షాట్ ఆడి  లాంగాన్ లో ఉన్న రబాడాకు క్యాచ్ ఇచ్చాడు. 

చివర్లో దీపక్ చహార్ ఓటమి అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. ఉమేశ్ యాదవ్ (17 బంతుల్లో 20 నాటౌట్, 2ఫోర్లు) తో కలిసి 9వ వికెట్ కు 48  పరుగుల భాగస్వామ్యాన్ని జతచేశాడు. ఈ జోడీ 26 బంతుల్లోనే 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. కానీ  ప్రిటోరియస్ వేసిన 17వ ఓవర్లో రెండో బంతికి సిక్సర్ బాదిన చహార్.. మూడో బంతికి డేవిడ్ మిల్లర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సిరాజ్  (5) ను ప్రిటోరియస్ ఔట్ చేయడంతో భారత ఇన్నింగ్స్ 18.3 ఓవర్లలో 178 పరుగుల వద్ద ముగిసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో పార్నెల్ మూడు వికెట్లు తీయగా.. ఎంగిడి,  ప్రిటోరియస్, కేశవ్ మహారాజ్  లు  తలా రెండు వికెట్లు తీశారు. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. వన్ డౌన్ బ్యాటర్ రిలీ రోసో (48 బంతుల్లో 100  నాటౌట్,  7 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా  క్వింటన్ డికాక్ (43 బంతుల్లో 68, 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి ఆడారు. భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios