Asianet News TeluguAsianet News Telugu

IND vs SA: బౌలర్లు సూపర్ హిట్.. టీమిండియా ముందు ఈజీ టార్గెట్..

IND vs SA T20I:  టీమిండియా పేసర్లు దీపక్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ లు తొలి మూడు ఓవర్లలోనే సఫారీల పనిపట్టారు. వీళ్లిద్దరి ధాటికి సౌతాఫ్రికా ఓ దశలో 2.3 ఓవర్లలో 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.  కానీ సఫారీలు కోలుకుని స్కోరుబోర్డును వంద దాటించారు. 
 

IND vs SA 1st T20I Live: South Africa Sets 107 Target For  India
Author
First Published Sep 28, 2022, 8:43 PM IST

గత కొద్దిరోజులుగా టీమిండియా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్న బౌలింగ్ విభాగంలో జట్టు  మెరుగుపడ్డట్టే కనిపిస్తున్నది.  పేసర్ల  జోరుకు తోడు స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తొలి టీ20లో దక్షిణాఫ్రికా  బ్యాటింగ్ లో  విలవిల్లాడింది.  తిరువనంతపురం వేదికగా జరుగుతున్న తొలి టీ20లో నిర్ణీత  20 ఓవర్లలో ఆ జట్టు.. 8  వికెట్లు కోల్పోయి  106 పరుగులకే పరిమితమైంది. టీమిండియా పేసర్లు దీపక్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ లు తొలి మూడు ఓవర్లలోనే సఫారీల పనిపట్టారు. వీళ్లిద్దరి ధాటికి సౌతాఫ్రికా ఓ దశలో 2.3 ఓవర్లలో 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ కేశవ్ మహారాజ్ (35 బంతుల్లో 41, 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో పాటు  మార్క్రమ్ (25), పార్నెల్ (24) ఆదుకోకుంటే సఫారీలు ఆ మాత్రం స్కోరు కూడా చేసేవాళ్లు కాదు. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన సౌతాఫ్రికాకు తొలి ఓవర్లోనే భారీ షాక్ తాకింది. దీపక్ చాహర్ వేసిన ఆ ఓవర్లో ఆఖరు బంతికి సఫారీ సారథి టెంబ బవుమా (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆసియాకప్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ లో అసిఫ్ అలీ ఇచ్చిన క్యాచ్   డ్రాప్ చేసి తీవ్ర విమర్శల పాలై ఆస్ట్రేలియా సిరీస్ తో ఆడలేకపోయిన అర్ష్‌దీప్ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు.  అతడు వేసిన రెండో ఓవర్లో దుమ్ము దులిపాడు.  

అర్ష్‌దీప్ వేసిన రెండో ఓవర్లో.. రెండో బంతికి  క్వింటన్ డికాక్  (1)  వికెట్ల మీదకు ఆడుకుని పెవిలియన్ చేరాడు. ఐదో బంతికి  రూసో (0) వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు క్యాచ్ ఇచ్చాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన డేవిడ్ మిల్లర్ (0)  కూడా తర్వాత బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  
దీంతో అసలు గ్రౌండ్ లో ఏం జరుగుతుందో సౌతాఫ్రికా జట్టుతో పాటు  ప్రేక్షకులకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఓవర్ వేసిన చాహర్ దక్షిణాఫ్రికాకు మరో షాకిచ్చాడు.  మూడో ఓవర్ రెండో బంతికి ట్రిస్టన్ స్టబ్స్ (0)  అర్ష్‌దీప్ కు క్యాచ్ ఇచ్చాడు.  9 పరుగులకే ఐదు వికెట్లు. పీకల్లోతు కష్టాల్లో సౌతాఫ్రికా పడింది. 

ఆ క్రమంలో వచ్చిన పార్నెల్ (24) తో కలిసి మార్క్రమ్ (24 బంతుల్లో 25, 3 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్ ను చక్కదిద్దే పనిలో పడ్డాడు. కానీ హర్షల్ పటేల్.. మార్క్రమ్ పని పట్టాడు.  ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన హర్షల్.. చివరి బంతికి  మార్ర్కమ్ ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా 42 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. 

10 ఓవర్లు ముగిసేసరికి  సౌతాఫ్రికా.. 6 వికెట్ల నష్టానికి 48 పరుగులే చేయగలిగింది. కానీ తర్వాత ఓవర్లో అశ్విన్.. ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. దీపక్ చాహర్ వేసిన  12వ ఓవర్లో పరుగు తీయడం ద్వారా సౌతాఫ్రికా స్కోరు హాఫ్  పెంచరీ దాటింది.  స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో  సౌతాఫ్రికా పరుగుల చేయడమే కష్టమైపోయింది. 

స్కోరు మరీ తక్కువగా ఉండటంతో హిట్టింగ్ కు దిగాలని చూసిన పార్నెల్ ఆటలు సాగలేదు. అక్షర్ పటేల్ వేసిన 16వ ఓవర్లో అతడు.. భారీ షాట్ ఆడి డీప్ మిడ్ వికెట్ వద్ద  ఫీల్డింగ్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కానీ కేశవ్ మహారాజ్ చివర్లో  మెరుపులు మెరిపించడంతో  సఫారీల స్కోరు వంద దాటింది.

 

టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్.. నాలుగు ఓవర్లు వేసి  32 పరుగులిచ్చి  3 కీలక వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్.. నాలుగు ఓవర్లలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అశ్విన్  నాలుగు ఓవర్లు వేసి 8 పరుగులే ఇచ్చాడు. అందులో ఓ ఓవర్ మెయిడిన్ కూడా ఉంది. వికెట్లేమీ తీయకపోయినా అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అక్షర్ కూడా.. 4 ఓవర్లో 16 పరుగులే ఇచ్చి 1 వికెట్ల తీశాడు. హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 2 వికెట్లు తీశాడు.  

టీ20లలో 2.3 ఓవర్లలోనే  అతి తక్కువ (9) పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన  రికార్డును మూటగట్టుకుంది. అంతకుముందు దక్షిణాఫ్రికా.. దుబాయ్ లో అఫ్గానిస్తాన్ తో మ్యాచ్ లో 20 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios