TATA IPL 2022: ఐపీఎల్ లో వరుస విజయాలతో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సాగుతోంది గుజరాత్ టైటాన్స్. బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు కెప్టెన్సీలో కూడా తనదైన మార్కు చూపుతున్నాడు ఆ జట్టు సారథి హార్ధిక్ పాండ్యా..
గుజరాత్ టైటాన్స్ సారథి హార్ధిక్ పాండ్యా వరుస విజయాలతో ప్రత్యర్థి జట్లకు తామేమాత్రం తీసిపోమంటూ దూసుకుపోతున్నాడు. ఐపీఎల్ లో వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించి నాలుగో మ్యాచులో ఓడినా తిరిగి రెండ్రోజుల క్రితం జరిగిన మ్యాచులో రాజస్తాన్ రాయల్స్ ను మట్టికరిపించాడు. బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు కెప్టెన్ గా కూడా సక్సెస్ అవుతున్న పాండ్యా పై పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి, మాజీ క్రికెటర్ మనోజ్ తివారి ప్రశంసలు కురిపించాడు. అతడు టీమిండియాకు తర్వాతి కెప్టెన్ అవుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు సారథిగా పాండ్యా వ్యూహాలు అద్భుతమని తివారి కొనియాడాడు.
తివారి స్పందిస్తూ... ‘ఒకవేళ భారత జట్టులో గనక రాబోయే రోజుల్లో తదుపరి సారథి ఎవరు..? అనే చర్చ ఉత్పన్నమైతే ఆ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు హార్ధిక్ పాండ్యా అవుతానడంలో సందేహమే లేదు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో అతడు తదుపరి సారథిగా నియమించడానికి అన్ని అర్హతలు ఉన్నాయి.
బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు సారథిగా కూడా పాండ్యా ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా మ్యాచులలో ఫీల్డ్ ఫ్లేస్మెంట్లు, బౌలింగ్ మార్పులు బాగున్నాయి. అతడు గుజరాత్ తరఫున సారథిగా వ్యవహరించింది తక్కువ మ్యాచులే అయినా పాండ్యా మంచి ప్రదర్శనలతో శభాష్ అనిపించుకున్నాడు. నేనైతే మొత్తంగా పాండ్యా ప్రదర్శనకు ఫిదా అయ్యాను..’ అని ట్విట్టర్ లో పేర్కొన్నాడు.
కాగా ఈ ఐపీఎల్ లో వరుసగా తొలి మూడు మ్యాచులు గెలిచిన గుజరాత్ టైటాన్స్.. నాలుగు రోజుల క్రితం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచు లో ఘోర పరాజయాన్ని ఎదుర్కున్నది. అయితే రెండ్రోజుల క్రితం రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచులో 50 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్ కు వచ్చి కీలక ఇన్నింగ్స్ ఆడాడు పాండ్యా. 52 బంతుల్లోనే 87 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. పాండ్యా మెరుపుల కారణంగా గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగలిగింది. బ్యాట్ తో దుమ్మురేపిన పాండ్యా.. బౌలింగ్ లో కూడా 2.3 ఓవర్లు బౌలింగ్ చేసి 18 పరుగులిచ్చి ఒక వికెట్ కూడా తీసుకున్నాడు.
ఇదిలాఉండగా ప్రస్తుతం టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో రోహిత్ శర్మ సారథిగా ఉన్నాడు. విరాట్ కోహ్లి తప్పుకున్న నేపథ్యంలో అన్ని ఫార్మాట్లలో రోహిత్ ను సారథిగా చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. వయసు దృష్ట్యా ఇంకో రెండు మూడేండ్ల కంటే రోహిత్ నాయకుడిగా ఉండటం అనుమానమే. అయితే హిట్ మ్యాన్ తర్వాత ఎవరు..? అన్న ప్రశ్న గతంలోనే ఉత్పన్నమైంది. కెఎల్ రాహుల్, రిషభ్ పంత్ రూపంలో పలు సమాధానాలు వచ్చాయి. కానీ ఈ ఐపీఎల్ లో శ్రేయస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యాలు కూడా ఆ జాబితాలో చేరారు.
