WTC final 2023: 49 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా డకౌట్... ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన స్కాట్ బోలాండ్... 

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ 2023లో టీమిండియా వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓవర్‌నైట్ స్కోర్ 164/3 వద్ద ఐదో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, 13 పరుగులు మాత్రమే జోడించి విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయింది..ఆ వెంటనే రవీంద్ర జడేజా డకౌట్ అయ్యాడు. 

78 బంతుల్లో 7 ఫోర్లతో 49 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో స్లిప్‌లో స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 179 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది భారత జట్టు. క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా, రెండో బంతికే అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఒకే ఓవర్‌లో రెండు కీలక వికెట్లు తీసిన స్కాట్ బోలాండ్, టీమిండియా అభిమానుల ఆశలపై నీళ్లు పోశాడు. వెంటవెంటనే రెండు కీలక వికెట్లు కోల్పోయిన భారత జట్టు, ఈ మ్యాచ్ గెలవాలంటే ఇంకా 265 పరుగులు కావాలి. డ్రా చేసుకోవాలంటే ఇంకా 83 ఓవర్ల పాటు ఆలౌట్ కాకుండా వికెట్ కాపాడుకోగలగాలి.. 

అజింకా రహానే 30 పరుగులతో క్రీజులో ఉండగా శ్రీకర్ భరత్, శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ చేయగలరు. మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ మెరుపులు మెరిపించినా భారీ ఇన్నింగ్స్‌లు ఆశించడం అత్యాశే అవుతుంది..

దీంతో రహానేతో పాటు శ్రీకర్ భరత్, శార్దూల్ ఠాకూర్ ఎంతసేపు బ్యాటింగ్ చేస్తారనే దానిపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అవుట్ అవ్వడానికి ఒక్క బంతి ముందు విరాట్ కోహ్లీ అవుట్ కోసం డీఆర్‌ఎస్ తీసుకుంది ఆస్ట్రేలియా. టీవీ రిప్లై బంతికీ, బ్యాటుకీ చాలా గ్యాప్ ఉండడంతో కోహ్లీ నాటౌట్‌గా తేలాడు. అయితే ఆ అవకాశాన్ని సరిగ్గా వాడుకోలేకపోయిన విరాట్ కోహ్లీ, హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు ముందు అవుట్ అయ్యాడు.. 

అంతకుముందు 444 పరుగుల భారీ టార్గెట్‌తో నాలుగో రోజు రెండో సెషన్‌లో బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, శుబ్‌మన్ గిల్ వికెట్ త్వరగా కోల్పోయింది. 18 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లోనే కామెరూన్ గ్రీన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే క్యాచ్ పట్టిన తర్వాత కామెరూన్ గ్రీన్ చేతిలోని బంతి, నేలను తాకినట్టు క్లియర్‌గా కనిపించింది.

అయినా థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించడం తీవ్ర వివాదాస్పదమైంది. 43 పరుగులు చేసిన రోహిత్ శర్మ, నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ కాగా ఛతేశ్వర్ పూజారా 27 పరుగులు చేసి అనవసర షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. 93 పరుగులుకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాని విరాట్ కోహ్లీ, అజింకా రహానే కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు.

ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కి 86 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత విరాట్ కోహ్లీ పెవిలియన్ చేరాడు.