నాలుగో రోజు ఆట ముగిసే సరికి 40 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 164 పరుగుల స్కోరు చేసిన టీమిండియా... క్రీజులో విరాట్ కోహ్లీ, అజింకా రహానే.. విజయానికి ఇంకా 280 పరుగుల దూరంలో టీమిండియా.. 

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 ఆసక్తికరంగా మారింది. 444 పరుగుల భారీ లక్ష్యంతో నాలుగో ఇన్నింగ్స్ బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 164 పరుగుల స్కోరు చేయగలిగింది.

ఆస్ట్రేలియా విధించిన 444 లక్ష్యానికి ఇంకా 280 పరుగుల దూరంలో ఉంది టీమిండియా. ఆఖరి రోజు 3 సెషన్లలో టీమిండియా ఈ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. మరోవైపు ఆస్ట్రేలియా గెలవాలంటే ఇంకా 7 వికెట్లు తీయాల్సి ఉంటుంది. 

విరాట్ కోహ్లీ, అజింకా రహానే కలిసి నాలుగో వికెట్‌కి 118 బంతుల్లో 71 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 7 ఫోర్లతో 44 పరుగులు చేయగా అజింకా రహానే 59 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ ఆఖరి రోజు ఎంత సేపు బ్యాటింగ్ చేస్తారు? ఎన్ని పరుగుల జోడిస్తారనే దానిపైన టీమిండియా రిజల్ట్ ఆధారపడి ఉంది. 

444 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, టీ బ్రేక్ విరామానికి ముందు శుబ్‌మన్ గిల్ వికెట్ కోల్పోయింది. 19 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి బలయ్యాడు. 

బోలాండ్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్ ఇచ్చిన క్యాచ్‌ని స్లిప్‌లో కామెరూన్ గ్రీన్ డైవ్ చేస్తూ అందుకున్నాడు. అయితే టీవీ రిప్లైలో బంతి నేలను తాకినట్టు స్పష్టంగా కనిపించినా థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు..

ఆ తర్వాత రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పూజారా కలిసి రెండో వికెట్‌కి 51 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 60 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 43 పరుగులు చేసిన రోహిత్ శర్మ, నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు..

నాథన్ లియాన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ అవుట్ కావడం టెస్టుల్లో ఇది 9వ సారి. ఆ తర్వాత ఐదు బంతులకే ఛతేశ్వర్ పూజారా కూడా పెవిలియన్ చేరాడు. 47 బంతుల్లో 5 ఫోర్లతో 27 పరుగులు చేసిన పూజారా, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. 

ఆస్ట్రేలియాపై టెస్టుల్లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, ఈ ఫీట్ సాధించిన ఆరో భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్, ఛతేశ్వర్ పూజారా, రాహుల్ ద్రావిడ్ ఈ ఫీట్ సాధించారు..

అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో చేసిన 44 పరుగులతో టీమిండియా తరుపున ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ నిలిచాడు విరాట్ కోహ్లీ. సచిన్ టెండూల్కర్, ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో 657 పరుగులు చేస్తే, విరాట్ ఆ రికార్డును అధిగమించేశాడు..

ప్రస్తుతం టీమిండియా తరుపున ఐసీసీ టోర్నీల్లో అత్యధిక పరుగులు, అత్యధిక హాఫ్ సెంచరీలు, సెమీ ఫైనల్‌లో, ఫైనల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ.. 

అజింకా రహానే, విరాట్ కోహ్లీ కలిసి నాలుగో వికెట్‌కి 3 వేల పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన మొదటి భారత జోడీగా నిలిచారు. ఇంతకుముందు టీమిండియా తరుపున సచిన్ టెండూల్కర్- సౌరవ్ గంగూలీ కలిసి 2695 పరుగులు, సచిన్ టెండూల్కర్ - వీవీఎస్ లక్ష్మణ్ కలిసి 1753 పరుగుల భాగస్వామ్యం జోడించారు..