ICC WTC final 4వ రోజు లంచ్ బ్రేక్ సమయానికి 201/6 పరుగులు చేసిన ఆస్ట్రేలియా... టీమిండియాపై 374 పరుగుల భారీ ఆధిక్యం..

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023లో నాలుగో రోజు తొలి సెషన్‌లో కూడా ఆస్ట్రేలియా ఆధిపత్యమే సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 123/4 వద్ద నాలుగో రోజు ఆట మొదలెట్టిన ఆస్ట్రేలియా, తొలి సెషన్‌లో కేవలం 2 వికెట్లు కోల్పోయింది. నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 70 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది ఆస్ట్రేలియా.

తొలి ఇన్నింగ్స్ లీడ్‌తో కలిపి టీమిండియా కంటే 374 పరుగుల ఆధిక్యంలో ఉంది ఆసీస్. 126 బంతుల్లో 4 ఫోర్లతో 41 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్, ఓవర్‌ నైట్‌ స్కోరుకి పరుగులేమీ జోడించకుండానే ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో పూజారాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ కలిసి ఆరో వికెట్‌కి 43 పరుగుల భాగస్వామ్యం జోడించారు..

95 బంతుల్లో 4 ఫోర్లతో 25 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత మిచెల్ స్టార్క్, అలెక్స్ క్యారీ కలిసి వికెట్ల అడ్డుగా నిలబడిపోయారు. అలెక్స్ క్యారీ 61 బంతుల్లో 5 ఫోర్లతో 41 పరుగులు, మిచెల్ స్టార్క్ 19 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు...

వికెట్ పడిన తర్వాత కూడా కొత్త బ్యాటర్లపై ఒత్తిడి పెంచడంలో కెప్టెన్ రోహిత్ శర్మ, బౌలర్లు విఫలం అవుతున్నారు. దీంతో ప్రతీ వికెట్‌‌కి భాగస్వామ్యాలు జోడిస్తున్న ఆస్ట్రేలియా, టీమిండియా ముందు ఇప్పటికే కొండంత లక్ష్యాన్ని పెట్టేసింది..

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 250 పరుగులకి ఆలౌట్ అయినా 430+ పరుగుల లక్ష్యాన్ని నాలుగో ఇన్నింగ్స్‌లో ఛేదించాల్సి ఉంటుంది టీమిండియా. ఆఖరి రోజు ఇంత భారీ టార్గెట్‌ని ఛేదించడం టీమిండియాకి చాలా కష్టమైపోవచ్చు.. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగుల భారీ స్కోరు చేసింది. ట్రావిస్ హెడ్ 163, స్టీవ్ స్మిత్ 121 పరుగులు చేసి సెంచరీలు అందుకోగా అలెక్స్ క్యారీ 48, డేవిడ్ వార్నర్ 43 పరుగులు చేశారు..

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 296 పరుగులకి ఆలౌట్ అయ్యింది. రోహిత్ శర్మ 15, శుబ్‌మన్ గిల్ 13, ఛతేశ్వర్ పూజారా 14, విరాట్ కోహ్లీ 14 పరుగులు చేయగా రవీంద్ర జడేజా 48 పరుగులు చేశాడు. శ్రీకర్ భరత్ 5 పరుగులకే అవుట్ కాగా అజింకా రహానే, శార్దూల్ ఠాకూర్ కలిసి ఏడో వికెట్‌కి 109 పరుగుల భాగస్వామ్యం జోడించారు..

అజింకా రహానే 89 పరుగులు చేయగా శార్దూల్ ఠాకూర్ 51 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు మెరుగ్గానే రాణించారు. డేవిడ్ వార్నర్ 1. ఉస్మాన్ ఖవాజా 13 పరుగులు చేసి అవుట్ కాగా స్టీవ్ స్మిత్ 34, ట్రావిస్ హెడ్ 18 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అవుట్ అయ్యారు.