Asianet News TeluguAsianet News Telugu

రోహిత్ శర్మ, పూజారా కూడా అవుట్... మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా! లక్ష్యానికి ఇంకా ఆమడ దూరంలో...

WTC final 2023: రెండో ఇన్నింగ్స్‌లో 43 పరుగులు చేసిన రోహిత్ శర్మ, 27 పరుగులు చేసి అవుటైన ఛతేశ్వర్ పూజారా.. వెంటవెంటనే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా.. 

ICC WTC Final 2023: Rohit Sharma, cheteshwar pujara goes after scoring decent runs in 4th Innings CRA
Author
First Published Jun 10, 2023, 9:10 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 444 పరుగుల రికార్డు టార్గెట్ ఛేదనతో బరిలో దిగిన టీమిండియాకి శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ కలిసి మెరుపు ఆరంభం అందించే ప్రయత్నం చేశారు.. ఈ ఇద్దరూ వన్డే స్టైల్‌లో ఆడుతూ 7 ఓవర్లలో 41 పరుగుల భాగస్వామ్యం జోడించారు.

19 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో స్లిప్‌లో కామెరూన్ గ్రీన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... టీవీ రిప్లైలో బంతి నేలను తాకుతున్నట్టు స్పష్టంగా కనిపించినా థర్డ్ అంపైర్, చాలా సార్లు రిప్లై చూసి... శుబ్‌మన్ గిల్‌ని అవుట్‌గా ప్రకటించాడు.

41/1 స్కోరుతో టీ బ్రేక్‌కి వెళ్లింది టీమిండియా.. శుబ్‌మన్ గిల్ అవుటైన తర్వాత వేగం తగ్గించిన రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పూజారాతో కలిసి రెండో వికెట్‌కి 51 పరుగుల భాగస్వామ్యం జోడించాడు..

60 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 43 పరుగులు చేసిన రోహిత్ శర్మ, నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. డీఆర్‌ఎస్ కోరుకున్నా, బంతి వికెట్లను తాకుతున్నట్టు తేలడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు రోహిత్ శర్మ.. ఆ తర్వాత ఐదో బంతికి ఛతేశ్వర్ పూజారా కూడా పెవిలియన్ చేరాడు. 47 బంతుల్లో 5 ఫోర్లతో 27 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

92 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా, 93 పరుగుల వద్ద పూజారా వికెట్ కూడా కోల్పోయింది. భారత జట్టు విజయానికి ఇంకా 351 పరుగులు కావాలి...

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేసిన ఆస్ట్రేలియా, రెండో ఇన్నింగ్స్‌లో 270/8 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. టీమిండియా ముందు 444 పరుగుల రికార్డు టార్గెట్‌ని పెట్టింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో అలెక్స్ క్యారీ 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా మార్నస్ లబుషేన్ 41, స్టీవ్ స్మిత్ 34, కామెరూన్ గ్రీన్ 25, మిచెల్ స్టార్క్ 41 పరుగులు చేశారు. 

భారత బౌలర్లలో రవీంద్ర జడేజాకి 3 వికెట్లు దక్కగా మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ రెండేసి వికెట్లు తీశారు. మహ్మద్ సిరాజ్‌కి ఓ వికెట్ దక్కింది. శార్దూల్ ఠాకూర్‌కి వికెట్లు దక్కలేదు. 

తొలి ఇన్నింగ్స్‌లో 89 పరుగులు చేసిన అజింకా రహానేపై భారీ అంచనాలు పెట్టుకుంది టీమిండియా. అయితే చేతి వేలి గాయంతో బాధపడుతున్న అజింకా రహానే, నొప్పిని భరిస్తూనే రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అజింకా రహానే, విరాట్ కోహ్లీ జోడి చేసే పరుగులు, నిర్మించే భాగస్వామ్యాన్ని బట్టి మ్యాచ్ రిజల్ట్ ఆధారపడి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios