WTC Final 2023: 270/8 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా... టీమిండియా ముందు 444 పరుగుల కొండంత లక్ష్యం..
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌ని 270/8 వద్ద ఆస్ట్రేలియా డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 173 పరుగుల ఆధిక్యంతో కలిపి మొత్తంగా టీమిండియా ముందు 444 పరుగుల భారీ టార్గెట్‌ని పెట్టింది భారత జట్టు...
రెండో ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ 1 పరుగు చేసి అవుట్ కాగా ఉస్మాన్ ఖవాజా 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరోలు స్టీవ్ స్మిత్ 34, ట్రావిస్ హెడ్ 18 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అవుట్ అయ్యారు.
నాలుగో రోజు ఉదయం సెషన్‌లో మార్నస్ లబుషేన్ వికెట్ త్వరగా కోల్పోయింది ఆస్ట్రేలియా. లబుషేన్ 41 పరుగులు చేసి ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ కాగా కామెరూన్ గ్రీన్ 25 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..
మిచెల్ స్టార్క్ 57 బంతుల్లో 7 ఫోర్లతో 41 పరుగులు చేసి మహ్మద్ షమీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 5 పరుగులు చేసి అవుట్ కావడంతో 84.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసింది ఆస్ట్రేలియా..
ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ 105 బంతుల్లో 8 ఫోర్లతో 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజాకి 3 వికెట్లు దక్కగా ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ రెండేసి వికెట్లు తీశారు. సిరాజ్‌కి ఓ వికెట్ దక్కింది.
2003లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ 418 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి గెలవడమే ఇప్పటిదాకా టెస్టుల్లో అత్యధిక విజయవంతమైన ఛేదన. ఇప్పుడు ఆస్ట్రేలియా, టీమిండియాకి 444 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది. ఇది ఛేదిస్తే టెస్టుల్లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది భారత జట్టు..
టీమిండియా టెస్టుల్లో ఛేదించిన అత్యధిక లక్ష్యం 403 పరుగులు. 1976లో వెస్టిండీస్‌పై 403 పరుగుల లక్ష్యాన్ని చరిత్ర క్రియేట్ చేసింది టీమిండియా. ఈ టెస్టు మ్యాచ్‌లో ఇంకా 137.3 ఓవర్లు మిగిలి ఉండడంతో ఫలితం తేలే అవకాశాలు పుషల్కంగా ఉన్నాయి..
420కి పైగా లక్ష్యఛేదనని ఇప్పటిదాకా టెస్టుల్లో ఏ జట్టూ ఛేదించలేకపోయింది. 222 టెస్టుల్లో ఛేదన జట్టుకి పరాజయం ఎదురవ్వగా, 42 మ్యాచులు డ్రాగా ముగిశాయి. భారత జట్టు ఇప్పటిదాకా 30 టెస్టుల్లో నాలుగో ఇన్నింగ్స్‌లో 410కి పైగా లక్ష్యాన్ని ఎదుర్కోగా 23 మ్యాచుల్లో ఓడిపోయింది, 7 మ్యాచులు డ్రాగా ముగిశాయి..
కెప్టెన్‌గా ఇప్పటిదాకా 8 ఫైనల్స్ ఆడిన రోహిత్ శర్మ, ప్రతీ దాంట్లో విజయాలు అందుకున్నాడు. 5 ఐపీఎల్ ఫైనల్స్‌తో పాటు 2013 ఛాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీ ఫైనల్‌లో గెలిచిన రోహిత్ శర్మ, టీమిండియా తాత్కాలిక సారథిగా ఆసియా కప్ 2018, నిదహాస్ ట్రోఫీలను దక్కించుకున్నాడు. దీంతో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ గెలిస్తే, రోహిత్ ఫైనల్స్ ట్రాక్ రికార్డు కొనసాగుతుంది..
