India W vs Pakistan W: మహిళల ప్రపంచకప్ లో భాగంగా పాకిస్థాన్ తో బ్యాటింగ్ లో తడబడి నిలిచిన భారత క్రికెట్ జట్టు.. బౌలింగ్ లో మాత్రం విశ్వరూపాన్ని ప్రదర్శించింది. టోర్నీలో పాక్ ను చిత్తు చేసి బోణీ కొట్టింది.
న్యూజిలాండ్ వేదికగా జరుగతున్న మహిళల ప్రపంచకప్ లో భాగంగా పాకిస్థాన్ తో తలపడుతున్న భారత జట్టు బౌలర్లు అదరగొట్టారు. బ్యాటింగ్ లో పడుతూ లేస్తూ ఓ మోస్తారు లక్ష్యాన్ని పాక్ ముందు నిలిపిన భారత్.. బౌలింగ్ లో మాత్రం పాక్ బ్యాటర్ల ఆట కట్టించింది. టీమిండియా సీనియర్ బౌలర్ రాజేశ్వరి గైక్వాడ్ నాలుగు వికెట్లతో మెరవగా.. వెటరన్ బౌలర్ జులన్ గోస్వామి తో పాటు ఇతర బౌలర్లు సమిష్టిగా రాణించడంతో వన్డే ప్రపంచకప్ లో భారత్ తొలి విజయాన్ని అందుకుంది. భారత్ నిర్దేశించిన 245 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్.. 43 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా భారత్.. 107 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్.. తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసిన విషయం తెలిసిందే. పూజా వస్త్రకార్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
245 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన పాకిస్థాన్ కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. పాక్ ఇన్నింగ్స్ పదో ఓవర్లోనే ఓపెనర్ జవేరియా ఖాన్ (11) ను గైక్వాడ్ ఔట్ చేయడంతో పాక్ వికెట్ల పతనం ప్రారంభమైంది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన పాక్ సారథి బిస్మా మరూఫ్.. పెద్దగా రాణించలేదు. 25 బంతులు ఆడిన ఆమె.. 2 ఫోర్ల సాయంతో 15 పరుగులు చేసింది. కానీ దీప్తి శర్మ ఆమెను పెవిలియన్ కు పంపింది. ఇక అప్పట్నుంచి పాక్ వికెట్ల పతనం వేగంగా సాగింది.
బిస్మా మరూఫ్ నిష్క్రమించిన వెంటనే క్రీజులోకి వచ్చిన ఒమిమా సోహాలి (5) కూడా క్రీజులో నిలువలేదు. స్నేహ్ రాణా బౌలింగ్ లో దీప్తి శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటైంది.
19 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసిన పాక్ ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు నష్టపోయింది. మిడిలార్డర్ బ్యాటర్ నిద దర్ (4), అలియా రియాజ్ (11), ఫాతిమా సనా (17), వికెట్ కీపర్ సిద్రా నవాజ్ (12) లు కూడా పెద్దగా క్రీజులో నిలువలేదు. ఆఖర్లో డయానా బేగ్ (24) కాస్త ప్రతిఘటించినా.. ఆమె భారత విజయాన్ని మాత్రం అడ్డుకోలేదు. వికెట్ ఇవ్వకూడదని నిశ్చయించుకుని ఆడిన డయానాను.. మేఘనా సింగ్ ఔట్ చేసింది.
భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ నాలుగు వికెట్లతో చెలరేగింది. సీనియర్ పేసర్ జులన్ గోస్వామి, స్నేహ్ రాణా తలో 2 వికెట్లు దక్కించుకున్నారు. దీప్తి శర్మ, మేఘనా సింగ్ కు చెరో వికెట్ దక్కింది.
అంతకుముందు టాస్ గెలిచిన భారత జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. పూజా వస్త్రాకార్ (67), స్నేహ్ రాణా (53), స్మృతి మంధాన (52), దీప్తి శర్మ (40) లు రాణించారు. ప్రపంచకప్ లో పాక్ పై భారత్ కు ఇది వరుసగా మూడో విజయం. అంతేగాక మొత్తంగా 11 వన్డేలలో 11 విజయాలు భారత్ వే..
