ICC Women's World Cup 2022: మహిళల ప్రపంచకప్ లో ఏడో సారి విశ్వవిజేతగా నిలిచే దిశగా ఆస్ట్రేలియా పటిష్ట పునాది వేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు వికెట్ కీపర్ అలిస్సా హేలీ.. ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోసింది. ఫైనల్ లో ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది ఆసీస్.
ఏడో ప్రపంచకప్ గెలవాలన్న పట్టుదల మీద ఉన్న ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు అదిరిపోయే బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు. ప్రపంచకప్ ఫైనల్ లో తొలుత బ్యాటింగ్ చేసే జట్టైనా కోరుకునే ఆరంభాన్ని ఆస్ట్రేలియా మహిళల జట్టు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ.. బౌలింగ్ వేయడానికి వచ్చిన ప్రతి బౌలర్ కు పీడకలగా మిగులుస్తూ చెలరేగింది ఆ జట్టు వికెట్ కీపర్ అలిస్సా హేలీ. హేలీ ఆస్ట్రేలియా పురుషుల జట్టులో స్టార్ బౌలర్ గా ఉన్న మిచెల్ స్టార్క్ భార్య. ఈ మ్యాచులో ఆమె 138 బంతుల్లోనే ఏకంగా 170 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్ లో ఏకంగా 26 బౌండరీలున్నాయి. హేలీతో పాటు మరో ఓపెనర్ హేన్స్ (68), మూనీ (62)లు రాణించడంతో ఇంగ్లాండ్ ముందు ఆ జట్టు భారీ లక్ష్యాన్ని నిలిపింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ టైటిల్ నిలబెట్టుకోవాలంటే 357 పరుగులు చేయాల్సి ఉంది.
న్యూజిలాండ్ లోని క్రిస్ట్ చర్చ్ లో గల హగ్లే ఓవల్ లో జరుగుతున్న మహిళల ప్రపంచకప్ ఫైనల్ లో భాగంగా.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. అయితే భీకరమైన ఫామ్ లో ఉన్న ఓపెనర్ హేలీ.. హేన్స్ లు ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నారు. ఇద్దరూ కలిసి ధాటిగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ఈ జంట తొలి వికెట్ కు 160 పరుగులు జోడించింది. ఇన్నింగ్స్ 30వ ఓవర్లో హేన్స్ నిష్క్రమించింది.
బాదుడే మంత్రంగా.. బంతులు బౌండరీలు దాటగా..
హేన్స్ ఔటైనా ఆమె స్థానంలో క్రీజులోకి వచ్చిన బెత్ మూనీ (47 బంతుల్లో 62.. 8 ఫోర్లు) దూకుడుగా ఆడింది. మరోవైపు సెంచరీ పూర్తి చేశాక హేలీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. వరుస బౌండరీలతో ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించింది. రెండో వికెట్ కు మూనీ-హేలీ లు 154 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అయితే చివర్లో మరింత ధాటిగా ఆడే క్రమంలో హేలీ.. శ్రుభ్షోల్ బౌలింగ్ లో స్టంపౌట్ అయింది. ఆమె చేసిన 170 పరుగులలో ఏకంగా 104 పరుగులు బౌండరీల ద్వారానే రావడం గమనార్హం. ఈ క్రమంలో ఆమె తన పేరిట పలు రికార్డులు నమోదు చేసుకుంది. ప్రపంచకప్ ఫైనల్ లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా రికార్డులు సృష్టించింది. పురుషుల క్రికెట్ లో సైతం 170 పరుగులు చేసిన క్రికెటర్ ఎవరూ లేరు.
హేలీ, హేన్స్, మూనీల వీర బాదుడుతో ఆసీస్.. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 356 పరగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో శ్రుభ్షోల్ మినహా.. మిగిలినవారంతా ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. ఈ ట్రోపీలో ఇంగ్లాండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న ఎకెల్స్టోన్ ఏకంగా పది ఓవర్లలో 71 పరుగులు ఇచ్చింది.
ఇంగ్లాండ్.. ముగ్గురు ఔట్
కాగా లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ కు ఆశించిన ఆరంభమేమీ దక్కలేదు. ఇన్నింగ్స్ 2వ ఓవర్లోనే ఆ జట్టు.. గత మ్యాచ్ లో (దక్షిణాఫ్రికా) మీద సెంచరీ చేసిన డానియల్ వ్యాట్ (4) ఔట్ అయింది. మరికొద్దిసేపటికే బీమౌంట్ (27) కూడా నిష్క్రమించింది. ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన కెప్టెన్ హెదర్ నైట్ (26) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగింది. ప్రస్తుతం సీవర్ (26 నాటౌట్), అమీ జోన్స్ (2 నాటౌట్) ఆడుతున్నారు. 16 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ 3 కీలక వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. ఈ మ్యాచులో గెలవాలంటే ఇంగ్లాండ్ ఇంకా 35 ఓవర్లలో 263 పరుగులు చేయాలి.
