TATA IPL 2022: ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతూ నానాటికీ మెరుగవుతున్న కశ్మీరి కుర్రాడు తన తర్వాత మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాజీ సారథిని ఔట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఐపీఎల్-2022లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున సంచలన ప్రదర్శనలు చేస్తున్న కాశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తన నెక్స్ట్ టార్గెట్ సెట్ చేసుకున్నాడు. తనకు టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ అంటే చాలా ఇష్టమని, వాళ్లిద్దరినీ ఔట్ చేయడమన్నది తన డ్రీమ్ అని చెప్పుకొచ్చాడు. అయితే రాహుల్ ను ఔట్ చేయడంలో తన టార్గెట్ కాస్త మిస్ అయిందని, కానీ కోహ్లి విషయంలో మాత్రం అలా జరగదని అంటున్నాడు. సన్ రైజర్స్ శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో మ్యాచ్ ఆడనున్న వేళ ఉమ్రాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఉమ్రాన్ మాట్లాడుతూ... ‘కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి లకు నేను వీరాభిమానిని. ఐపీఎల్ లో ఈ ఇద్దరినీ ఔట్ చేయాలన్నది నా కల. అయితే లక్నోతో ఆడిన మ్యాచ్ లో రాహుల్ భాయ్ ను బౌల్డ్ చేయాలనుకున్నాను. కానీ కుదర్లేదు.
అయితే మేము తర్వాత మ్యాచ్ లో ఆర్సీబీతో ఆడబోతున్నాం. ఆ జట్టులో విరాట్ కోహ్లి భాయ్ అంటే నాకు చాలా ఇష్టం. రాహుల్ ను ఔట్ చేయలేకపోయినా.. ఈ మ్యాచ్ లో కోహ్లి భాయ్ ను తప్పకుండా ఔట్ చేస్తా. ఆ మ్యాచ్ లో నా టార్గెట్ అతడే.. దానికోసం నేను నా వంద శాతం ప్రయత్నిస్తా...’ అని చెప్పుకొచ్చాడు.
కాగా ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆరు మ్యాచులాడిన ఉమ్రాన్ మాలిక్.. తొమ్మిది వికెట్లు తీశాడు. పంజాబ్ తో హైదరాబాద్ ఆడిన గత మ్యాచ్ లో ఏకంగా నాలుగు వికెట్లతో చెలరేగాడు. నిలకడగా 150 కిలోమీటర్లకు తగ్గకుండా వేగంతో పాటు వైవిద్యంగా కూడా బంతులను విసురుతున్న ఈ 22 ఏండ్ల కుర్రాడి బౌలింగ్ ప్రదర్శన చూసి దిగ్గజ క్రికెటర్లు కూడా మంత్ర ముగ్దులవుతున్నారు. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, రవిశాస్త్రి వంటి దిగ్గజ ఆటగాళ్లు సైతం ఉమ్రాన్ బౌలింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదిలాఉండగా.. ఐపీఎల్ లో శనివారం సన్ రైజర్స్ హైదరాబాద్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ (36వ) జరుగనున్నది. ఈ సీజన్ లో ఏడు మ్యాచ్ లాడి 5 విజయాలు (10 పాయింట్లు) 2 ఓటములతో బెంగళూరు రెండో స్థానంలో ఉంది. ఇక హైదరాబాద్ ఆరు మ్యాచులాడి తొలి రెండు మ్యాచులు ఓడినా తర్వాత నాలుగు మ్యాచులు గెలిచి.. 8 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.
