మహేంద్ర సింగ్ ధోని... ఈ పేరు వింటే చాలు క్రికెట్ అభిమానులకు పూనకం వస్తుంది.  భారత జట్టులోకి వచ్చిన కొత్తలోనే అతడి హెయిర్ స్టైల్ కి, హెలికాప్టర్ షాట్లకు అభిమానులు ఏర్పడ్డారు. ఆ తర్వాత జట్టులో అంచెలంచేలుగా ఎదుగుతూ సచిన్, సెహ్వాగ్ వంటి దిగ్గజాలున్న జట్టుకు సారథిగా మారి మరింత మంది అభిమానాన్ని సంపాదించాడు. ఇక కెప్టెన్ భారత జట్టుకు టీ20, వన్డే వరల్డ్ కప్ లు అందించి దాదాపు యావత్ భారత దేశ ప్రజల అభిమానానికి పాత్రుడయ్యాడు. 

ఆ తర్వాత ఐపిఎల్ రాకతో  అతడి క్రేజ్ మరింత పెరిగింది. చెన్నై జట్టు పగ్గాలు చేపట్టి ఎన్నో మరుపురాని విజయాలను అందిస్తూ తమిళ అభిమానులకు ధోని ఆరాద్యుడిగా మారిపోయాడు. అతడంటే వారు ఎంతలా అభిమానాన్ని పెంచుకున్నారో నిన్నటి చెన్నై-డిల్లీ మ్యాచ్ లో భయటపడింది. 

మంగళవారం దిల్లీ-సీఎస్కే మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోని బ్యాటింగ్ చేస్తుండగా ఓ అభిమాని సెక్యూరిటీని దాటుకుంటూ మైదానంలోకి దూసుకువచ్చాడు. అలా అతడు నేరుగా ధోని వద్దకు వెళ్లి కాళ్లపై పడి దండం పెట్టుకున్నాడు. ధోని కూడా ఆ అభిమానిని ఆప్యాయంగా పలకరించి భయటకు పంపించాడు. 

ఆ తర్వాత ఇన్నింగ్స్ ముగించుకుని  పెవిలియర్ వైపు వెళుతుండగా మరో అభిమాని కూడా సేమ్ అలాగే చేశాడు. ధోని వద్దకు వెళ్లి రెండు కాళ్లను మొక్కి అలాగే గట్టిగా  పట్టుకున్నాడు. అతన్ని కూడా ధోని ఆప్యాయంగా పలకరించి పైకి లేపాడు. ఇలా ఒకే మ్యాచ్ లో ధోనికి రెండు సార్లు అభిమానుల నుండి వింత అనుభవం ఎదురయ్యింది. దీన్ని వింత అనుభవం అనేకంటే అమితమైన ప్రేమను అందుకున్నాడు అనడం సరిపోతుందేమో. 

ధోని అంటే పడిచచ్చే అభిమానులు ఇలా సెక్యూరిటీని సైతం లెక్కచేయకుండా మైదానంలోకి దూసుకురావడం మరోసారి చర్చనీయంగా మారింది. ఈ సంఘటన మరోసారి ధోని అంటే అభిమానుల్లో ఎంత ఆరాధ్యభావం దాగుందో భయటపెట్టింది.