ప్రపంచ కప్ మెగాటోర్నీలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆశించిన స్థాయిలో రాణించలేదు. అదే సమయంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అదరగొట్టాడు. అలాగే ఇటీవల యాషెస్ సీరిస్ లో భాగంగా జరిగిన మొదటి వన్డేలో ఆసిస్ ఆటగాడు ఏకంగా రెండు సెంచరీలు సాధించాడు. దీంతో విరాట్ కోహ్లీ ని వీరిద్దరితో పోలుస్తూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

అంతర్జాతీయ క్రికెట్ లో వీరిద్దరు ప్రస్తుతం చాలా గొప్పగా ఆడుతున్నారంటూ కొందరు కోహ్లీని తక్కువచేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటివారికి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైక్ గట్టింగ్ అదిరిపోయే సమాధానమిచ్చాడు. 

''భారత జట్టు అన్ని అంతర్జాతీయ ఫార్మాట్స్ లోనూ తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తోంది.  దానికి ముఖ్య కారణం విరాట్ కోహ్లీ. కెప్టెన్ గా జట్టును ముందుండి  నడిపించడమే కాదు బ్యాట్స్ మెన్ గా కూడా పరుగుల వరద పారిస్తాడు.  క్లిష్ట సమయాల్లో కూడా పరుగులు రాబట్టడం ఎలాగో కోహ్లీకి తెలిసినంతగా మరే ఆటగాడికి తెలియనట్లుంది. ఇలా వన్డే, టీ20, టెస్ట్ ఫార్మాట్ ఏదైనా సరే కోహ్లీ పరుగుల ప్రవాహం ఒకేలా వుంటుంది. ఇలా మూడు ఫార్మాట్లలో రాణిస్తున్న అతడే ప్రస్తుతం  అంతర్జాతీయ క్రికెట్లో నంబర్ వన్. '' అని మైక్ వెల్లడించాడు. 

ముంబైలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మైక్ పాల్గొన్నాడు. ఇందులోనే అతడు కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తాడు. ఆసిస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్, కివీస్ కెప్టెన్ విలియమ్సన్ లు కూడా మంచి ఆటగాళ్లేనని... అయితే వారి స్థానం  కోహ్లీ తర్వాతేనని స్పష్టం చేశాడు.