ENG vs SA T20I: ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్ ను బట్లర్ సేన విజయంతో ప్రారంభించింది. బ్యాటర్లు వీరవిహారం చేయడంతో ఆ జట్టు సఫారీలను చిత్తు చేసింది.
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయిన ఇంగ్లాండ్.. తొలి టీ20లో మాత్రం తమ అసలైన ఆట బయటకు తీసింది. బ్రిస్టల్ వేదికగా సఫారీలతో జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ఇంగ్లాండ్.. 41 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచుల సిరీస్ లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. జానీ బెయిర్ స్టో (53 బంతుల్లో 90, 3 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ కోల్పోయాడు. మోయిన్ అలీ (18 బంతుల్లో 52, 2 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరబాదుడు బాదాడు. భారీ లక్ష్య ఛేదనలో సఫారీలు.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులే చేశారు. ట్రిస్టన్ స్టబ్స్ (28 బంతుల్లో 72, 2 ఫోర్లు, 8 సిక్సర్లు) పోరాడినా ఫలితం దక్కలేదు.
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికాకు ఆదిలోనే డబుల్ షాక్ ఇచ్చాడు ఇంగ్లాండ్ పేసర్ రీస్ టాప్లీ. అతడు తాను వేసిన రెండో ఓవర్లో క్వింటన్ డికాక్ (2), రిలీ రొసో (4) ను పెవిలియన్ కు పంపాడు. కానీ రీజా హెండ్రిక్స్ (57), హెన్రిచ్ క్లాసెన్ (20) లు కాస్త ప్రతిఘటించారు. అయితే పది పరుగుల తేడాతో వాళ్లు కూడా ఔటవడంతో దక్షిణాఫ్రికా 86 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
కానీ చివర్లో వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ సఫారీలను గెలిపించినంత పని చేశాడు. సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లను ఆటాడుకున్నాడు. అతడికి అండగా అండిల్ పెహ్లుక్వాయో (17 బంతుల్లో 22, 3 ఫోర్లు) కాసేపు ఫర్వాలేదనిపించాడు. కానీ 18.1 ఓవర్లో రిచర్డ్ గ్లీసన్ బౌలింగ్ లో స్టబ్స్.. జేసన్ రాయ్ కు క్యాచ్ ఇవ్వడంతో అతడి ఇన్నింగ్స్ ముగిసింది. దక్షిణాఫ్రికా ఆశలు ఆవిరయ్యాయి.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. ఆది నుంచే దూకుడుగా ఆడింది. కెప్టెన్ జోస్ బట్లర్ 7 బంతుల్లోనే 2 బౌండరీలు, 2 సిక్సర్లతో 22 పరుగులు చేశాడు. కానీ అతడిని లుంగి ఎంగిడి 2.4 ఓవర్లో ఔట్ చేశాడు. తన తర్వాత ఓవర్లో ఎంగిడి.. జేసన్ రాయ్ (8) ను కూడా పెవిలియన్ కు పంపాడు. ఈ క్రమంలో డేవిడ్ మలన్ (23 బంతుల్లో 43, 1 ఫోర్, 4 సిక్సర్లు) కు జతకలిసిన బెయిర్ స్టో (53 బంతుల్లో 90, 3 ఫోర్లు, 8 సిక్సర్లు).. వీరవిహారం చేశాడు.
కాసేపటికే మలన్ నిష్క్రమించినా మోయిన్ అలీ రాకతో దక్షిణాఫ్రికాకు కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. దొరికిన బంతిని దొరికనట్టుగా సిక్సర్లతో చెలరేగాడు అలీ.. ముఖ్యంగా స్టబ్స్ వేసిన 16వ ఓవర్లో అలీ, బెయిర్ స్టో లు20 పరుగులు, 17వ ఓవర్ వేసిన పెహ్లుక్వాయో బౌలింగ్ లో 33 పరుగులు రాబట్టారు. ఎంగిడి వేసిన 18వ ఓవర్లో కూడా 17 పరుగులొచ్చాయి.ఎంగిడి వేసిన ఈ ఓవర్లో సిక్సర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అలీ.. ఇంగ్లాండ్ తరఫున అతి తక్కువ బంతుల్లో అర్థ సెంచరీ చేసుకున్న ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 16 బంతుల్లోనే అతడు 50 పరుగులు పూర్తి చేశాడు. ధాటిగా ఆడే క్రమంలో ఇంగ్లాండ్ చివర వికెట్లు కోల్పోయినా భారీ స్కోరును చేయగలిగింది.
