Asianet News TeluguAsianet News Telugu

బ్రూక్, డకెట్‌ల వీరవిహారం.. మూడో టీ20 ఇంగ్లాండ్‌దే.. పాకిస్తాన్ పప్పులుడకలేదు..

PAK vs ENG T20I: పాకిస్తాన్ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్.. ఏడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఆధిక్యం సంపాదించింది. రెండో టీ20లో  డబుల్ సెంచరీ లక్ష్యాన్ని అవలీలగా చేదించిన పాక్.. మూడో మ్యాచ్ లో బోల్తా కొట్టింది. 

England Beat Pakistan by 63 Runs in 3rd T20I, Lead The Series 2-1
Author
First Published Sep 24, 2022, 11:52 AM IST

పాకిస్తాన్ -ఇంగ్లాండ్ మధ్య  జరుగుతున్న టీ20 సిరీస్ లో ఆధిక్యం మరోసారి చేతులు మారింది. తొలి టీ20లో ఇంగ్లాండ్ గెలవగా రెండో మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిచింది. ఇక శుక్రవారం కరాచీ వేదికగా ముగిసిన మూడో మ్యాచ్ లో ఇంగ్లాండ్ మళ్లీ పుంజుకుంది.  టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 221 పరుగుల భారీ స్కోరు చేసింది. హ్యారీ బ్రూక్ (35 బంతుల్లో 81 నాటౌట్, 8 ఫోర్లు, 5 సిక్సర్లు), డకెట్ (42 బంతుల్లో 70 నాటౌట్, 8 ఫోర్లు 1 సిక్స్) లు వీరవిహారం చేశారు. అనంతరం పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులకే పరిమితమైంది.

రెండో మ్యాచ్ లో 199 పరుగుల లక్ష్యాన్ని పాక్ ముందు నిలిపినా ఓడిపోయామన్నో కసి మీద ఉన్నారో ఏమో గానీ ఈ మ్యాచ్ లో  ఇంగ్లాండ్ బ్యాటర్లు రెచ్చిపోయారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన  ఇంగ్లాండ్.. రెండో ఓవర్లోనే సాల్ట్ (8) వికెట్ కోల్పోయింది.

కానీ మరో ఓపెనర్  విల్ జాక్స్ (22 బంతుల్లో 40, 8 ఫోర్లు) ధాటిగా ఆడాడు.  డేవిడ్ మలన్ (14) విఫలమైనా  డకెట్,  బ్రూక్ లు ముందు నెమ్మదిగా ఆడారు. కుదురుకున్నాక ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. వీరి ధాటికి పాక్ బౌలర్లలో షహన్వాజ్ దహానీ  4 ఓవర్లలో ఏకంగా 62 పరుగులిచ్చుకున్నాడు.  

222 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెండో టీ20లో మాదిరిగా పాక్ ఏదైనా అద్భుతం చేస్తుందని ఆ జట్టు అభిమానులు వేచి చూశారు. ఆ మ్యాచ్ లో ఓపెనర్లే 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. కానీ నిన్నటి మ్యాచ్ లో పాకిస్తాన్ పప్పులుడకలేదు. కెప్టెన్ బాబర్ ఆజమ్ (8) ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (8) లతో పాటు వన్ డౌన్ బ్యాటర్ హైదర్ అలీ (3), ఇఫ్తికార్ అహ్మద్ (6) విఫలమయ్యారు. తొలి పవర్ ప్లేలోనే పాకిస్తాన్ నలుగురు టాపార్డర్ బ్యాటర్ల వికెట్లు కోల్పోయింది. ఆ క్రమంలోషాన్ మసూద్ (66 నాటౌట్), ఖుష్దిల్ షా (29) లు పాక్ ను ఆదుకున్నారు.  ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కున్న వీళ్లు  వికెట్లైతే కాపాడుకున్నారు గానీ పాక్ ను విజయతీరాలకు చేర్చలేదు. 

ఖుష్దిల్ షా ను అదిల్ రషీద్ పెవిలియన్ చేర్చడంతో పాకిస్తాన్ ఛేదన కథ ముగిసింది. తర్వాత వచ్చినోళ్లు కూడా విఫలమవడంతో 20 ఓవర్లలో పాకిస్తాన్.. 8 వికెట్లు కోల్పోయి 158 పరుగుల వద్దే ఆగిపోయింది. ఫలితంగా ఇంగ్లాండ్ 63 పరుగుల తేడాతో గెలుపొందింది. 

 

ఈ విజయంతో  ఏడు మ్యాచ్ ల సిరీస్ లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యం సాధించింది. సిరీస్ తో తర్వాత మ్యాచ్.. ఆదివారం కరాచీ వేదికగానే జరగనుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios