ఆగని వాన.. సాగని ఆట..! ఇంగ్లాండ్, అఫ్గాన్, ఐర్లాండ్, ఆసీస్ మ్యాచ్‌లు రద్దు.. రసవత్తరంగా గ్రూప్-1 సెమీస్ రేసు
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో ఈరోజు నాలుగు జట్లు పోటీ పడాల్సి ఉండగా ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. మెల్‌బోర్న్ లో వరుణుడు ఎడతెరిపి లేకుండా కురియడంతో ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా, ఐర్లాండ్ - అఫ్గానిస్తాన్ మ్యాచ్ లు రద్దయ్యాయి.
స్వదేశంలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాకు వరుస షాకులు తాకుతున్నాయి. అసలే తొలి మ్యాచ్ లో ఓడిన ఆ జట్టు నేడు ఇంగ్లాండ్ తో కీలక మ్యాచ్ ఆడే క్రమంలో ఈ మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడ్డాడు. మెల్‌బోర్న్ లో ఎడతెరిపి లేని వానతో ఈ మ్యాచ్ రద్దైంది. ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియాతో పాటు గ్రూప్-1లో ఉన్న మరో రెండు జట్లు ఐర్లాండ్ - అఫ్గానిస్తాన్ మధ్య మ్యాచ్ కూడా టాస్ కూడా పడకుండానే రద్దైంది.
షెడ్యూల్ ప్రకారం.. అఫ్గాన్-ఐర్లాండ్ నడుమ నేడు భారత కాలమానం ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ జరగాలి. కానీ ఉదయం నుంచి మెల్‌బోర్న్ లో ఎడతెరిపి లేని వాన కురుస్తూనే ఉంది. దీంతో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) లో టాస్ కూడా పడకుండానే అఫ్గాన్ - ఐర్లాండ్ మ్యాచ్ ను రద్దు చేసి ఇరు జట్లకు తలో పాయింట్ ఇచ్చారు.
ఇక మధ్యాహ్నం 1.30 గంటలకు ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్ మధ్య పోరు జరగాల్సి ఉండగా ఈ మ్యాచ్ కూ వరుణుడు అడ్డు తగిలాడు. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. కొద్దిసేపటి తర్వాత వాన ఆగిపోయి మ్యాచ్ ప్రారంభమవుతుందని అనుకున్నా.. వరుణుడు కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ ప్రారంభమైంది. దీంతో రెండు గంటల తర్వాత మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు.
సెమీస్ రేసులో..
ఈ మెగా టోర్నీలో ఆసీస్ ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు (ఒకటి వర్షార్పణం) ఆడింది. న్యూజిలాండ్ తో ఓడి శ్రీలంక మీద గెలిచింది. ఇంగ్లాండ్ తో మ్యాచ్ రద్దైంది. ఫలితంగా ఆ జట్టు గ్రూప్ - 1ల నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఆసీస్ కు మూడు పాయింట్లున్నాయి. నెటరన్ రేట్ (-1.555) కూడా మైనస్ లలో ఉంది. ఆ జట్టు తర్వాత రెండు మ్యాచ్ లు ఈనెల 31న ఐర్లాండ్, నవంబర్ 4న అఫ్గానిస్తాన్ తో ఆడాల్సి ఉంది.
ఇంగ్లాండ్ విషయానికొస్తే.. తొలి మ్యాచ్ లో అఫ్గాన్ ను ఓడించింది. రెండో మ్యాచ్ లో ఐర్లాండ్ తో 5 పరుగుల తేడా (డక్ వర్త్ లూయిస్) తో ఓడింది. మూడో మ్యాచ్ ఆసీస్ తో రద్దైంది. ఆ జట్టు తర్వాత రెండు మ్యాచ్ లు నవంబర్ 1న న్యూజిలాండ్ తో, 5న శ్రీలంకతో తలపడుతుంది. పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్.. రెండో స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ (+0.239) కాస్త మెరుగ్గా ఉండటం ఇంగ్లాండ్ కు లాభించేదే..
ఇక మూడో స్థానంలో ఉన్న ఐర్లాండ్.. మూడింటికి ఒకటి గెలిచి ఒకటి ఓడింది. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ తో పాటు ఐర్లాండ్ కూ మూడు పాయింట్లున్నాయి. ఐర్లాండ్ నెట్ రన్ రేట్.. (-1.170) మైనస్ లో ఉంది.
గ్రూప్-1లో అందరికంటే దారుణంగా దెబ్బతిన్న జట్టు అఫ్గానిస్తాన్. ఆ జట్టు మూడింటికి గాను రెండు మ్యాచ్ లు వర్షార్పణమయ్యాయి. రెండ్రోజుల క్రితం న్యూజిలాండ్ తో పాటు నేటి మ్యాచ్ కూడా వరుణ దేవుడికే అంకితమైంది. దీంతో ఆ జట్టుకు రెండు పాయింట్లు దక్కాయి. గ్రూప్ - 1 లో ఆ జట్టు అట్టడుగు స్థానంలో ఉంది.
ఈ నేపథ్యంలో సెమీస్ కు వెళ్లే జట్లు ఏవి..? అన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది. తర్వాత ఆడబోయే రెండు మ్యాచ్ లలో ఫలితం ఏదైనా తేడాగా వస్తే డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ కు షాక్ తప్పదు. ప్రస్తతమున్న పరిస్థితుల్లో ఇంగ్లాండ్ కు కూడా ముప్పు పొంచే ఉన్నది. మరి గ్రూప్ - 1 నుంచి ఎవరు సెమీస్ కు వెళ్తారు..? అనేది రసవత్తరంగా మారింది.