ఐపిఎల్ సీజన్ 12లో ఇప్పటికే లీగ్ దశను దాటుకుని ప్లేఆఫ్ కు చేరుకున్న మొదటి జట్టు చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఆ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో అనుకోని అడ్డంకి ఎదురయ్యింది. అదే ధోని గాయం, అనారోగ్యం.   

చెన్నై కెప్టెన్ గానే కాకుండా మిడిల్ ఆర్డర్ బ్యాట్ మెన్ గా ధోని చెన్నై జట్టులో కీలమైన ఆటగాడు. అతడెంత కీలకమంటే గాయం కారణంగా సన్ రైజర్స్ తో, అనారోగ్యానికి గురై ముంబై ఇండియన్స్ లతో జరిగిన మ్యాచులను ఆడలేడు. ఈ రెండు మ్యాచుల్లోనూ చెన్నై ఘోర ఓటమిని చవిచూసింది. ఈ ఓటములు చెన్నై జట్టుకి ధోని సేవలు ఎంత అవసరమో చెబుతున్నాయి. 

అయితే మరోసారి ధోని చెన్నై జట్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాయింట్స్ టేబుల్ లో మొదటి నుండి టాప్ లో నిలిచిన చెన్నైని  వెనక్కినెట్టి డిల్లీ క్యాపిటల్స్ ఆ స్థానాన్ని ఆక్రమించుకుంది. ఇలా తమను వెనక్కినెట్టిన డిల్లీపై ప్రతీకారం తీర్చుకోడానికి చెన్నైకి మంచి అవకాశం వచ్చింది. బుధవారం డిల్లీ-చైన్నైల మధ్య పాయింట్స్ టేబుల్ లోనే కాదు ఐపిఎల్ సీజన్లో టాప్ ప్లేస్ కోసం ఆసక్తికరమైన పోరు జరగబోతోంది. ఇలా డిల్లీపై  సత్తా చాటేందుకు అవకాశం వస్తే ఆనందంగా వుండాల్సిన చెన్నై జట్టులో ఆందోళన కనిపిస్తోంది. వారి ఆందోళనకు కారణం ధోని ఈ మ్యాచ్ కు దూరమయ్యే అవకాశాలుండటమే. 

చెన్నై కోచ్ ప్లెమింగ్ మాట్లాడుతూ....''జ్వరంతో బాధపడుతున్న ధోని ఆరోగ్యం మెల్లిగా కుదుటపడుతోంది. కానీ అతడు  పూర్తిగా కోలుకోలేదు. అతడితో మరోసారి మాట్లాడి బుధవారం మ్యాచ్ ఆడటానికి సిద్దంగా వున్నాడో లేదో తెలుసుకుంటాం. అంటూ బాంబు పేల్చాడు. డిల్లీలో తలపడే మ్యాచ్ లో ధోని ఆడటం డౌటేనని పరోక్షంగా కోచ్ వెల్లడించాడు. దీంతో చెన్నై ఆటగాళ్లలోనే కాదు సీఎస్కే అభిమానుల్లో ఆందోళన మొదలయయ్యింది.