IPL 2020 సీజన్ 13లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో చోటు దక్కించుకున్నాడు అబ్దుల్ సమద్ ఫరూక్. 18 ఏళ్ల ఈ యంగ్ సెన్సేషన్... జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చెందిన క్రికెటర్. ఐపీఎల్ ఆడబోతున్న నాలుగో జమ్మూ కాశ్మీరీ క్రికెటర్ సమద్. ఇంతకుముందు పర్వేజ్ రసూల్, మంజూర్ దార్, రషీక్ సలాం ఐపీఎల్ ఆడాడు. 2020 ఐపీఎల్ వేలంలో అబ్దుల్ సమద్‌ను బేస్ ప్రైజ్ రూ. 20 లక్షలకే కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. కశ్మీర్‌లోని రాజౌలి ఏరియా నుంచి ఐపీఎల్ ఆడుతున్న మొదటి క్రికెటర్ సమద్.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 10 మ్యాచులు ఆడిన అబ్దుల్ సమద్ 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో 592 పరుగులు చేశాడు. లిస్టు ఏ క్రికెట్‌లో 8 మ్యాచులాడిన సమద్, 3 హాఫ్ సెంచరీలతో 237 పరుగులు చేశాడు. 11 టీ20 మ్యాచులు ఆడిన సమద్, 240 పరుగులు చేశాడు. భారీ సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడే సమద్, 29 మ్యాచుల్లో 65 సిక్సర్లు బాదాడు. బౌలింగ్‌లోనూ ఆకట్టుకున్న ఈ పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్ 8 వికెట్లు తీశాడు. 

జమ్మూకాశ్మీర్ నుంచి వచ్చిన ఈ యంగ్ సెన్సేషన్ కొట్టే భారీ సిక్సర్లు చూడడమంటే తనకెంతో ఇష్టమని చెప్పాడు భారత ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. సమద్ చిన్నతనం నుంచి అతని ఆటను చూశానని, సీనియర్ బ్యాట్స్‌మెన్ ఇబ్బందిపడిన పిచ్‌లపై కూడా సమద్ ఈజీగా సిక్సర్లు కొడతాడని చెప్పాడు ఇర్ఫాన్ పఠాన్. ఐపీఎల్‌లో సమద్ ఎంపికవ్వడంపై ఆనందాన్ని వ్యక్తం చేశాడు ఈ మాజీ ఆల్‌రౌండర్.