దేశంలో కరోనాతో బాధపడుతున్న రోగులకు ఆక్సిజన్ సిలిండర్ల కొనుగోలు కోసం ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్ 50 వేల అమెరికన్ డాలర్లు విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అతని నుంచి స్ఫూర్తిపొందిన ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ... తనవంతు సాయం ఇవ్వడానికి ముందుకొచ్చాడు.

ఇండియాలో ఉన్న ఆసుపత్రులకు ఆక్సిజన్ సప్లై కోసం 1 బిట్ కాయిన్ (దాదాపు 42 లక్షల రూపాయలు) విరాళంగా ప్రకటించాడు. ‘ఇండియా ఎప్పుడూ నాకు రెండో ఇళ్లు లాంటిది. క్రికెటర్‌గా కొనసాగినన్న రోజులు, రిటైర్మెంట్ తర్వాత కూడా ఇక్కడి ప్రజలతో నాకు ఎంతో చక్కని అనుబంధం ఉంది.

భారతదేశానికి ఎప్పుడూ నా గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. కరోనా విపత్తుతో భారతదేశ ప్రజలు ఇబ్బంది పడడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాను. దయచేసి మీరు కనీస జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లో ఉండండి. చేతులు పరిశుభ్రంగా కడుక్కోండి. మాస్క్ ధరించండి. భౌతిక దూరం పాటించండి’ అంటూ ట్వీట్ చేశాడు బ్రెట్‌లీ.