BCCI Unhappy With NCA: టీమిండియా ఆల్ రౌండర్ దీపక్ చాహర్ కు రెండో గాయంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఎ) పై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆటగాళ్ల ఫిట్నెస్ చూసుకోవాల్సిన ఫిజియోలు ఏం చేస్తున్నారని ఆగ్రహించినట్టు సమాచారం.
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు నిరాశను మిగుల్చుతూ.. దీపక్ చాహర్ కు రెండో గాయం గురించి చావు కబురు చల్లగా చెప్పిన ఎన్సీఎ పై బీసీసీఐ అసంతృప్తిగా ఉందా..? అంటే అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. అప్పటికే నెలకు పైగా ఎన్సీఎ లో ఉంటున్న ఆటగాడు ఉన్నట్టుండి రెండో గాయానికి ఎలా గురయ్యాడని, అక్కడ అన్ని సదుపాయాలు కల్పించినా ఫిజియోలు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆటగాళ్ల ఫిట్నెస్ గురించి ఫిజియోలకు తెలియదా..? వాటి గురించి ముందే ఎందుకు చెప్పడం లేదు..? అని ఎన్సీఎ పై ప్రశ్నల వర్షం సంధించినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే బీసీసీఐ పెద్దలు.. ఎన్సీఎ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ తో పాటు టీమిండియా ఫిజియో (ప్రస్తుతం ఎన్సీఎలో కూడా ఆయనే) నితిన్ పటేల్ తో త్వరలోనే సమావేశం కానున్నట్టు పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
రాబోయే అక్టోబర్ లో ఆస్ట్రేలియా లో జరుగబోయే టీ20 ప్రపంచకప్ తో పాటు వచ్చే ఏడాది భారత్ లో జరగాల్సి ఉన్న వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో ఎన్సీఎ ఇలా ఆటగాళ్ల ఫిట్నెస్ గురించి దోబూచులాటలు ఆడితే అది మొదటికే మోసం వస్తుందని బీసీసీఐ భావిస్తున్నది.
ఈ ఏడాది ఫిబ్రవరి లో వెస్టిండీస్ తో టీ20 సిరీస్ సందర్బంగా ఈడెన్ గార్డెన్ లో జరిగిన ఆఖరి మ్యాచ్ లో బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు దీపక్ చాహర్. ఆ తర్వాత అతడు నేరుగా బెంగళూరులోని ఎన్సీఎ కు వెళ్లాడు. ఐపీఎల్ లో అతడిని రూ. 14 కోట్లు పెట్టి కొన్న చెన్నై సూపర్ కింగ్స్.. సీజన్ మధ్య వరకైనా అతడు తమతో జాయిన్ అవుతాడని ఆశలు పెట్టుకుంది. అయితే ఎన్సీఎ మాత్రం.. నాలుగు రోజుల క్రితం అతడికి రెండో (వెన్ను నొప్పి) గాయం అయిందని, నాలుగు నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉండాలని సూచించింది. అయితే ఇది చెన్నై కంటే భారత క్రికెట్ కు పెద్ద ఎదురుదెబ్బ. రాబోయే రోజుల్లో కీలక సిరీస్ లు ఉన్న నేపథ్యంలో ఇలాంటి వార్తలు వినాల్సి రావడం భారత జట్టుకు మంచిది కాదనే భావనలో బీసీసీఐ ఉంది.
వీళ్ల విషయంలో ఇలా...
ఇక ఎన్సీఎ దీపక్ చాహర్ తో పాటు గతంలో హార్ధిక్ పాండ్యా విషయంలో కూడా ఇలాగే వ్యవహరించి విమర్శలు ఎదుర్కున్నది. పాండ్యా కు గాయమై అతడు పూర్తి ఫిట్ గా లేకున్నా తీసుకొచ్చి దుబాయ్ లో జరిగిన 2021 టీ20 ప్రపంచకప్ ఆడించారు. అతడేమో అక్కడ అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. ఈ ఏడాది న్యూజిలాండ్ జట్టుతో టెస్టు సిరీస్ సందర్బంగా గాయపడ్డ (బొటనవేలు) రవీంద్ర జడేజా.. రెండు నెలల పాటు అక్కడే గడిపాడు. చిన్న గాయానికి కూడా ఇన్నిరోజులు ఎన్సీఎ లో ఏం చేస్తున్నాడని గతంలో సునీల్ గవాస్కర్ కూడా ప్రశ్నలు సంధించాడు.
ఇక భారత సారథి రోహిత్ శర్మ కూడా.. దక్షిణాఫ్రికా సిరీస్ కు ముందు గాయపడి ఫిట్నెస్ సాధించలేక ఇబ్బందులు పడ్డాడు. వీరితో పాటు రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్ లు కూడా ఇటీవలే ఎన్సీఎలో గడిపివచ్చినోళ్లే. వీళ్ల ఫిట్నెస్ మీద కూడా అనుమానాలున్నాయి.
ఎవరూ సంతోషంగా లేరు..
ఈ నేపథ్యంలో బీసీసీఐ.. ఎన్సీఎ పనితీరుపై గుర్రుగా ఉంది. ఇదే విషయమై బీసీసీఐ కి చెందిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ఆటలో ఆటగాళ్లకు గాయాలవడం సాధారణమే. కానీ ఎన్సీఎ మాత్రం ఇందులో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తున్నది. హర్ధిక్ పరిస్థితే చూడండి. ఎవరూ కాదనలేని విషయమది. ఎన్సీఎ లో ప్రపంచంలోనే ఉత్తమ పరికరాలు, టెక్నాలజీతో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. అవసరమైతే విదేశాల నుంచి బెస్ట్ ఫిజియోలను రప్పిస్తాం.. మేము నితిన్ పటేల్, వీవీఎస్ తో సమావేశమై ఇలా ఎందుకు జరుగుతుంతో తెలుసుకుంటాం. పదే పదే ఆటగాళ్లు ఎందుకిలా గాయాల పాలవుతున్నారనేదానిపై దృష్టి పెడతాం. నిజంగా చెప్పాలంటే ఈ పరిస్థితుల్లో ఎవరూ సంతోషంగా లేరు..’ అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
