WTC Final 2023: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ హెడ్‌కోచ్ గా టీమ్ పై తనదైన ముద్ర వేయడంలో దారుణంగా విఫలమయ్యాడని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ లో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పేలవ ప్రదర్శన నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు టీమిండియాపై దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ.. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ను టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశాడు. ఆటగాడిగా ద్రావిడ్ గొప్పోడని, అందులో సందేహమే లేదని కానీ కోచ్ గా మాత్రం అతడు టీమ్ కు చేసిందేమీ లేదని వాపోయాడు. అసలు భారత జట్టును ద్రావిడ్ ఏం చేస్తున్నాడో అర్థం కావడంలేదని.. అది దేవుడికే తెలియాలని వ్యాఖ్యానించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ లో టీమిండియా ప్రదర్శన పట్ల కూడా బాసిత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తన యూట్యూబ్ ఛానెల్‌లో బాసిత్ మాట్లాడుతూ.. ‘రాహుల్ ద్రావిడ్ కు నేను చాలా పెద్ద అభిమానిని. ఈ విషయం నేను గతంలో కూడా చెప్పా. అతడు క్లాస్ ప్లేయర్. ఇందులో సందేహమే లేదు. కానీ కోచ్ గా మాత్రం ద్రావిడ్ జీరో.
భారత్ లో టర్నింగ్ పిచ్ లను తయారుచేయిస్తున్నారు. నేను ఒక ప్రశ్న అడుగుతా నాకు సమాధానం చెప్పండి. అసలు ఆస్ట్రేలియా కు గానీ ఇంగ్లాండ్ కు గానీ వెళ్తే అక్కడ ఎవరైనా టర్నింగ్ పిచ్ లు చేస్తారా..? వాళ్లకు బౌన్సీ వికెట్స్ ఉంటాయి. అందుకు అనుగుణంగా పిచ్ లను తయారుచేసుకోవాలి గానీ ఇవెందుకో అర్థం కాదు అసలు ద్రావిడ్ టీమిండియాను ఏం చేయదలుచుకున్నాడో అతడి ప్లాన్స్ ఏంటో అర్థం కావడంలేదు. ఇవన్నీ ఆ భగవంతుడికే తెలియాలి. అతడు ఏం చేస్తున్నాడు..? ఏం ఆలోచిస్తున్నాడనేది కూడా దేవుడికే తెలియాలి..’అని చెప్పాడు.

ఇక భారత జట్టు ఆటతీరుపై స్పందిస్తూ.. ‘ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నప్పుడే భారత్ మ్యాచ్ ఓడిపోయింది. ఇండియా బౌలింగ్ ఐపీఎల్ లో మాదిరిగానే సో సో గానే ఉంది. లంచ్ టైమ్ వరకు రెండు వికెట్లు తీయగానే భారత బౌలర్లు మ్యాచ్ గెలిచినంత హ్యాపీగా కనిపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టు మ్యాచ్ గెలవాలంటే ఆసీస్ ను రెండో ఇన్నింగ్స్ లో త్వరగా ఆలౌట్ చేసి ఏదైనా అద్భుతాలు జరుగుతాయో లేదో వేచి చూడాలి. ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ చేసినప్పుడు 120 ఓవర్లలో భారత్ నుంచి రహానే, కోహ్లీ, జడేజా తప్ప మిగతా ఫీల్డర్లు చాలా బద్దకంగా కనిపించారు..’అని చెప్పాడు.
రెండ్రోజుల క్రితం బాసిత్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగానే డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆసీస్ బాల్ ట్యాంపరింగ్ చేసిందని ఆరోపించిన విషయం తెలిసిందే.
