Asianet News TeluguAsianet News Telugu

పీసీబీకి చివరి ఛాన్స్..! రేపు ఏసీసీ కీలక సమావేశం.. ఆసియా కప్ నిర్వహణే ప్రధాన ఎజెండా..

Asia Cup 2023: ఈ ఏడాది సెప్టెంబర్ లో  పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉన్న  ఆసియాకప్ - 2023 లో భాగంగా పాక్ కు వెళ్లేందుకు భారత్ అంగీకరిస్తుందా..? లేదా..? 
 

Ahead Of Crucial Meeting, PCB Chief Najam  sethi Make Sensational Comments MSV
Author
First Published Mar 19, 2023, 8:33 PM IST

ఆసియా కప్ నిర్వహణపై  పాకిస్తాన్ అమీతుమీకి సిద్ధమైంది.   షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ పాక్ లోనే నిర్వహించాల్సి ఉంది. కానీ భద్రతా కారణాల దృష్ట్యా  ఆసియా కప్ ఆడేందుకు తాము   పాకిస్తాన్ కు రాబోమని..  తటస్థ వేదిక పై అయితేనే ఆసియా కప్ ఆడతామని బీసీసీఐ  ఇదివరకే పలుమార్లు  తన వైఖరిని స్పష్టం చేసింది. అయితే  దీనికి ససేమిరా అంటున్న పాక్ కూడా ఆసియా కప్  ఆడేందుకు గాను భారత్ తమ దేశానికి రాకుంటే తాము కూడా వన్డే వరల్డ్ కప్ ఆడటానికి  ఇండియాకు వెళ్లబోమని  హెచ్చరిస్తూనే ఉన్నది. 

ఇదిలాఉండగా ఆసియా కప్ నిర్వహణపై  మార్చి 20న దుబాయ్ లో కీలక సమావేశం జరుగనుంది.  ఈ మీటింగ్ లో పాకిస్తాన్ లో ఆసియా కప్ ఉంటుందా..? లేదా..? అనేదానిపై ఒక స్పష్టత రానున్నదని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి. 

ఈ సమావేశానికి బీసీసీఐ కార్యదర్శి అయిన   జై షా.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడి హోదాలో హాజరుకానున్నాడు.  పీసీబీ చీఫ్ నజమ్ సేథీ సారథ్యంలోని  బృందంతో పాటు ఏసీసీలో సభ్యదేశాల ప్రతినిధులు కూడా ఈ మీటింగ్ కు హాజరవుతారు. వాస్తవానికి రేపు జరుగబోయేది ఏసీసీ  సభ్యుల ఎగ్జిక్యూటివ్  బోర్డుల  సమావేశమైనా  ప్రధానంగా చర్చ అంతా ఆసియా కప్ నిర్వహణ మీదే జరుగనుందని  తెలుస్తున్నది.    

గత నెలలో పీసీబీ చీఫ్ నజమ్ సేథీ.. ఇదే అంశంపై బహ్రెయిన్ లో  ఓ సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  బహ్రెయిన్ లో కూడా బీసీసీఐ ప్రతినిధి బృందం తమ వైఖరిని  కరాఖండీగా చెప్పేసింది. అయితే  రేపు జరుగబోయే  సమావేశంలో సభ్యుల మద్దతు కూడగట్టాలని పీసీబీ భావిస్తున్నది. ఏసీసీ సభ్యదేశాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి బీసీసీఐ మీద ఒత్తిడి పెంచాలని  పీసీబీ  అనుకుంటున్నది.. ఇదే సమయంలో బీసీసీఐ తన ధన బలంతో మిగిలిన సభ్యదేశాలను తమవైపునకు తిప్పుకునే ప్రమాదం కూడా ఉందని, అందుకు కూడా సిద్ధంగా ఉండాలని పీసీబీ వర్గాలు తెలిపాయి.  

పలు మీడియా కథనాల ప్రకారం.. ఈ నెల చివరివారంలో దుబాయ్ లోనే  ఐసీసీ  బోర్డు సమావేశం కూడా జరుగనుంది. ఈ సమావేశంలో కూడా పీసీబీ.. తమ వాదనను వినిపించి భారత్ పై  ఒత్తిడి పెంచే విధంగా చేయాలని వ్యూహాలను పన్నుతున్నది.   ఈ సమావేశాలపై పీసీబీ చీఫ్ నజమ్ సేథీ మాట్లాడుతూ.. ‘ఈ విషయం (ఆసియా కప్ నిర్వహణ)లో ఏసీసీ సభ్య దేశాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరం.   మేం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే బీసీసీఐ తన ధనబలంతో  ఏసీసీ సభ్య దేశాలతో పాటు ప్రపంచ  క్రికెట్ (ఐసీసీ) లో  కూడా తమకు అనుకూలంగా  మాట్లాడించుకోవచ్చు.   నేనైతే ఆసియా కప్ లో సీనియర్ మెంబర్స్ అందరికీ దీని గురించి మాట్లాడాను. మా సమస్యలు వారికి వివరించాను.  వాటికి పరిష్కారాలు కూడా కనుగొంటామని నేను భావిస్తున్నా..’అని తెలిపాడు. ఈ నేపథ్యంలో రేపు జరుగబోయే సమావేశం  ప్రాధాన్యత సంతరించుకుంది. తటస్థ వేదికపై ఆసియా కప్ నిర్వహణ కు ససేమిరా ఒప్పుకోమంటున్న పాక్..  దాయాది దేశానికి వచ్చేదే లేదంటున్న బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios