IND vs PAK: నా మ్యాచ్ నువ్వు చూడు.. నీ మ్యాచ్ నేను చూస్తా.. ఇద్దరం కలిసి ఆదివారం కొట్టుకుందాం..
T20 World Cup 2022: క్రికెట్ ప్రపంచమంతా కండ్లు కాయలు కాసేలా ఎదురుచూసే మ్యాచ్ లలో భారత్-పాకిస్తాన్ ప్రథమ స్థానంలో ఉంటుంది. టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఇరు జట్ల మధ్య వచ్చే ఆదివారం మెగా ఫైట్ జరుగనున్నది.
మన బలాలను గుర్తించడం కంటే ప్రత్యర్థి బలహీనతలను తెలుసుకోవడం చాలా కీలకం.. చరిత్రలో సాగిన ఎన్నో యుద్ధాలు ఈ సూత్రాన్ని పాటించే జరిగాయి. ప్రత్యర్థి బలహీనతలను అంచనావేసి చక్రవర్తులు తమ యుద్ధ వ్యూహాలకు పదును పెట్టేవారు. నేటి ఆధునిక యుగంలో కూడా యుద్ధం రూపం మారుతున్నా అదే జరుగుతున్నది. ఇక క్రికెట్ లో సైతం ఇండియా-పాకిస్తాన్ క్రికెటర్లూ అదే సూత్రాన్ని పాటిస్తున్నారు. ఒకరు మ్యాచ్ ఆడుతుంటే మరొకరు కన్నార్పకుండా చూస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ లో భాగంగా ప్రాక్టీస్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం భారత జట్టు.. ఆస్ట్రేలియాతో తలపడగా, పాకిస్తాన్ ఇంగ్లాండ్ తో ఆడింది. అయితే ఈ రెండు మ్యాచ్ లు గబ్బా (బ్రిస్బేన్) లోనే జరిగాయి. దీంతో ఈ మ్యాచ్ కు గ్యాలరీలో విశిష్ట అతిథులు వచ్చారు.
సోమవారం ఉదయం జరిగిన ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ ను పాకిస్తాన్ క్రికెటర్లు వీక్షించారు. బ్రిస్బేన్ లో భారత్-పాక్ ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్స్ పక్కపక్కనే ఉన్నాయి. ఉదయం భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుండగా ప్రాక్టీస్ సెషన్ కు వెళ్లబోయే ముందు పాక్ ఆటగాళ్లు కాసేపు ఇండియా మ్యాచ్ చూశారు. మ్యాచ్ కు వచ్చిన వారిలో దహానీ, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం (జూనియర్) లు ఉన్నారు.
ఇక సాయంత్రం పాకిస్తాన్ - ఇంగ్లాండ్ మధ్య ఇదే గబ్బా వేదికగా ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ముగించుకున్న భారత జట్టు ఈ మ్యాచ్ చూడటానికి వచ్చింది. టీమిండియాకు చెందిన అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, దీపక్ హుడా, హార్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, అశ్విన్ తదితరులు గ్యాలరీలో ప్రత్యక్షమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ ఫోటోలు నెట్టింట ప్రత్యక్షం కావడంతో ఇరు జట్ల అభిమానులు.. ‘మా మ్యాచ్ చూడటానికి వచ్చిన అతిథులు’ అని కామెంట్స్ చేసుకుంటున్నారు. మరికొందరు మాత్రం తమ ప్రత్యర్థి జట్ల బలహీనతలు తెలుసుకుని రాబోయే ఆదివారం మ్యాచ్ లో వారిని దెబ్బతీయడానికే వచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నెల 23న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య రసవత్తర పోరు జరుగనున్న విషయం తెలిసిందే.