Asianet News TeluguAsianet News Telugu

20 ఏళ్ల కుర్రాడికి కెప్టెన్సీ అప్పగించిన ఢిల్లీ... అండర్-19 వరల్డ్ కప్ విన్నర్ యష్ ధుల్‌కి లక్కీ ఛాన్స్..

రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో ఢిల్లీ జట్టుకి కెప్టెన్‌గా 20 ఏళ్ల యష్ ధుల్...  ఈ ఏడాది మార్చిలోనే ఫస్ట్ క్లాస్ ఎంట్రీ ఇచ్చిన యష్ ధుల్.. ఇషాంత్ శర్మతో పాటు నితీశ్ రాణాకి ఢిల్లీ జట్టులో చోటు.. 

20 year old Yash Dhull appointed as Delhi team captain for Ranji trophy 2022-23 season
Author
First Published Dec 11, 2022, 5:51 PM IST

రంజీ ట్రోఫీలో టీమ్‌ని నడిపించడమంటే ఐపీఎల్‌లో ఫ్రాంఛైజీకి కెప్టెన్సీ చేయడం కంటే ఎక్కువ. అలాంటి అవకాశాన్ని ఆదిలోనే దక్కించుకున్న యంగ్ సెన్సేషన్ యశ్ ధుల్. 20 ఏళ్ల యష్ ధుల్, రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో ఢిల్లీ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు...

ఐపీఎల్‌ స్టార్ ప్లేయర్ నితీశ్ రాణాతో పాటు 105 టెస్టుల అనుభవం ఉన్న సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ కూడా యష్ ధుల్ కెప్టెన్సీలో రంజీ సీజన్ ఆడబోతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫస్ట్ క్లాస్ ఎంట్రీ ఇచ్చిన యష్ ధుల్, 8 మ్యాచులు ఆడి 74.54 సగటుతో 820 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు కూడా ఉన్నాయి...

అండర్ 19 ఆసియా కప్, అండర్ 19 వరల్డ్ కప్ టైటిల్స్ గెలిచి, అందరి దృష్టిని ఆకర్షించిన యంగ్ ఇండియా కెప్టెన్ యష్ ధుల్... 2022 మార్చిలో రంజీ ట్రోఫీలో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. ఆరంగ్రేటం మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేసి సరికొత్త చరిత్ర క్రియేట్ చేసిన యష్ ధుల్... ఛత్తీస్‌ఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగాడు...

‘మా ప్రదర్శన సీజన్ల గడిచే కొద్దీ పడిపోతూ ఉండడాన్ని గమనిస్తూ వస్తున్నాం. అయితే ఓ గీత గీయాల్సిన అవసరం వచ్చిందని గుర్తించాం. ప్రదీప్ సాంగ్వాన్, గత ఏడాది రంజీ ట్రోఫీలో  ఢిల్లీ జట్టును నడిపించాడు. అయితే టీమ్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో అతన్ని తప్పించాం...’  అంటూ ప్రకటించింది ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)...

విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత టీమ్‌లో చోటు కోల్పోయిన ఇషాంత్ శర్మ, రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరుపున తొలి రెండు మ్యాచుల్లో ఆడబోతున్నాడు. డిసెంబర్ 13న మహారాష్ట్రతో తొలి మ్యాచ్ ఆడే ఢిల్లీ, ఆ తర్వాత డిసెంబర్ 17 నుంచి అస్సాంతో రెండో మ్యాచ్ ఆడుతుంది...

రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో తొలి రెండు మ్యాచులకు ఢిల్లీ జట్టు ఇది: యష్ ధుల్ (కెప్టెన్), హిమ్మత్ సింగ్ (వైస్ కెప్టెన్), ధ్రువ్ షోరే, అనుజ్ రావత్, వైభవ్ రావల్, లలిత్ యాదవ్, నితీశ్ రాణా, అయుష్ బదోనీ, హృతిక్ షోకీన్, శివాంక్ వసిస్ట్, వికాస్ మిస్రా, జాంటీ సింధు, ఇషాంత్ శర్మ, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, సిమ్రాన్‌జిత్ సింగ్, లక్ష్య తరేజా, ప్రన్షు విజయ్‌రాణ్

తమిళనాడుతో జరిగిన రంజీ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 150 బంతుల్లో 18 ఫోర్లతో 113 పరుగులు చేసిన యష్ ధుల్, రెండో ఇన్నింగ్స్‌లో 200 బంతుల్లో 13 ఫోర్లతో సెంచరీ నమోదు చేశాడు...  మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు యష్ ధుల్... ఇంతకుముందు 1952-53 సీజన్‌లో నారీ కాంట్రాక్టర్, గుజరాత్ తరుపున ఆరంగ్రేటం మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 152, రెండో ఇన్నింగ్స్‌లో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు...

ఆ తర్వాత 2012-13 రంజీ సీజన్‌లో మహారాష్ట్ర తరుపున ఎంట్రీ ఇచ్చిన విరాగ్ అవతే తొలి ఇన్నింగ్స్‌లో 126, రెండో ఇన్నింగ్స్‌లో 112 పరుగులు చేశాడు... రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరుపున రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసిన ఏడో బ్యాటర్ యశ్ ధుల్. ఇంతకుముందు మన్సూర్ ఆలీ ఖాన్ పటౌడీ, సురిందర్ ఖన్నా, మదన్ లాల్, అజయ్ శర్మ, రమన్ లంబా, రిషబ్ పంత్ ఈ ఫీట్ సాధించారు...
 

Follow Us:
Download App:
  • android
  • ios