ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం కుప్పకూలాయి. అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్ కీలక రేటును 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం, కీలక రంగాల వృద్ధి 50 నెలల కనిష్టానికి పడిపోవడం, డాలర్ విలువ గణనీయంగా బలపడడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వెల్లువెత్తిన ప్రతికూలత నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం ఒక దశలో నిట్టనిలువునా పడిపోయాయి. 

స్టాక్ మార్కెట్లలో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 787 పాయింట్ల మేర క్షీణించింది. 37,000 మార్క్‌ కిందకు పడిపోయింది. మార్చి 5 నుంచి చూస్తే ఇండెక్స్‌ ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. నిఫ్టీ కూడా 10,900 దిగువకు పతనమైంది. కానీ సూచీలు చివర గంటలో షార్ట్‌ కవరింగ్‌తో కొంత కోలుకుని నష్టాలను పూడ్చుకోగలిగాయి. 

సెన్సెక్స్‌ 463 పాయింట్లు పతనమై 37,018 వద్ద, నిఫ్టీ 138 పాయింట్ల నష్టంతో 10,980 వద్ద స్థిరపడ్డాయి. మార్కెట్లో దాదాపు రూ.1.6 లక్షల కోట్ల మేర మదుపరుల సంపద ఆవిరైపోయింది. బీఎస్‌ఈలో 541 స్టాక్స్‌ ఏడాది కనిష్టానికి పడిపోయాయి. 265 స్టాక్స్‌ లోయర్‌ సర్క్యూట్‌ తాకాయి. 

బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంటు, విద్యుత్తు వంటి కీలక రంగాల సంయుక్త వృద్ధి జూన్‌ నెలలో భారీగా పడిపోయింది. 50 నెలల కనిష్టానికి చేరిందన్న సర్కారు గణాంకాలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని కనబరిచింది. దీనికి తోడు విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోతుండటం, దీర్ఘకాల వడ్డీరేట్ల కోతపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అమెరికా ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పోవెల్‌ చెప్పడం తదితర కారణాలు దేశీయ మార్కెట్‌ను కుదిపేశాయి. 

ఫెడ్‌ రేటు కోత నేపథ్యంలో బలమైన డాలర్‌ వల్ల గ్లోబల్‌ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. దీంతో మన మార్కెట్‌పై ఒత్తిడి పెరిగింది. ఇప్పటి వరకు వెలువడుతున్న పలు ప్రధాన సంస్థల ఆర్థిక ఫలితాలు కూడా ఆశాజనకంగా లేకపోవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతింది. బడ్జెట్‌లో పన్ను విధింపు వంటి అంశాల కారణంగా ఎఫ్‌పీఐలు వెనక్కు వెళ్లిపోతున్నారు. 

జూలైలో ఏకంగా రూ.11,000 కోట్లను దేశీ మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్నారు. ఫెడ్‌ వడ్డీ రేట్లు తగ్గకపోతే విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయడం తగ్గించే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. వీక్లీ డెరివేటివ్‌ల కాంట్రాక్ట్‌ గడువు గురువారంతో ముగియనుండడం కూడా మార్కెట్‌ పతనానికి కారణమైంది. 

ఆటో, లోహ, ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్‌, మౌలిక రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో గురువారం ఉదయం సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. 200 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్‌ అంతకంతకూ దిగజారింది. చివరి గంటల్లో ఏకంగా 700 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్‌ అయ్యింది. అటు నిఫ్టీ కూడా 200 పాయింట్లకు పైగా దిగజారింది. 

చివరకు షార్ట్‌ కవరింగ్‌తో కాస్త కోలుకున్నా మార్కెట్లకు భారీ నష్టాలు తప్పలేదు. డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.08గా దరిదాపుల్లో కనసాగింది. దీని ప్రభావం ఎక్కువగా ఐటీ, ఎగుమతి ఆధారిత స్క్రిప్‌లపై కనిపించింది. నిఫ్టీ సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ముగిశాయి. ఒక్క నిఫ్టీ ఆటో మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ నష్టపోయాయి. 

నిఫ్టీ మెటల్‌, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీలు ఎక్కువగా పడిపోయాయి. దాదాపు 3 శాతం క్షీణించాయి. నిఫ్టీ 50లో మారుతీ సుజుకీ, విప్రో, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, పవర్‌ గ్రిడ్‌, రిలయన్స్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. మారుతీ సుజుకీ 2 శాతానికి పైగా పెరిగింది.  అదేసమయంలో వేదాంత, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, హిందాల్కో షేర్లు బాగా నష్టపోయాయి.