Asianet News TeluguAsianet News Telugu

బీవోబీ+ప్లస్ విజయా బ్యాంక్ సరే.. నష్టాల ‘దేనా బ్యాంక్’ దేనికి?

ప్రస్తుతం దేశీయంగా బ్యాంకుల విలీనం ప్రక్రియపై ఆర్థిక రంగం చర్చలు సాగిస్తోంది. ఇంతకుముందే ఎస్బీఐ, దాని అనుబంధ బ్యాంకుల విలీనం ప్రక్రియ ముగిసిపోగా.. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), విజయాబ్యాంక్, దేనా బ్యాంకులను విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించాయి. 

What to expect if your bank goes for a merger
Author
Delhi, First Published Dec 26, 2018, 10:42 AM IST

భారత్‌లో బ్యాంకుల విలీనం కొత్త విషయమేం కాదు. ఎంతోకాలంగా చర్చ సాగుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల ప్రక్రియ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నది. తాజాగా చేపట్టిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌ల విలీన ప్రకటన ఆ కోవలోదే. ఇది విజయవంతమైతే మరిన్ని బ్యాంకుల విలీనానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

ఈ విలీనాల ప్రక్రియ ఎంత మేరకు విజయవంతమవుతుంది? వీటి ఎంపిక సరైనదేనా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) బ్యాంకింగ్‌ వ్యవస్థలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టాయి.

అందులో భాగమే బ్యాంకుల విలీనం.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), దాని అనుబంధ బ్యాంకులతో విలీనానికి కేంద్రం, ఆర్బీఐ శ్రీకారం చుట్టాయి. బ్యాంకుల విలీనాల వల్ల కార్యకలాపాల సామర్థ్యం పెరుగుదలతోపాటు ఖర్చు కూడా తగ్గుతుంది.  

ఒకే ప్రాంతంలో నాలుగైదు బ్యాంకులు ఉండటంతో కార్యకలాపాల్లో కూడా మందగమనం ఉంటుంది. విలీనంతో దీన్ని పరిహరించినట్లవుతుంది. ఐదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆస్తుల వాటాలో 10 శాతం ప్రైవేట్ బ్యాంకుల పరమైంది.

మూలధన సమస్యలు ఇలాగే కొనసాగితే వచ్చే మూడేళ్లలో మరో 10 శాతాన్ని కోల్పోవచ్చు. వీటిని అడ్డుకునేందుకే ప్రభుత్వం విలీన బాట పట్టిందన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయాబ్యాంక్, దెనా బ్యాంకుల విలీనం సరైనదేనా? అన్న ప్రశ్న ఎదురవుతోంది.

ఈ మూడు బ్యాంక్‌ల విలీనం విజయవంతమైతే.. మూడో దశలో పలు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విలీనానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తద్వారా వాటి సంఖ్యను 56 నుంచి 38కి తగ్గించాలనీ భావిస్తోంది.

ఈ నిర్ణయాలు ముందస్తుగా కసరత్తు జరిపి తీసుకున్నారా? లేదా? అన్నది విశ్లేషకుల ప్రశ్న. ఎందుకంటే విలీన ప్రక్రియ సమయంలో స్టాక్‌ మార్కెట్‌ స్పందనే అందుకు నిదర్శనం. బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయాబ్యాంక్, దెనా బ్యాంకుల విలీనం నిర్ణయం తీసుకున్న నాడే గత 14 ఏళ్లలోనే అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 16% నష్టపోవడమే దీనికి నిదర్శనం. 

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) బలమైన బ్యాంకుగా నిలదొక్కుకున్నది. గత మూడేళ్లలో రెండేళ్లు నష్టాలను చవి చూసినా.. దానికి సరిపడా మూలధన నిధులున్నాయి. ఈ మధ్యే మొండి బాకీలన్నీ ప్రక్షాళన చేసింది కూడా. అన్ని బ్యాంకులూ నష్టాల్లో ఉంటే లాభాల్లో ఉన్న అతి కొద్ది బ్యాంకుల్లో విజయా బ్యాంక్‌ ఒకటి.

ఈ నేపథ్యంలో విజయా బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ బరోడా విలీనం సబబుగానే తోస్తుంది. ప్రాంతాల వారీగా చూసినా.. విజయా బ్యాంక్‌కు దక్షిణ ప్రాంతంలో 52% శాఖలుండగా.. బ్యాంక్ ఆఫ్ బరోడాకు 10% మాత్రమే ఉన్నాయి. కాబట్టి మెరుగైన శాఖల విస్తరణగా భావించవచ్చు. 

కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంకుల సరసన చేర్చేందుకు దేనా బ్యాంకును ఎందుకు తీసుకువచ్చారన్నదే ఇక్కడ అతిపెద్ద సందేహంగా మారింది. దేనాబ్యాంకుకు గుజరాత్‌, మహారాష్ట్రల్లో ఎక్కువ శాఖలున్నాయి.

ఈ రెండు రాష్ట్రాల్లో బ్యాంక్ ఆఫ్ బరోడాకు కూడా శాఖలున్నాయి. మూడేళ్లుగా నష్టాలను ప్రకటిస్తూనే ఉంది. వ్యాపారం అభివృద్ధి చెందడం లేదు. 22% స్థూల మొండి బాకీలు గల దేనా బ్యాంకును విలీనం చేస్తే.. మొత్తం మూడు బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్లలో దీని వాటా 20 శాతానికి వస్తుంది.

మరి ఇలా ఉన్న దేనా బ్యాంకును ఈ విలీనంలో ఎందుకు చేర్చారో తెలియడం లేదని మార్కెట్‌ వర్గాల సందేహం. అంతక్రితం జరిగిన విలీనాల విషయానికొస్తే.. బ్యాంక్‌ ఆఫ్‌ మదురైను ఐసీఐసీఐ బ్యాంక్‌ కొన్నా.. ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్‌ను కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ విలీనం చేసుకున్నా.. తమ వ్యాపారం లేని చోట, విస్తరించాల్సిన చోట మరో బ్యాంకుకు శాఖలున్నాయన్నదే ప్రధాన కారణం. 

ఈ మూడు బ్యాంకులూ విలీనమయ్యాక.. దేనా బ్యాంకు వల్ల కొన్ని సమస్యలు రావొచ్చని అంటున్నారు. ఆ బ్యాంకు వల్ల విలీన బ్యాంకుకు మూలధనం సమీకరించడానికి సమస్యలు వచ్చే అవకాశం ఉందని బ్యాంకింగ్‌ వర్గాలే చెబుతున్నాయి.

ప్రభుత్వం మూలధన సాయం చేస్తే తప్ప వృద్ధి విషయంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడం క్లిష్టంగా మారవచ్చు. ఈ విలీనం వల్ల దేనా బ్యాంక్‌ బయటపడుతుంది. విలీన సంస్థకు ఆ సమస్యలు రాకుండా ప్రభుత్వం ఎంతవరకు మూలధన సహాయం చేస్తూ ఉండగలదన్నదే అసలు ప్రశ్న. 

ఒకవేళ ఈ మూడు బ్యాంకుల విలీనం విజయవంతమైతే మాత్రం.. ఇతర బలహీన ప్రభుత్వ రంగ బ్యాంకుల పునరుజ్జీవ దారికి ఎర్ర తివాచీ పరచినట్లే అవుతుంది. ముఖ్యంగా ఆర్బీఐ ప్రకటించిన దిద్దుబాటు కార్యాచరణ ప్రణాళికలో ఉన్న బ్యాంకులకు ఇది వర్తిస్తుంది.

దీర్ఘకాలంలో ప్రభుత్వానికి మూలధన భారం కూడా తగ్గుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య తగ్గే కొద్దీ మూలధన కేటాయింపు, పర్యవేక్షణ సులువై పనితీరు మెరుగవుతుంది. మొత్తం మీద కార్యకలాపాల సామర్థ్యం, పాలన కూడా పుంజుకుంటుంది.

కాగా, బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయాబ్యాంక్, దేనాబ్యాంకుల విలీనంలో ఈ నెలాఖరు కల్లా షేర్ల మార్పిడి నిష్పత్తి ఖరారు కావచ్చునని సంబంధిత వర్గాల కథనం. ఇక మూడు బ్యాంకుల విలీనంతో ఏర్పాటయ్యే కొత్త బ్యాంకు కార్యకలాపాలు వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి రోజు.. అంటే 2019 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios