Asianet News TeluguAsianet News Telugu

Explainer: 'డి-డాలరైజేషన్' అంటే ఏంటి ? డాలర్‌ పతనానికి కారణం ఏంటి ? అమెరికాకు సవాలుగా చైనా, రష్యా వాణిజ్యం

What is de-dollarization: చైనా , రష్యా మధ్య రూబుల్-యువాన్ మారకంలో వాణిజ్యం జరగడంతో ప్రపంచ వ్యాప్తంగా డాలర్ ఆధిపత్యానికి గండి పడే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే బ్రిక్స్ దేశాలు సైతం డాలర్ వాడకాన్ని తగ్గించాలని తీర్మానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా డాలర్ పతనం స్పష్టంగా కనిపిస్తోంది. 

 

What is the reason for the fall of the US dollar? Is the dollar sinking with yuan and ruble trade MKA
Author
First Published May 9, 2023, 12:44 AM IST

రష్యా, చైనా వాణిజ్యంలో యుఎస్ డాలర్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు, యువాన్ - రూబుల్ మారకంలో వాణిజ్యం ప్రారంభించడంతో ప్రపంచ వ్యాప్తంగా అమెరికా డాలర్ ప్రభావం దెబ్బతింటోంది. ఫలితంగా అమెరికన్ డాలర్ విలువ సైతం పతనం చెందుతోంది. చైనా ప్రభుత్వ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఇటీవలి నివేదికలో యుఎస్ డాలర్ విలువ తగ్గిందని, చైనా,  రష్యా మధ్య   ద్వైపాక్షిక వాణిజ్యంలో 70 శాతానికి పైగా యువాన్, రూబుల్‌ మారకం ద్వారా జరుగుతున్నట్లు పేర్కొంది. ఇదే మాటను  రష్యా ఆర్థిక మంత్రి అంటోన్ సిలువానోవ్ రష్యా వార్తా సంస్థ టాస్ తో తెలపడం విశేషం. US డాలర్‌ను రూబుల్ లేదా యువాన్ భర్తీ చేయగలదా అని  అంటోన్ సిలువానోవ్  అడిగినప్పుడు, "పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని" ఆయన బదులిచ్చారు.

మొదటి త్రైమాసికంలో చైనా, రష్యాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 53.8 బిలియన్ డాలర్లుగా ఉండగా, చైనా, యుఎస్ మధ్య 161.6 బిలియన్ డాలర్లుగా చైనీస్ కస్టమ్స్ డేటా ఉందని గ్లోబల్ టైమ్స్ తెలిపింది. అంటే రష్యాతో చైనా వాణిజ్యం అమెరికాతో దాని వాణిజ్యంలో దాదాపు 30 శాతానికి సమానం. 

2022 ప్రారంభం నుండి, రూబుల్-యువాన్ వాణిజ్యం ఎనిమిది రెట్లు పెరిగిందని ది యూరోపియన్ కన్జర్వేటివ్ కోసం రాబర్ట్ సెమియోన్‌సెన్ తెలిపారు. అదనంగా, రష్యా, ఇరాన్ బంగారం-ఆధారిత క్రిప్టోకరెన్సీని రూపొందించడానికి పని చేస్తుండటం గమనార్హం.  అంతర్జాతీయ వాణిజ్య చెల్లింపులలో US డాలర్‌ను గోల్డ్ బ్యాక్డ్ స్టేబుల్‌కాయిన్ భర్తీ చేయగలదనే రష్యా భావిస్తోంది.

అమెరికా ప్రపంచ ఆర్థిక ఆధిపత్యానికి అతిపెద్ద ప్రత్యర్థి అయిన చైనా, అటు లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన బ్రెజిల్ తో వాణిజ్యం, ఆర్థిక లావాదేవీలలో US డాలర్‌ను మధ్యస్థ కరెన్సీగా విడిచిపెట్టడానికి అంగీకరించాయని ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి.  రెండు ఆర్థిక దిగ్గజాలు ఇప్పుడు తమ కరెన్సీలలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిర్వహించనున్నాయి. యువాన్, రియాల్‌లను కరెన్సీని మార్పిడి చేసుకోవాలని తీర్మానించాయి. 

చైనా తాజాగా   రష్యా, టర్కీ, పాకిస్తాన్ తో సహా అనేక ఇతర దేశాలతో ఒకే విధమైన కరెన్సీ ఒప్పందాలను కలిగి ఉంది.  మరిన్ని దేశాలు ఈ లిస్టులో చేరుతున్నాయి.  చైనా నేతృత్వంలోని షాంఘై సహకార సంస్థ (SCO) సభ్యులు - చైనా, రష్యా, భారతదేశం, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, కిర్గిజిస్తాన్ - పరస్పర వాణిజ్యంలో తమ జాతీయ కరెన్సీల వినియోగాన్ని పెంచడానికి ఫిబ్రవరి 2022లో అంగీకరించాయి.

US డాలర్ ప్రపంచ ఆధిపత్యాన్ని దెబ్బతీసే విధంగా, మార్చి చివరి వారంలో, చైనా మొదటిసారి యువాన్‌లో ఇంధన ఒప్పందంపై సంతకం చేసిందని ఇటీవల ఓ కథనం వెలువడింది.  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో 65 వేల టన్నుల ఎల్‌ఎన్‌జి ఒప్పందంపై యువాన్ కరెన్సీ రూపంలో జరిగింది. దీనిపై ఇరు పక్షాలు సంతకం చేశాయి.

డి-డాలరైజేషన్ అంటే ఏంటి..?

సోషల్ మీడియాలో సైతం  డాలర్ ప్రస్థానానికి ముగింపు పడుతోందా అనే అంశం బాగా చర్చకు దారి తీస్తోంది.  ఈ ఏడాది జనవరి-మార్చి మొదటి త్రైమాసికంలో, ట్విట్టర్, రెడ్డిట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో సోషల్ మీడియాలో డి-డాలరైజేషన్ అనే పదాన్ని ఉపయోగించడం పెరిగింది. గత మూడు నెలలతో పోలిస్తే 600 శాతం పెరిగింది. US డాలర్‌కు మించిన ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్న దేశాల సంఖ్య పెరగడం ఈ ధోరణికి కారణమని చెప్పవచ్చు. ట్రంప్ పరిపాలనలో వైట్ హౌస్ కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్స్‌లో మాజీ ప్రత్యేక సలహాదారు, స్టాఫ్ ఎకనామిస్ట్ అయిన జోసెఫ్ సుల్లివన్ ఫారిన్ పాలసీలో డి-డాలరైజేషన్ అనేది వేగంగా జరుగుతోందని నొక్కి చెప్పారు. 

గత నెలలో న్యూ ఢిల్లీలో, రష్యా దిగువ సభ స్టేట్ డూమా డిప్యూటీ చైర్మన్ అలెగ్జాండర్ బాబాకోవ్ మాట్లాడుతూ, రష్యా ఇప్పుడు కొత్త కరెన్సీ అభివృద్ధికి నాయకత్వం వహిస్తోందని అన్నారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రికా - బ్రిక్స్ దేశాలు సరిహద్దు వాణిజ్యం కోసం దీనిని ఉపయోగించాలని పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios