న్యూఢిల్లీ: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆన్‌లైన్‌ కామర్స్‌, డిజిటల్‌ వాలెట్‌ సేవల కంపెనీలు పలు ఆఫర్లను ప్రకటించాయి. స్మార్ట్‌ఫోన్లు, ఫ్యాషన్‌ ఉత్పత్తులు, నగలు, సుగంధ పరిమళాలు మొదలు విమాన టిక్కెట్ల వరకు అన్నింటిపై రాయితీలు కల్పిస్తున్నాయి.

ప్రేమికుల కోసం ప్రత్యేక రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌ వసతులను సైతం అందుబాటులోకి తెచ్చాయి. డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు ద్వారా ఆర్డర్‌ చేసే వారికి ఈ-కామర్స్‌ కంపెనీలు అదనపు ప్రోత్సాహకాలు అందజేస్తున్నాయి.
 
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు షియోమీ, శామ్‌సంగ్‌లు ఎంపిక చేసిన మోడళ్లపై డిస్కౌంట్లు ప్రకటించాయి. ‘ఐ లవ్‌ ఎంఐ డేస్‌’ పేరుతో ఈనెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు షియోమీ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌ కలిసి సేల్‌ ఆఫర్‌ను ప్రకటించాయి.

ఇందులో భాగంగా షియోమీ ఎంఐ పోకో ఎఫ్ ‌1 ఫోన్‌పై గరిష్ఠంగా రూ.3,000 వరకు రాయితీ కల్పిస్తోంది. రెడ్‌మీ 6పై రూ.2 వేల వరకు, రెడ్‌మీ నోట్‌ 5 ప్రో మోడల్‌పై రూ.4,000 డిస్కౌంట్‌ లభించనుంది. స్మార్ట్‌ఫోన్లతోపాటు ఎంఐ స్మార్ట్‌టీవీలు, మొబైల్‌ హెడ్‌ఫోన్లు‌, స్పీకర్లు, పవర్‌ బ్యాంక్‌లు, స్మార్ట్‌ వాచ్‌లపైనా సంస్థ రాయితీలు ఆఫర్‌ చేస్తోంది. 

శామ్‌సంగ్‌ కూడా బెస్ట్‌ డేస్‌ పేరుతో సేల్‌ను ప్రకటించింది. గెలాక్సీ ఎస్‌9ప్లస్‌, గెలాక్సీ నోట్‌9పై రూ.7 వేల వరకు రాయితీ కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్‌లో హెచ్‌డీఎఫ్ సీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డు హోల్డర్లకు అదనంగా రూ.6 వేల వరకు క్యాష్‌ పొందే వీలుంటుంది.

కాగా, యువతను ఆకట్టుకునేందుకు ఆఫ్‌లైన్‌ రిటైల్‌ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున వాలెంటైన్‌ డే ఆఫర్లు ప్రకటించాయి. ముఖ్యంగా జువెల్లరీ, బ్రాండెడ్‌ దుస్తులు, గిఫ్ట్‌ ఐటెమ్స్‌పై డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ఇవేకాక హోటళ్లు, రెస్టారెంట్లు సైతం లవర్స్‌ డే కోసం ముస్తాబయ్యాయి. తమ హోటళ్లలో బస చేసే ప్రేమికుల కోసం ప్రత్యేక ప్యాకేజీలను, ప్రత్యేక మెనూను సిద్ధం చేశాయి.

అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్ పే నుంచి పేటీఎం పేమెంట్ బ్యాంక్ వరకు అన్నీ డిజిటల్ వ్యాలెట్ దిగ్గజాలు ప్రేమికుల కోసం రకరకాల ఆఫర్లు అందుబాటులోకి తెచ్చాయి. క్యాష్ బ్యాక్‌లు, రివార్డ్ పాయింట్లు తదితర ఆఫర్లు ప్రకటించాయి. 

ఉదాహరణకు ఐ ఫోన్లను హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుపై కొనుగోలు చేస్తే రూ.7000 క్యాష్ బ్యాక్, ఐ పాడ్స్, మ్యాక్ బుక్స్ పై రూ.10వేల క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. ఫ్లైట్ టిక్కెట్లపై పేటీఎం రూ.2,500 క్యాష్ బ్యాక్ ప్రకటించింది.