Asianet News TeluguAsianet News Telugu

దాతృత్వంలోనూ ముకేశ్ ఫస్ట్

దేశంలోనే కుబేరుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీ దాతృత్వంలోనూ ముందువరుసలో నిలిచారు.

Top 10 philanthropists in India: Mukesh Ambani donates Rs 437 crore, Ajay Piramal Rs 200 crore! Full list here
Author
New Delhi, First Published Feb 10, 2019, 10:35 AM IST

ముంబై: దేశంలోనే కుబేరుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీ దాతృత్వంలోనూ ముందువరుసలో నిలిచారు. 2018లో చైనా సంస్థ హ్యురన్‌ ఇండియా రూపొందించిన జాబితాలో భారత్‌లో అత్యంత దానశీలిగా ముకేశ్‌ అంబానీకి అగ్రస్థానం లభించింది. కాకపోతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) నిబంధనల అమలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 

దాతృత్వ కార్యకలాపాల కోసం ముకేశ్ అంబానీ రూ.437 కోట్లు ఖర్చు చేశారు. రెండో స్థానంలో ముకేశ్‌ వియ్యంకుడు, పిరమాల్‌ గ్రూపు ఛైర్మన్‌ అజయ్‌ పిరమాల్‌, ఆయన కుటుంబం నిలిచింది. వీళ్లు రూ.200 కోట్ల మేర విరాళంగా ఇచ్చారు. 

దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒక్కటిగా ఉన్న విప్రో సంస్థ ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ మూడో స్థానంలో ఉన్నారు. దాతృత్వ కార్యకలాపాల కోసం ఈయన రూ.113 కోట్లు వెచ్చించారు. విరాళాలిస్తున్న పారిశ్రామికవేత్తల జాబితాలోని 39 మంది భారతీయుల్లో మంజూ డీ గుప్తా ఒక్కరే మహిళ. 

కార్పొరేట్‌ సోషల్ రెస్పాన్సిబిలిటీలో (సీఎస్‌ఆర్‌) భాగంగా రిలయన్స్‌ ఫౌండేషన్‌ ద్వారా విద్య వసతుల కల్పన కోసం అధిక నిధులను విరాళం రూపంలో ముకేశ్‌ అంబానీ ఖర్చు చేస్తున్నారు. విద్యతో పాటు గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ లాంటి వాటికి కూడా తన దాతృత్వ కార్యకలాపాల్లో ఆయన అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని నివేదిక తెలిపింది. 

పిరమాల్‌ కుటుంబం నీతి ఆయోగ్‌తో జట్టుకట్టి పిరమాల్‌ ఫౌండేషన్‌ ద్వారా విద్య, ప్రాథమిక ఆరోగ్యం, పోషకాహారం అందించడం లాంటి వాటికి విరాళంగా ఇస్తోంది. అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ ద్వారా అజీమ్‌ ప్రేమ్‌జీ విద్యా వసతుల కల్పనకు సహకారం అందిస్తున్నారు. 

2017 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 2018 సెప్టెంబర్ 30వ తేదీ మధ్య దాతృత్వ కార్యకలాపాల కోసం రూ.10 కోట్లకు మించి వెచ్చించిన వారితో ఈ జాబితా రూపొందించింది. సగటున రూ.40 కోట్లతో మొత్తంగా జాబితాలోని భారతీయులు దాతృత్వం కోసం ఖర్చు చేసిన డబ్బు రూ.1560 కోట్లని నివేదిక పేర్కొంది.

ముకేశ్ అంబానీ రూ. 437 కోట్లు ఖర్చు చేసి మొదటి స్థానంలో నిలవగా.. ఆయన వియ్యంకుడు అజయ్ పిరమాల్ ఫ్యామిలీ రూ. 200 కోట్లతో రెండో స్థానంలో, విప్రో అధినేత అజిం ప్రేమ్ జీ, కుటుంబం రూ. 113 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు. 

ఇంకా దాతృత్వ కార్యకలాపాల కోసం ఆది గోద్రేజ్ ఫ్యామిలీ రూ. 96 కోట్లు, యూసుఫ్ అలీ రూ. 70 కోట్లు, శివ్ నాడార్ రూ. 56 కోట్లు, సావ్జి డొలాకియా రూ. 40 కోట్లు, షాపూర్ పల్లోంజి మిస్త్రీ రూ. 36 కోట్లు, సైరస్ పల్లోంజి మిస్త్రీ రూ. 36 కోట్లు ఖర్చు చేస్తుండగా, గుజరాత్ కు చెందిన పారిశ్రామికవేత్త గౌతం ఆదానీ రూ. 30 కోట్లు వినియోగిస్తున్నారు. 

పారిశ్రామికవేత్తలంతా విద్య, గ్రామీణాభివ్రుద్ధి, ఆరోగ్య పరిరక్షణ కోసం ఎక్కువగా విరాళాల రూపంలో ఖర్చు చేస్తున్నారు. వివిధ పారిశ్రామికవేత్తలు ఖర్చు చేసిన విరాళాల్లో 30 శాతం వాటా విద్యారంగానిదే. ఆరోగ్య పరిరక్షణ కోసం ఒక్కశాతం నిధులు విరాళాల రూపంలో వస్తున్నాయి. 

భారతదేశంలో గతేడాది దాతృత్వ కార్యకలాపాల కోసం పారిశ్రామిక వేత్తలు రూ.1,560 కోట్లు ఖర్చు చేశారు. సగటున ఇది రూ.40 కోట్లుగా ఉన్నది. 22 మంది సెల్ఫ్ మేడ్, 17 మంది వారసులు విరాళాలు అందజేయడంలో ముందు వరుసలో నిలిచారు. 

హ్యురన్ సంస్థ చీఫ్ రీసెర్చర్, ఎండీ అనస్ రెహ్మాన్ జునైద్ స్పందిస్తూ ‘భారతదేశంలో దాతృత్వ కార్యకలాపాల్లో మార్పు చోటు చేసుకుంటున్నది. పారిశ్రామికవేత్తలు చురుగ్గా  దాతృత్వ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఇందులో అంతర్జాతీయంగా ఆదాయం స్రుష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. వచ్చే ఐదేళ్ల నుంచి 10 ఏళ్లలో  దాతృత్వ కార్యకలాపాలు పుంజుకోవడంతోపాటు చురుగ్గా సాగనున్నాయి’ అని తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios